Assigned: ఎసైన్డ్‌ వ్యవసాయ భూములపై యాజమాన్య హక్కులు?

ఎసైన్డ్‌ వ్యవసాయ భూములపై లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో యాజమాన్య హక్కులు కల్పించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఖజానాకు ఆదాయాన్ని చేకూర్చే ప్రయత్నాల్లో

Updated : 03 Jul 2022 06:47 IST

లబ్ధిదారులకు కల్పించే యోచన

ఆదాయ మార్గాల్లో భాగంగా ప్రభుత్వ పరిశీలన

ఈనాడు, అమరావతి: ఎసైన్డ్‌ వ్యవసాయ భూములపై లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో యాజమాన్య హక్కులు కల్పించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఖజానాకు ఆదాయాన్ని చేకూర్చే ప్రయత్నాల్లో ఇదొకటిగా భావిస్తున్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిలో కొందరికి రెండున్నర ఎకరాల మాగాణి, మరికొందరికి అయిదెకరాల మెట్ట భూమిని ప్రభుత్వం వివిధ సందర్భాల్లో కేటాయిస్తూ వస్తోంది. సొంతంగా భూములను సాగు చేయడం, కౌలుకు ఇవ్వడం ద్వారా లబ్ధిదారు కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ భూములను వారసత్వంగా అనుభవించాల్సిందే. క్రయవిక్రయాలకు ఎలాంటి అనుమతి లేదు. ఇదే విషయాన్ని భూ బదలాయింపు నిషేధ చట్టం స్పష్టం చేస్తోంది. అయితే... ఇంటి స్థలాలను ఎసైన్‌ చేశాక, వాటిలో 12 నెలల్లో ఇళ్లను నిర్మించుకుని పదేళ్ల తర్వాత విక్రయించుకునేలా 2021లో నిబంధనలను సవరించారు. ఇలాంటి చట్ట సవరణ ద్వారానే వ్యవసాయ భూములపై ఎసైన్డ్‌దారులకు పూర్తి స్థాయి యాజమాన్య హక్కులను కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నారు.

పరిశీలించాలని రెండు శాఖలకు ఆదేశాలు
రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి ఇప్పటివరకు సుమారు 35 లక్షల ఎకరాల వ్యవసాయ భూములను ఎసైన్‌ చేసినట్లు అంచనా. వీటికి డి.పట్టా పేరుతో పట్టాదారు పాసు పుస్తకాలనూ ఇచ్చారు. ఈ భూములు చాలావరకు ఒకప్పుడు పట్టణాలు, నగరాలు, మేజర్‌ గ్రామ పంచాయతీకు దూరంగా ఉండేవి. పట్టణీకరణ కారణంగా చాలావరకు నగరాలు, పట్టణాల్లో భాగమయ్యాయి. దాంతో వాటికి డిమాండ్‌ పెరిగింది. ముఖ్యంగా కొత్త జిల్లా కేంద్రాలకు సమీపంలోని భూములకు మరింత గిరాకీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఎసైన్డ్‌ భూములపై లబ్ధిదారులకు యాజమాన్య హక్కులను కల్పిస్తే... రిజిస్ట్రేషన్ల ద్వారా భారీగా ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. తలెత్తే సమస్యలు, వాటికి పరిష్కారాలు ఎలా చూపొచ్పు? అనే వాటిని పరిశీలించాలని రెవెన్యూ, స్టాంపులు/రిజిస్ట్రేషన్‌ శాఖకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. వాస్తవానికి... లబ్ధిదారులకు కేటాయించిన భూముల్లో చాలావరకు చేతులు మారుతున్నాయి. కొన్నిచోట్ల ఆన్‌లైన్‌లోనూ పేర్లను అక్రమంగా మార్చారు. ఎసైన్డ్‌ భూములను విక్రయించినట్లు తెలిస్తే వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చు. ఇలా కొన్నిసార్లు చేస్తున్నారు. ఒకవేళ పూర్తి స్థాయిలో యాజమాన్య హక్కులు కల్పిస్తే..ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ఉండదు. మరోవైపు చాలాచోట్ల ఈ భూములపై అసలు లబ్ధిదారులు, వారసులు లేరు. ఈ పరిస్థితుల్లో యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా ప్రయోజనం పొందే నిజమైన లబ్ధిదారులు తక్కువగానే ఉంటారనే అభిప్రాయం వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని