Updated : 03 Jul 2022 06:57 IST

దోపిడీదారులను దించేయగలం

ఆమ్‌ ఆద్మీతో కేజ్రీవాల్‌ తెచ్చిన మార్పు చూడండి

జనసేన వీర మహిళల శిక్షణ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: ‘అధికారంలో ఉన్న రాజకీయ నాయకులను చూసి భయపడక్కర్లేదు. జ్ఞానం, ధైర్యం పెంచుకుంటే... దోపిడీ చేసేవాళ్లే మనల్ని చూసి భయపడతారు. బలమైన ఆలోచనతో ఒక్కటై నిలిస్తే ఎంతటి వారినైనా ఎదుర్కోగలం. వారికి 151 లేదా 175 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు. సరిగ్గా పోరాడితే వాళ్లను దించేయగలం’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో శనివారం వీర మహిళలకు శిక్షణ శిబిరం నిర్వహించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే రూ.7 లక్షలు ఇస్తామని చెప్పిన వైకాపా నాయకులు మాట తప్పారు. 3 వేల మంది చనిపోతే మూణ్నాలుగు వందల మందికే కొద్దిగా సాయం చేసి వదిలేస్తున్నారు. ఆడపడుచులను గౌరవించి మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మద్యాన్ని ఎలా అమ్ముతారు? మద్యం విక్రయాలతో వైకాపా నాయకులు... వ్యక్తితంగా నెలకు రూ.250 కోట్లు సంపాదిస్తున్నారని చెబుతున్నారు. సారాపైనే రోజుకు రూ.3 కోట్లు అక్రమంగా సంపాదిస్తున్న వీరికి ఏసీబీతో చిన్నచిన్న ఉద్యోగులను నియంత్రించే హక్కు ఎక్కడ ఉంది’ అని నిలదీశారు.

ఓటమిలోనూ నిల్చునే ధైర్యముంది
జనసేనకు ఓటమిలోనూ నిల్చునే ధైర్యముంది. సినిమాల్లో 10 డైలాగులు చెప్పి మీతో చప్పట్లు కొట్టించుకుంటే ఆనందం రాదు. సినిమాల్లో చేయగలిగేది నిజ జీవితంలో ఎంతో కొంత చేయగలిగితేనే బలం. ఈ రోజు ఆ బలాన్ని సంపాదించుకున్నా. మార్పు ఒక్కరోజులో రాదు. రూ.వందల కోట్ల ఆస్తులున్న బలమైన కాంగ్రెస్‌, భాజపాలను కేజ్రీవాల్‌ ఓడించారు. ఆ మార్పు చూడండి’ అని శ్రేణులకు ఉద్బోధించారు.

‘ఒక యువతి మర్యాదకు భంగం వాటిల్లితే సాక్షాత్తూ మహిళా హోం మంత్రి ఆమె పెంపకాన్నే తప్పుబట్టారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే క్రిమినల్స్‌ను వెనకేసుకు రావడమేంటి? వకీల్‌సాబ్‌ సినిమాలో ఒక మహిళను నువ్వు కన్యవా? అని అడగాలనే డైలాగ్‌ను రాసిచ్చారు. నేనా డైలాగ్‌ను చెప్పబోనన్నాను. ఏం కన్యత్వం పురుషుడికి వర్తించదా?’ అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. అంతకుముందు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. ‘జగన్‌రెడ్డిని ఓడించాలి... జనసేనను గెలిపించాలి’ అనే నినాదంతో వీర మహిళలు పని చేయాలని పిలుపునిచ్చారు.

ఆడవాళ్లను నఖశిఖ పర్యంతం చూడాల్సిన అవసరం ఏమిటి?
ఆడవాళ్లను నఖశిఖ పర్యంతం చూడాల్సిన అవసరం ఏమిటని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు ప్రశ్నించారు. ఆడవారి వేషధారణపై గతంలో కొందరు ప్రవచనకారులు వ్యాఖ్యలు చేయగా తాను వీడియోలోనే ఈ ప్రశ్నను సంధించానన్నారు.

* జనసేన కార్యాలయంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన యలవర్తి నాగరాజు దంపతులు ‘కౌలు భరోసా యాత్ర’కు విరాళంగా రూ.10 లక్షలను పవన్‌కల్యాణ్‌కు అందజేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని