Updated : 03 Jul 2022 06:36 IST

అట్టహాసం.. కమల దరహాసం

సందడిగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు
తరలివచ్చిన జాతీయ నేతలు, కేంద్రమంత్రులు, సీఎంలు
ఈనాడు - హైదరాబాద్‌

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాలను భారీగా భాజపా జెండాలు, స్వాగత తోరణాలతో అలంకరించారు. సమావేశాల వేదిక అయిన నోవాటెల్‌, హైటెక్స్‌ ప్రాంతాన్ని కాషాయమయం చేశారు. కళా బృందాల ప్రదర్శనలు, నృత్యాలు, కోలాటాలతో ప్రాంగణం సందడిగా మారింది. ఉదయం 148 మంది భాజపా పదాధికారుల సమావేశం జరిగింది. మధ్యాహ్నం భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, రాజ్యసభలో భాజపా పక్షనేత, కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌లు ఈ వేదికపై ఆసీనులయ్యారు. 18 భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు మొత్తం 348 మంది పాల్గొన్నారు. ప్రధాని మోదీ సమావేశ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే వారంతా నిలబడి ‘భారత్‌మాతాకీ జై’ అంటూ గట్టిగా నినదించి హర్షధ్వానాలు చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీ వివేక్‌లు  ప్రధాని మోదీని వేదికపైకి స్వాగతించగా, నడ్డాను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, రాజ్యసభ నేత పీయూష్‌ గోయల్‌ను శాసనసభ్యుడు ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిలు ఆహ్వానించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ముగ్గురు ముఖ్యనేతలను వేదికపైకి ఆహ్వానించారు. మోదీ, నడ్డా, పీయూష్‌గోయల్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యవర్గ సమావేశాలను ప్రారంభించారు. వేదికపై భాజపా అగ్రనేతలు శ్యామాప్రసాద్‌ ముఖర్జీ, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, భారతమాత చిత్ర పటాలను ఏర్పాటు చేశారు.

నేతలకు ప్రధాని పలకరింపు

బేగంపేట నుంచి హెచ్‌ఐసీసీకి ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్న ప్రధానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సహా పలువురు నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని పలువురిని నవ్వుతూ పలకరించారు. సమావేశాలకు వచ్చిన పార్టీ నేతల్ని ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డిలు ఆహ్వానించారు.

పొంగులేటిజీ సన్నబడాలి!

భాజపా రాష్ట్ర నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రధానికి స్వాగతం పలికిన సందర్భంగా అయనను ఉద్దేశించి లావు అవుతున్నారు...సన్నబడాలి అని అనడంతో అందరూ నవ్వేశారు.

నేడూ కొనసాగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాలు

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం కూడా కొనసాగనున్నాయి. రెండో రోజు రాజకీయ తీర్మానంపై చర్చించనున్నట్లు తెలిసింది. అనంతరం సాయంత్రం ఆరుగంటలకు పరేడ్‌ మైదానంలో బహిరంగసభ జరుగుతుంది.


కేంద్ర ప్రభుత్వమంతా హైదరాబాద్‌లో..

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో కీలకనేతలు సహా కేంద్రమంత్రులంతా హైదరాబాద్‌లో ఉండటంతో కేంద్ర ప్రభుత్వమే హైదరాబాద్‌లో ఉన్నట్లుగా మారింది. సుమారు 40 మంది కేంద్రమంత్రులు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు రావడం ప్రత్యేకతగా నిలిచింది.ఈ సమావేశాల నేపథ్యంలో దిల్లీ నుంచి జాతీయ మీడియా ప్రతినిధులు సుమారు వందమందికిపైగా వచ్చారు.


తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్నది వీరే..

తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ ముఖ్య నేతలు కె.లక్ష్మణ్‌, మురళీధర్‌రావు, డి.కె.అరుణ, జి.వివేక్‌, ఈటల రాజేందర్‌, జితేందర్‌రెడ్డి, గరికిపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌, విజయశాంతి, బాల సుబ్రమణ్యం, ఇంద్రసేనారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఏపీ నుంచి కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరి, భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సత్యకుమార్‌, ఎమ్మెల్సీ మాధవ్‌లు పాల్గొన్నారు.


తెలంగాణలో భాజపా విజయం ఖాయం: ఖుష్బూ

తెలంగాణలో భాజపా విజయం ఖాయమని సినీనటి, భాజపా నాయకురాలు ఖుష్బూ అన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక వద్ద శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కుటుంబ పాలనతో విసిగిపోయి ఉన్నారన్నారు. వారు భాజపా పాలనను కోరుకుంటున్నారని వివరించారు. రెండు రోజుల పర్యటన నేపథ్యంలో తాను పలు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నట్లు ఆమె చెప్పారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని