విద్యుత్తు తీగలు తెగిపడితే.. ఈ జాగ్రత్తలు పాటించాలి

ఏదైనా వాహనంపై విద్యుత్తు తీగలు తెగిపడినప్పుడు భయాందోళనకు గురికాకుండా వాహనంలోనే ఉండిపోవాలని కేంద్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్‌) సీఎండీ పద్మాజనార్దన్‌రెడ్డి

Published : 01 Jul 2022 08:49 IST

ఈనాడు- అమరావతి: ఏదైనా వాహనంపై విద్యుత్తు తీగలు తెగిపడినప్పుడు భయాందోళనకు గురికాకుండా వాహనంలోనే ఉండిపోవాలని కేంద్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్‌) సీఎండీ పద్మాజనార్దన్‌రెడ్డి సూచించారు. వాహనం తలుపులు తెరచుకుని కిందికి దిగితే విద్యుత్తు షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఈ దృష్ట్యా వాహనంలోనే ఉండి 24 గంటలూ పనిచేసే 1912 కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందిస్తే విద్యుత్‌ సిబ్బంది సాయమందిస్తారని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లాలో విద్యుత్‌ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన నేపథ్యంలో పలు జాగ్రత్తలను సూచించారు.

* వర్షాకాలంలో జూన్‌ నుంచి ఆగస్టు మధ్య కాలంలో తీవ్ర విద్యుత్తు ప్రమాదాలు జరగడానికి అవకాశముంది. వర్షాల కారణంగా విద్యుత్తు స్తంభాలు, భూమి తేమగా ఉంటాయి. విద్యుత్తు ఎర్తింగ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. తేమగా ఉన్న విద్యుత్తు స్తంభాలను తాకకూడదు.

* వర్షం జల్లు ఇన్సులేటర్‌పై పడి నీరు నిలిచిపోతుంది. ఈ కారణంగా కండక్టర్‌ షార్ట్‌సర్క్యూట్‌ కావడానికి అవకాశముంది. అప్పుడు తీగలు తెగిపడే ప్రమాదముంది.

* ఏదైనా వాహనంపై విద్యుత్తు తీగలు తెగిపడినప్పుడు వాహనం తలుపు తెరచుకుని బయటకు దిగితే అందులో ఉన్నవారంతా కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. విద్యుత్తు సిబ్బంది సాయమందే వరకు వాహనం నుంచి కిందికి దిగకూడదు. ఒకవేళ వాహనంలో ఉండటం ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం వాహనం తలుపు కూడా అంటుకోకుండా రెండు కాళ్లతో గెంతుతూ వెళ్లాలి. ఇలా వాహనమున్న ప్రదేశంనుంచి సుమారు 30 అడుగుల దూరం వరకు గెంతాలి.

* గెంతుతూ వెళ్లడం ఇబ్బందిగా అనిపిస్తే కాళ్లను పైకి లేపకుండా భూమిపైనే ఉంచుతూ, మెల్లగా ముందుకు కదుపుతూ 30 అడుగుల దూరం వరకు నడవాలి.

* గాలుల కారణంగా స్తంభాలు దెబ్బతిని తీగలు వేలాడుతుంటే అటువైపు వెళ్లకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. తీగలకు దగ్గరకు వెళ్లినా విద్యుత్తుషాక్‌కు గురయ్యే ప్రమాదముంది. షార్ట్‌సర్క్యూట్‌ అయినప్పుడు విద్యుత్తు సామర్థ్యం అనుమతించిన లోడ్‌కంటే సుమారు 20 రెట్లు పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని