జలవనరుల శాఖలో జూనియర్లకే అందలం

ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖలో చేపట్టిన బదిలీలపై తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. ఒక ప్రాతిపదిక లేకుండా, పాలనా సౌలభ్యం పేరుతో అయిదేళ్ల సర్వీసు పూర్తిచేయని వారినీ ఇష్టారాజ్యంగా

Updated : 02 Jul 2022 06:43 IST

కీలక స్థానాల్లో ఉన్న ఎస్‌ఈలు, ఈఈలు అప్రాధాన్య పోస్టులకు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖలో చేపట్టిన బదిలీలపై తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. ఒక ప్రాతిపదిక లేకుండా, పాలనా సౌలభ్యం పేరుతో అయిదేళ్ల సర్వీసు పూర్తిచేయని వారినీ ఇష్టారాజ్యంగా బదిలీ చేశారని అధికారులు గగ్గోలు పెడుతున్నారు. సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలు, డీఈఈలకు కూడా పలుచోట్ల పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు ఆయా పోస్టుల్లో అదనపు బాధ్యతలు లేని రెగ్యులర్‌ అధికారులు పనిచేసేవారు. చాలాచోట్ల పదవీకాలం మూడేళ్లు పూర్తికాని వారూ ఉన్నారు. కనీసం ఏడాదిన్నర ఒకేచోట పనిచేయని వారినీ సుదూర ప్రాంతాలకు బదిలీ చేసి ఆయా స్థానాల్లో తమకు అన్నిరకాలుగా కావల్సిన వారికి పోస్టింగులు ఇచ్చారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. మొత్తం ఆరుగురు సీఈలు, 15 మంది ఎస్‌ఈలను బదిలీ చేశారు. 8 మంది ఈఈలకు ఎస్‌ఈలుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. 54 మంది ఈఈలను బదిలీ చేశారు. 11 మంది డీఈఈలను ఈఈ పోస్టుల్లో పూర్తి అదనపు బాధ్యతల్లో నియమించారు. సాధారణంగా అయిదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిని బదిలీ చేయాలనే నిబంధన ఉన్నా... పాలనా సౌలభ్యం, ఇతరత్రా కారణాల పేరు చెప్పి ఆ నిబంధనను జలవనరులశాఖలో పూర్తిగా విస్మరించారు. పెద్దలను ప్రసన్నం చేసుకుంటేనే మంచిపోస్టు.. లేకుంటే ఎక్కడికో అన్న విధానంతోనే ఈ బదిలీలు జరిగాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈఎన్‌సీ, గోదావరి డెల్టా సీఈ ఒకరే..
* కర్నూలు సీఈ మురళీనాథ్‌ రెడ్డిని ఒంగోలు ప్రాజెక్టుల సీఈగా నియమించారు. కోస్తాప్రాంత నాణ్యత నియంత్రణ విభాగం సీఈ సతీష్‌కుమార్‌ను గోదావరి డెల్టా వ్యవస్థ సీఈగా నియమించారు. నిజానికి ఈయన విజయవాడలో ఈఎన్‌సీ (పాలన) అనే కీలకస్థానంలో పనిచేస్తున్నారు. ఆ పోస్టు ఆయనకు అదనపు బాధ్యతగా అప్పగించారు. ఒకవైపు కీలకమైన ఈఎన్‌సీ పాలన వ్యవహారాలు చూస్తూ ఎక్కడో రాజమహేంద్రవరంలో 10 లక్షల ఎకరాలకు పైగా ఉన్న గోదావరి డెల్టా వ్యవస్థ సీఈగానూ నియమించడం విశేషం.

* కడా ఎస్‌ఈ పుల్లారావును కోస్తా ప్రాంత నాణ్యత నియంత్రణ విభాగం సీఈగా విజయవాడలో నియమించారు. నిజానికి నాణ్యత నియంత్రణ విభాగానికి పూర్తిస్థాయి సీఈ కావాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఎప్పటి నుంచో కోరుతోంది.

కీలక స్థానాల్లో ఈఈలకు బదిలీ... జూనియర్లకు ఆ స్థానాలు
కర్నూలు జిల్లాలో కీలకమైన కేసీ కాలువ విభాగంలో ఈఈగా ఉన్న ఒక అధికారికి మూడేళ్ల కాలమే పూర్తయింది. ఆయనను ఎక్కడో అనంతపురం జిల్లాలో అప్రాధాన్య పోస్టులో నియమించారు. కేసీ కాలువలో కీలకమైన ఈఈ పోస్టులో ఎక్కడో డీఈఈగా పనిచేస్తున్న ఒక జూనియర్‌ అధికారిని పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు.

* ఉమ్మడి కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న ఈఈలను ఎక్కడికో బదిలీ చేశారు. నంద్యాల మైనర్‌ ఇరిగేషన్‌ డివిజన్‌లో ఈఈ పోస్టు ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది. ఆ పోస్టులోకి కడప జిల్లా నుంచి మరొకరిని పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు.
* ధవళేశ్వరం నాణ్యత నియంత్రణ విభాగం ఎస్‌ఈగా ఉన్న అధికారిని ఎక్కడో శ్రీశైలం ప్రాజెక్టు ఎస్‌ఈగా నియమించారు. ఆయన ధవళేశ్వరానికి బదిలీపై వచ్చి ఏడాదిన్నర కూడా పూర్తికాలేదు. అప్పట్లో కర్నూలులో రెగ్యులర్‌ ఎస్‌ఈ పోస్టు నుంచి బదిలీ చేశారు. అప్పట్లో అక్కడ ఒక జూనియర్‌కు పోస్టింగు ఇవ్వడానికే ఈ బదిలీ చేశారు. ఆ స్థానంలోకి పోలవరం ప్రాజెక్టు నుంచి ఒక ఎస్‌ఈని నియమించారు. ఆ ఎస్‌ఈ పోస్టులోకి ఈఈగా ఉన్న ఒక అధికారిని పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు.
* కోస్తా జిల్లాల్లో ఈమధ్య తాము చెప్పిన పని చేయలేదని ఆగ్రహించి ఒక ఎస్‌ఈని ఒక అత్యంత అప్రాధాన్య పోస్టులో నియమించిన విషయమూ చర్చనీయాంశమవుతోంది. ఇటీవల వరకు ఒక కీలక స్థానంలో ఎస్‌ఈగా ఉన్న ఆయనను కోస్తా జిల్లాలోనే అత్యంత అప్రాధాన్య పోస్టుకు బదిలీ అయ్యారు. కీలకమైన పనిని తాము చెప్పిన గుత్తేదారుకు ఇవ్వలేదన్న ఆగ్రహమే ఇందుకు కారణమని విస్తృతంగా ప్రచారం అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని