జీపీఎఫ్‌ ఖాతాల్లో వడ్డీపై ఉద్యోగుల్లో ఆందోళన

జీపీఎఫ్‌ ఖాతాల్లోని ప్రాథమిక నిల్వపై గురువారం అకౌంటెంట్‌ జనరల్‌(ఏజీ) కార్యాలయం నుంచి వచ్చిన సంక్షిప్త సందేశాలు ఉద్యోగులను ఆందోళనకు గురి చేశాయి. ఉద్యోగులు దాచుకున్న

Published : 01 Jul 2022 04:24 IST

ప్రభుత్వం తీసేసుకుందనే ప్రచారం

ఈనాడు, అమరావతి: జీపీఎఫ్‌ ఖాతాల్లోని ప్రాథమిక నిల్వపై గురువారం అకౌంటెంట్‌ జనరల్‌(ఏజీ) కార్యాలయం నుంచి వచ్చిన సంక్షిప్త సందేశాలు ఉద్యోగులను ఆందోళనకు గురి చేశాయి. ఉద్యోగులు దాచుకున్న మొత్తాలపై వచ్చే వడ్డీని సైతం ప్రభుత్వం వెనక్కి తీసేసుకుందనే ప్రచారం సాగింది. ఏజీ కార్యాలయం వెబ్‌సైట్‌లో పెట్టిన జీపీఎఫ్‌ స్లిప్పులకు, సెల్‌ఫోన్లకు వచ్చిన సందేశాలకు మధ్య నగదు నిల్వల్లో వ్యత్యాసం ఉండడంతో ఉద్యోగులు కలత చెందారు. ఇప్పటికే డీఏ బకాయిలను జమ చేసి, వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఉద్యోగి దాచుకున్న మొత్తాలపై వచ్చే వడ్డీని సైతం తీసేసుకుందని పలువురు  ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం జీపీఎఫ్‌ ఖాతాకు సంబంధించిన స్లిప్పులను ఏజీ కార్యాలయం వెబ్‌సైట్‌లో పెట్టింది. ఇందులో 2021 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి వరకు వడ్డీతో సహా జీపీఎఫ్‌ ఖాతా నిల్వలను చూపారు. గురువారం ఉద్యోగుల సెల్‌ఫోన్లకు పంపిన సంక్షిప్త సందేశాల్లో ప్రాథమిక నిల్వను మాత్రమే పేర్కొన్నారు. వెబ్‌సైట్‌లో పెట్టిన స్లిప్పులోని ముగింపు నిల్వ కంటే సంక్షిప్త సందేశంలో పేర్కొన్న మొత్తం తక్కువగా ఉంది. దీంతో వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం వెనక్కి తీసేసుకుందని ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు.

‘ఏజీ కార్యాలయం నుంచి వచ్చిన సంక్షిప్త సందేశాలను చూసి, ఉద్యోగులు ఎవ్వరూ ఆందోళనకు గురికావొద్దు. వెబ్‌సైట్‌లో పెట్టిన జీపీఎప్‌ స్లిప్పుల్లో వడ్డీతో సహా ముగింపు నిల్వ చూపారు. సెల్‌ఫోన్లకు పంపిన సంక్షిప్త సందేశాల్లో ఉద్యోగి జమ చేసిన మొత్తాన్నే చూపారు. వాస్తవంగా స్లిప్పుల కంటే ముందు సమాచారం ఇవ్వాల్సి ఉండగా.. జీపీఎఫ్‌ స్లిప్పులు పెట్టిన తర్వాత సందేశాలు పంపారు. ఇది ఉద్యోగుల్లో గందరగోళానికి దారి తీసింది. ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగలేదు. మార్చి నెల జమ చేసిన మొత్తంతోపాటు ప్రాథమిక నిల్వను మాత్రమే ఏజీ కార్యాలయం చూపింది. ఏజీ కార్యాలయం అధికారులతో మాట్లాడితే సంక్షిప్త సందేశాలు పంపడంలో ఆలస్యమైందని వెల్లడించారు. స్లిప్పుల్లోని ముగింపు నిల్వ, వడ్డీ యధావిధిగా ఉంటుంది’ అని  ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని