ప్రధాని పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను ప్రారంభించేందుకు ఈ నెల 4న ప్రధాని నరేంద్ర మోదీ

Published : 02 Jul 2022 05:10 IST

ఈనాడు, దిల్లీ - భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను ప్రారంభించేందుకు ఈ నెల 4న ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రానున్నారు. ప్రధాని పర్యటన షెడ్యూలును అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 9.25కి బయలుదేరి 10.10కి విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి 10.15 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 10.50కి భీమవరం చేరుకుంటారు. 10.55కు హెలిప్యాడ్‌ నుంచి ప్రత్యేక వాహనంలో సభా ప్రాంగణానికి వస్తారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. 12.20కి సభావేదిక నుంచి హెలిప్యాడ్‌కు, అక్కడ్నుంచి 12.30 హెలికాప్టర్‌లో బయలుదేరి 1.05 గంటలకు విజయవాడ చేరుకుంటారు. భీమవరంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను కేంద్ర భద్రతా విభాగం అధికారులు శుక్రవారం పర్యవేక్షించారు. ఏఎస్‌ఆర్‌ నగర్‌లోని 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే పార్కు, పెద అమిరంలో బహిరంగసభ ప్రాంగణాలను వారు పరిశీలించారు. రాత్రివేళ ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఈ పనులు చేస్తున్నారు.

పార్లమెంటు ప్రాంగణంలో విగ్రహం ఏర్పాటుపై..
పార్లమెంటు భవనం ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని, రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలని కోరుతూ ప్రధానమంత్రికి విన్నవించాలని క్షత్రియ సంఘం ప్రతినిధులు నిర్ణయించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భీమవరంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని