‘మూడేళ్లలో’ మూడోసారి బాదుడు

సర్వీసులో గుడివాడ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికుడు 2019 నవంబరు వరకు టికెట్‌ ఛార్జీగా రూ.30 చెల్లించేవాడు. ఇప్పుడది ఏకంగా రూ.55కి చేరింది.

Updated : 02 Jul 2022 06:53 IST

ప్రయాణికులపై ఆర్టీసీ ఛార్జీల భారం రూ.2,000 కోట్లు

తాజాగా పల్లెవెలుగులో అత్యధికంగా 61.90% పెంపు

ఎక్స్‌ప్రెస్‌ల్లో 56.94% వడ్డింపు

దూరప్రాంతాలకు వెళ్లే సూపర్‌లగ్జరీల్లో 39.65, ఏసీ ఇంద్రలో 34.24% పెరుగుదల

గతంలో ఎన్నడూ లేనట్లుగా నెలల వ్యవధిలోనే పెంపు

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

ఈనాడు - అమరావతి

* సర్వీసులో గుడివాడ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికుడు 2019 నవంబరు వరకు టికెట్‌ ఛార్జీగా రూ.30 చెల్లించేవాడు. ఇప్పుడది ఏకంగా రూ.55కి చేరింది.

* విజయవాడలో ఉద్యోగం చేస్తూ, వారాంతంలో విశాఖకు వెళ్లి వచ్చే ఓ ఉద్యోగికి సూపర్‌ లగ్జరీ బస్సులో 2019 నవంబరులో టికెట్‌ ధర రూ.475. ఇప్పుడది రూ.670కి పెరిగింది.

* ఓ జంట, తమ ఇద్దరు పిల్లలతో 2019లో తిరుపతి నుంచి తిరుమల వెళ్లేందుకు ఘాట్‌ సర్వీసులో ఛార్జీల కింద రూ.180 (పెద్దలు ఇద్దరికి రూ.110, పిల్లలకు రూ.70) ఖర్చు చేశారు. ఇప్పడు వారు రూ.280 (పెద్దలు ఇద్దరికి రూ.180, పిల్లలకు రూ.100) వెచ్చించాల్సి వచ్చింది.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ ఛార్జీల పెంపు అడ్డూ అదుపూ లేకుండా సాగిస్తూ ప్రయాణికుల నడ్డివిరుస్తోంది. జగన్‌ సర్కారు అధికారం చేపట్టిన అయిదు నెలలకే ఛార్జీల మోత మోగించగా.. మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్‌ 14న డీజిల్‌ సెస్‌ పేరిట ఓసారి పెంచింది. తాజాగా శుక్రవారం నుంచి మరోసారి డీజిల్‌ సెస్‌ పేరిట బాదేసింది. మొత్తంగా మూడు దఫాలుగా ఛార్జీల పెంపుతో ప్రయాణికులపై ఇక నుంచి ఏటా దాదాపు రూ.2 వేల కోట్ల మేర భారం పడుతుంది. తాజాగా పల్లెవెలుగు సర్వీసుల్లో అత్యధికంగా 61.90 శాతం మేర ఛార్జీలు పెంచి, గ్రామీణ ప్రజలపై పెనుభారం వేశారు. ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో 43.67, దూరప్రాంతాలకు వెళ్లే సూపర్‌లగ్జరీల్లో 39.65 శాతం, ఇంద్ర ఏసీ బస్సుల్లో 34.24 శాతం.. ఇలా ఏ సర్వీసునూ వదలకుండా అందరినీ బాదేశారు. ప్రజలకు సహేతుక ధరలతో రవాణా సదుపాయం కల్పించాల్సిన ప్రభుత్వ రంగ సంస్థ.. ఇలా పదేపదే ఛార్జీలు పెంచి, ప్రైవేటు సంస్థలా వ్యవహరించడమేంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలం చెల్లిన డొక్కు బస్సులను నడుపుతూ, వాటిలో కూడా ఛార్జీలు పదే పదే పెంచడమేంటని దుమ్మెత్తిపోస్తున్నారు.

పల్లెవాసిపై పిడుగు
ఆర్టీసీ నడిపే బస్సుల్లో 49 శాతం పల్లెవెలుగు సర్వీసులే. ఇందులో ఎక్కువ మంది ప్రయాణికులు రూపాయి రూపాయి లెక్క చూసుకునే పేదలే.

మూడుసార్లు ఛార్జీల పెంపుతో వీరిపైనే అత్యధికంగా భారం వేశారు. పల్లెవెలుగుల్లో 2019 నవంబరులో కి.మీ.కు 63 పైసల చొప్పున ఉన్న ఛార్జి ఇప్పుడు రూ.1.02కి చేరింది. అంటే 61.90% పెరిగింది.

* పల్లెవెలుగు తర్వాత రాష్ట్రంలో ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు 16.39 శాతం ఉన్నాయి. వీటిలోనూ మూడేళ్లలో పెంపు 43.67 శాతానికి చేరింది.

* దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే సూపర్‌ లగ్జరీ సర్వీసులు 12 శాతం ఉంటే.. ఇందులో 39.65 శాతం ఛార్జీలు పెరిగాయి.

ప్రతి దఫా భారీగా వడ్డన 

ఈ ప్రభుత్వం వచ్చాక 2019 డిసెంబరులో ఛార్జీలు పెంచింది. డీజిల్‌, విడిభాగాలు, టైర్ల ధరల పెరుగుదల, ఉద్యోగుల జీతాల భారంతో ఛార్జీలు పెంచుతున్నామంటూ ఏటా ప్రయాణికులపై ఏటా రూ.700 కోట్లకు పైగా భారం వేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 14 నుంచి డీజిల్‌ సెస్‌ పేరిట ఛార్జీలు పెంచి ఏటా మరో రూ.720 కోట్ల మేర ప్రయాణికులపై వడ్డించారు. తాజాగా శుక్రవారం నుంచి పెరిగిన టికెట్‌ ఛార్జీలతో ప్రయాణికులపై ఏటా రూ.500 కోట్లకు పైగా భారం పడుతోంది. మూడు దఫాలుగా పెంచిన ఛార్జీలతో ప్రయాణికులపై ఏటా దాదాపు రూ.2 వేల కోట్ల వరకు భారం పడినట్లయింది.

నెలల వ్యవధిలో పెంపు తొలిసారి 

గతంలో ఆర్టీసీ ఛార్జీలు ఒకసారి పెంచాక కొన్నేళ్లపాటు అవే కొనసాగేవి.ఇప్పుడు ఏప్రిల్‌లో ఛార్జీలు పెంచి మూడు నెలలు తిరక్కుండానే మళ్లీ పెంచేయడంపై ఆర్టీసీ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా నెలల వ్యవధిలో పెంచడం సంస్థ చరిత్రలోనే తొలిసారి అని చెబుతున్నారు.

దూరమయ్యేకొద్దీ భారమే 

ఏప్రిల్‌ 14న పెంచిన ఛార్జీల్లో పల్లెవెలుగు ప్రయాణికులపై ఎక్కువ భారం పడింది. వీటిలో స్టేజి స్టేజికీ ఛార్జీలు పెంచారు. తక్కువ దూరాలకు సైతం రూ.15-20 వరకు ఛార్జీలు పెరిగాయి. అప్పట్లో సూపర్‌ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ఎంత దూరం వెళ్లినా సగటున రూ.10-20 చొప్పున మాత్రమే అదనంగా వసూలు చేశారు. తాజా పెంపులో దూర ప్రాంత ప్రయాణికులనూ వదల్లేదు. దూరం పెరుగుతున్నకొద్దీ ఛార్జీ పెరుగుతూ పోయింది. గరిష్ఠంగా రూ.120 నుంచి రూ.140 వరకు బాదేశారు.


వేంకన్న భక్తులపైనా భారం

తిరుపతి తిరుమల ఘాట్‌లో తిరిగే ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో 2019 నవంబరుతో పోలిస్తే.. ఇప్పుడు ఒక్కో టికెట్‌పై రూ.35 చొప్పున పెరిగిపోయింది. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో వెళ్లే ప్రయాణికులకు ఇది అదనపు భారమే.


నిత్యవసరాల మాదిరిగా పెంచేస్తున్నారు
- బాబాజీ, అమలాపురం

ఎక్కువ మంది పేద, మధ్యతరగతి వాళ్లు తిరిగే పల్లె వెలుగు సర్వీసులను కూడా వదల్లేదు. ఇప్పటికే నిత్యావసరాలు సహా అన్నింటి ధరలూ పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నాం. దీనికి ఆర్టీసీ ఛార్జీలు కూడా తోడయ్యాయి.


ఇక ప్రైవేటుకు, ఆర్టీసీకి తేడా ఏంటి?
- జిలానీ, ప్రయాణికుడు

పనిమీద హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి వచ్చాను. ముందు రోజు సూపర్‌లగ్జరీలో ఛార్జీ రూ.670 ఉంది. ఇప్పుడు తిరుగు ప్రయాణంలో టికెట్‌ ధర రూ.820 చెప్పారు. ఇంత భారం మోపడం సరికాదు. ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వ రంగ సంస్థ లాభనష్టాలు చూసుకోకూడదు. ఇలా అయితే ప్రైవేటు ట్రావెల్స్‌కు, ఆర్టీసీకి తేడా ఏంటి?


తెల్లారేసరికి పెరిగిపోయింది

- పాలకొండయ్య, ప్రయాణికుడు 

ప్రొద్దుటూరు నుంచి సూపర్‌లగ్జరీ బస్సులో గురువారం రాత్రి బయలుదేరి శుక్రవారం విజయవాడ వచ్చాను. అప్పుడు టికెట్‌ ధర రూ.580. విజయవాడ నుంచి ప్రొద్దుటూరుకు శుక్రవారం రాత్రి టికెట్‌ బుక్‌ చేసుకుంటే రూ.670 తీసుకున్నారు. ఒక్క రోజులో రూ.90 ఛార్జీ పెరిగిపోయింది. ఇంతంత పెంచేస్తే ఎలా?


ఏసీ బస్‌ ఛార్జీ చూస్తే ఆశ్చర్యమేస్తోంది

- కె.రఘుపతి, విజయవాడ 

ఏసీ బస్సు ఛార్జీలు చూస్తే ఆశ్చర్యమేస్తోంది. విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఇంద్ర సర్వీసు ఛార్జీ రూ.110 పెంచేశారు. ఇప్పుడు ఏకంగా రూ.850 అయింది. రైల్లో అయితే రూ.600కే వెళ్లొచ్చు. ఇటీవలే ఛార్జీలు పెంచారు. మూడు నెలలు కూడా దాటకుండానే మళ్లీ పెంచడం సరికాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని