ఎమ్మెల్యే తమ్ముడిని, ఎంపీపీని కలిసి వస్తేనే చేర్చుకుంటా

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ తమ్ముడు రవీంద్ర, పరిగి ఎంపీపీ సవితను కలిసి వచ్చిన తర్వాతే విధుల్లో చేర్చుకుంటానని ఓ మహిళా టైపిస్టుతో ఎంపీడీవో

Updated : 03 Jul 2022 12:50 IST

బదిలీపై వచ్చిన టైపిస్టుతో ఎంపీడీవో

పరిగి, న్యూస్‌టుడే: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ తమ్ముడు రవీంద్ర, పరిగి ఎంపీపీ సవితను కలిసి వచ్చిన తర్వాతే విధుల్లో చేర్చుకుంటానని ఓ మహిళా టైపిస్టుతో ఎంపీడీవో శ్రీలక్ష్మి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సాధారణ బదిలీల్లో భాగంగా పెనుకొండ డివిజన్‌ పీఆర్‌ కార్యాలయ టైపిస్టు కైసర్‌ బేగంను పరిగి ఎంపీడీవో కార్యాలయానికి బదిలీ చేశారు. తనను విధుల్లో చేర్చుకోవాలని ఆమె ఎంపీడీవోను శనివారం కోరారు. అయితే.. ఎమ్మెల్యే సోదరుడు, ఎంపీపీలను కలిసి రావాలని ఎంపీడీవో చెప్పడంతో ఉద్యోగిని కంగుతిన్నారు. తనను ఎందుకు చేర్చుకోవడం లేదో అర్థం కావడం లేదని ఆమె కంటతడి పెట్టారు. ఎమ్మెల్యే సోదరుడికి, ఉద్యోగిని భర్త మున్నాకు (వైకాపా మైనారిటీ విభాగం నాయకుడు) మధ్య అభిప్రాయ భేదాలున్నాయి. ఈ సందర్భంగా మున్నా మాట్లాడుతూ.. సొంత పార్టీకి చెందిన తనను ఎమ్మెల్యే సోదరుడు ఇబ్బంది పెట్టడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తన భార్యను విధుల్లో చేర్చుకోకపోతే కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఎంపీడీవో శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ఇది చిన్న వివాదమని.. ఎమ్మెల్యే తమ్ముడు, ఎంపీపీలను మర్యాదపూర్వకంగా కలవాలనే తాను సూచించానని చెప్పారు. కైసర్‌ బేగంతో ఫోన్లో మాట్లాడానని, విధుల్లో చేర్చుకుంటానని చెప్పినట్లు ఎంపీడీవో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని