Published : 02 Jul 2022 05:10 IST

విజయమే లక్ష్యం.. విస్తరణకు వ్యూహం

నేటి నుంచి హైదరాబాద్‌లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు

పార్టీ అధ్యక్షుడు నడ్డా సహా ముఖ్యనాయకుల రాక

రేపు రానున్న ప్రధాని మోదీ

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికలు, పార్టీ విస్తరణ, మోదీ పాలన గురించి ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడం ప్రధానాంశాలుగా భారతీయ జనతాపార్టీ (భాజపా) జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. గత రెండు సంవత్సరాలు కరోనాతో కార్యవర్గ సమావేశాలు భారీ స్థాయిలో జరగలేదు, వచ్చే ఏడాది పలు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల కసరత్తులో నాయకత్వమంతా బిజీగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్‌లో జరిగే సమావేశాల్లోనే అన్ని అంశాలపైనా సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు  గురువారం నుంచే ముఖ్యనాయకులు రావడం ప్రారంభించగా, శుక్రవారం పార్టీ అధ్యక్షుడు నడ్డా సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు వచ్చారు.  ప్రధాని మోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, గడ్కరీ తదితరులు శనివారం రానున్నారు. కార్యవర్గ సమావేశాల కోసం  హైదరాబాద్‌లోని మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ (కాకతీయ) ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు.

ఎన్నికలకు సిద్ధం చేసేలా..
ఈ ఏడాది ఆఖర్లో  గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో.. వచ్చే సంవత్సరం మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవాటిలో ఏ ఒక్కటీ కోల్పోకుండా నిలబెట్టుకోవడంతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో పాగా వేయడానికి ఏం చేయాలనేది ఈ కార్యవర్గ సమావేశాల్లో అత్యంత కీలకం కానుందని పార్టీ ముఖ్యనాయకుడొకరు పేర్కొన్నారు. ప్రత్యేకించి తెలంగాణలో పాగా వేయడంపై ఈ కార్యవర్గ సమావేశాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంది.

అంతా కోలాహలం: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలతో హైదరాబాద్‌లో కోలాహలం నెలకొంది. భారీ హోర్డింగులు,  బ్యానర్లు, పోస్టర్లు, జెండాలతో హైదరాబాద్‌ నగరాన్ని కాషాయమయం చేశారు. సభలు, సమావేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులను ఉత్సాహపరిచారు. ప్రధాని సహా ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులంతా కదిలిరావడం, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ముఖ్యులు కదిలి రావడంతో భాజపాలో ఓ పండగ వాతావరణం నెలకొంది.

* భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాన వేదికపై ముగ్గురు నాయకులు మాత్రమే ఆసీనులు కానునున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌లు మాత్రమే వేదికపై కూర్చుంటారు.

ఏపీ నుంచి ఏడుగురు: కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణకు చెందిన 14 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్‌, జాతీయ కార్యవర్గసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, మండలిలో భాజపా పక్షనేత పీవీఎన్‌ మాధవ్‌ పాల్గొననున్నారు. ఏపీకి చెందిన హరియాణా రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి జీఆర్‌ రవీంద్రరాజు కూడా హాజరుకానున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని