Published : 03 Jul 2022 05:16 IST

శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోండి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశం

ఎంపీ రఘురామ పర్యటన నేపథ్యంలో ఉత్తర్వు

ఈనాడు, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈనెల 4న అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరు కానున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పర్యటనలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని/ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆ జిల్లా ఎస్పీకి స్పష్టం చేసింది. హెలికాప్టర్‌ దిగేందుకు భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యం అనుమతి ఇవ్వలేదని, దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ యాజమాన్యం మొదట ఆమోదం తెలిపినా తర్వాత వెనక్కి తీసుకుందని గుర్తు చేసింది. అయితే హెలికాప్టర్‌ దిగేందుకు అనుమతిచ్చేలా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించలేమని పేర్కొంది. ఎంపీ రఘురామకు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచినందున రాష్ట్ర పోలీసులూ రక్షణ ఇవ్వాలంటూ ఆదేశించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 4న భీమవరంలో తన హెలికాప్టర్‌ దిగేందుకు అనుమతిచ్చేలా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాలని కోరుతూ రఘురామకృష్ణరాజు శనివారం హైకోర్టులో అత్యవసరంగా (హౌజ్‌ మోషన్‌) వ్యాజ్యం వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌ చంద్ర వాదనలు వినిపించారు. ‘హెలికాప్టర్‌ దిగేందుకు అనుమతి సాధ్యం కాని పరిస్థితుల్లో రోడ్డు మార్గమే పిటిషనర్‌కు ప్రత్యామ్నాయం. అయితే వైకాపా నేతల నుంచి ప్రమాదం పొంచి ఉంది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే రెచ్చగొట్టే పోస్టులను సామాజిక మాధ్యమంలో ఉంచారు. పిటిషనర్‌పై ద్వేషభావం పెంచేలా ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఘర్షణలు సృష్టించి పిటిషనర్‌పై తప్పుడు కేసులు పెట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రహదారి మార్గం పొడవునా రాష్ట్ర పోలీసులతో భద్రత కల్పించాలి...’ అని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించిందని గుర్తు చేశారు. ఎందుకు మరింత ఆందోళన చెందుతున్నారని ప్రశ్నించారు. తమ ఆందోళన సహేతుకమైనదేనని, రక్షణ కల్పించేలా రాష్ట్ర పోలీసులను ఆదేశించాలని ఎంపీ తరఫు న్యాయవాది మరోసారి అభ్యర్థించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌, హోంశాఖ ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి, జీపీ వివేకానంద వాదనలు వినిపిస్తూ.. ఎస్‌ఆర్‌కేఆర్‌ కళాశాల సమ్మతి తెలిపినట్లు పిటిషనర్‌ తన వ్యాజ్యంలో పేర్కొనలేదని తెలిపారు. ఎంపీ వినతిపై జిల్లా కలెక్టర్‌ తగిన ఉత్తర్వులు జారీ చేయకపోవడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని