‘ఆన్‌లైన్‌ టికెట్ల’కు హైకోర్టు బ్రేక్‌

సినిమా టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వమే విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నానికి హైకోర్టు బ్రేక్‌ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సినిమా రెగ్యులేషన్‌ (సవరణ) చట్టం, దాని

Updated : 02 Jul 2022 06:56 IST

ప్రభుత్వమే సినిమా టికెట్లు అమ్ముకోడానికి అడ్డుకట్ట

చట్టసవరణ, తదనంతర జీవోల అమలు నిలిపివేత

ఈనాడు, అమరావతి: సినిమా టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వమే విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నానికి హైకోర్టు బ్రేక్‌ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సినిమా రెగ్యులేషన్‌ (సవరణ) చట్టం, దాని ఆధారంగా జారీచేసిన జీవోల అమలును నిలిపివేసింది. ఈ నెల 2 నుంచి ప్రవేశపెట్టనున్న ఆన్‌లైన్‌ టికెట్‌ విక్రయ ప్రక్రియలో ముందుకెళ్లకుండా ప్రభుత్వాన్ని నిలువరించింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులివ్వకపోతే పిటిషనర్లకు పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని పేర్కొంది. అంతేకాక ఈ నెల 2లోగా ప్రభుత్వం తీసురాబోతున్న కొత్త విధానంలోకి మారకపోతే థియేటర్ల లైసెన్సులు రద్దయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ వ్యాజ్యాల్లో తుది విచారణ జరిగే వరకు ఆన్‌లైన్‌ విధానాన్ని వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి కానీ, ప్రేక్షకులకు కానీ ఎలాంటి నష్టం జరగదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విధానాన్ని కొనసాగించడమే మంచిదని అభిప్రాయపడింది. వ్యాజ్యాలపై తుది విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్లో విక్రయించేందుకు వీలుగా 2021 డిసెంబరు 15న తీసుకొచ్చిన సవరణ చట్టం, సంబంధిత నిబంధనలు, టికెట్ల విక్రయ ప్లాట్‌ఫామ్‌ నిర్వహణను ఏపీ స్టేట్‌, ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ)కి అప్పగిస్తూ డిసెంబరు 17న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దాన్ని సవాలు చేస్తూ బుక్‌ మై షో సంస్థ, మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశాయి. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ సింఘ్వీ, సీవీ మోహన్‌రెడ్డి, న్యాయవాది ఎన్‌.అశ్వినీకుమార్‌ వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ వేదిక ద్వారా మాత్రమే టికెట్లు విక్రయించాలని ఒత్తిడి చేయడంపై అభ్యంతరం తెలిపారు. తమతో పోటీకి దిగుతూ తాము విక్రయించిన టికెట్‌కు రూ.2 చొప్పున సర్వీసు ఛార్జి చెల్లించాలని ప్రభుత్వం కోరడం సరికాదన్నారు. తమ వ్యాపారాల్లో జోక్యం చేసుకోకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలని కోరారు. తాము పన్ను ఎగవేస్తున్నామన్న ప్రభుత్వ వాదనల్లో వాస్తవం లేదని తెలిపారు. థియేటర్ల మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం చూసుకుంటూ, యాజమాన్యాలను క్యాంటిన్‌, పార్కింగ్‌ నిర్వహణకు మాత్రం పరిమితం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం నేరుగా వచ్చి తమ బాక్సాఫీసులో కూర్చుంటోందని వివరించారు. ఇది యాజమాన్యాల మనుగడనే దెబ్బతీసేలా ఉందన్నారు. ప్రభుత్వ చర్య గుత్తాధిపత్యానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. ఈనెల 2లోగా తమతో ఒప్పందం చేసుకోవాలని, లేకపోతే లైసెన్సులను రద్దు చేస్తామని బెదిరిస్తోందని వివరించారు. ప్రభుత్వమే వ్యక్తిగతంగా టికెట్‌ విక్రయ వ్యాపారం చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ.. పైసా పెట్టుబడి పెట్టకుండా తమతో కలిసి వ్యాపారం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.

అధిక ధరలను అడ్డుకోవాలనే..
ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. భాగస్వాములందరితో చర్చించి ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. అధిక ధరలకు టికెట్ల విక్రయాన్ని నిలువరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అధ్యయనం అనంతరం నూతన విధానాన్ని తీసుకురాబోతున్నామని చెప్పారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవద్దని కోరారు. ఇటీవల జరిగిన విచారణలో ఇరువైపులా వాదనలు ముగిశాయి. చివరకు ఆన్‌లైన్‌ ప్రక్రియను నిలిపిస్తూ శుక్రవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని