వెంకటేష్‌ రిమాండ్‌కు న్యాయమూర్తి నిరాకరణ

సామాజిక మాధ్యమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారనే కేసులో సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన పల్నాడు జిల్లా ధరణికోటకు చెôదిన తెదేపా

Updated : 02 Jul 2022 06:20 IST

సొంతపూచీపై విడుదలకు ఆదేశం

సీఐడీ పోలీసులు దారుణంగా కొట్టారన్న బాధితుడు

ఈనాడు,అమరావతి, గుంటూరు లీగల్‌-న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారనే కేసులో సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన పల్నాడు జిల్లా ధరణికోటకు చెందిన తెదేపా కార్యకర్త, యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు గార్లపాటి వెంకటేశ్వరరావు అలియాస్‌ వెంకటేష్‌ రిమాండ్‌కు న్యాయమూర్తి జియావుద్దీన్‌ నిరాకరించారు. సొంతపూచీపై ఎలాంటి జామిన్‌ లేకుండా విడుదల చేయాలని పోలీసులను ఆదేశించారు. బుధవారం అర్ధరాత్రి ఇంటి తలుపులు విరగ్గొట్టి ప్రవేశించి అతడిని అదుపులోకి తీసుకోవడం, గురువారం అరెస్టు చూపించడం నుంచి శుక్రవారం వరకు పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గుంటూరు సీఐడీ కార్యాలయంలో గురువారం రోజంతా విచారించిన పోలీసులు అర్ధరాత్రి అతన్ని న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితుడు వెంకటేష్‌ను ప్రశ్నించగా సీఐడీ పోలీసులు తనను కొట్టారంటూ గాయాలను చూపించారు. దీంతో అతన్ని మరోసారి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు సీఐడీ పోలీసులు శుక్రవారం గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో మళ్లీ వైద్య పరీక్షలు చేయించారు. రిపోర్టులను న్యాయమూర్తికి అందజేసి, అతనికి రిమాండ్‌ విధించమని కోరారు. అర్ధరాత్రి ఇంటి ద్వారాలు పగలగొట్టి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని వెంకటేష్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. కేసు రికార్డును పరిశీలించిన న్యాయమూర్తి జియావుద్దీన్‌.. వెంకటేష్‌తో పాటు అరెస్టు చేసిన మిగతా ఐదుగురు నిందితులకు 41ఎ నోటీసులు ఇచ్చి ఇతనికి ఇవ్వకపోవటం సరికాదని, కేసు రికార్డు ప్రకారం వెంకటేష్‌ నేరం చేసినట్లుగా ఎలాంటి సాక్ష్యం లేదని అన్నారు. అతన్ని రిమాండ్‌కు పంపటానికి నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు. సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో రెండురోజుల నాటకీయ పరిణామాలకు తెరపడింది.

నివేదికపై తెదేపా అనుమానాలు..
సొంత జామీన్‌పై బయటకు వచ్చిన బాధితుడు వెంకటేష్‌ గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. శుక్రవారం జీజీహెచ్‌ వైద్యులు ఇచ్చిన నివేదికలపై తెదేపా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. బాధితుడికి ఒంటిపై బలమైన గాయాలున్నాయని, కానీ తమకు అనుకూలంగా నివేదికలు ఇచ్చేలా వైద్యులపై ఒత్తిడి తీసుకొచ్చారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు.

పరికరాలు ధ్వంసం చేస్తున్నందుకే బలప్రయోగం: సీఐడీ
గార్లపాటి వెంకటేశ్వరరావు గది తలుపులు వేసుకుని, లోపలున్న ఎలక్ట్రానిక్‌ పరికరాలను ధ్వంసం చేస్తుండడం వల్లే బలప్రయోగం చేసి తలుపులు తెరవాల్సి వచ్చిందని సీఐడీ ప్రధాన కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు