‘చెత్త’ రుసుం పక్కదారి!

నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్త కోసం వసూలు చేస్తున్న రుసుములు పక్కదారి పడుతున్నాయి. వాలంటీర్లు, సచివాలయాల సిబ్బందిలో కొందరు వీటిని సొంతానికి

Published : 04 Jul 2022 03:34 IST

రసీదులివ్వకుండా వాలంటీర్ల వసూళ్లు

ఈనాడు-అమరావతి: నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్త కోసం వసూలు చేస్తున్న రుసుములు పక్కదారి పడుతున్నాయి. వాలంటీర్లు, సచివాలయాల సిబ్బందిలో కొందరు వీటిని సొంతానికి వాడుకుంటున్నారు. వసూలు చేసిన మొత్తాలకు రసీదులనూ ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) డివైజ్‌లు ఇచ్చినా సరిగా ఉపయోగించడం లేదు. బకాయిలపై కమిషనర్లు సిబ్బందిని ప్రశ్నించిన చోట ప్రజలు చెల్లించడం లేదని చెప్పి తప్పించుకుంటున్నారు. రాష్ట్రంలోని 42 పుర, నగరపాలక సంస్థల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నందుకు ప్రజల నుంచి ప్రతి నెలా వినియోగ రుసుములు వసూలు చేస్తున్నారు. కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.120 చొప్పున వాలంటీర్ల సమక్షంలో వార్డు సచివాలయాల సిబ్బంది 2021 నవంబరు నుంచి వసూలు చేస్తున్నారు. ఇందుకోసం పలు పుర, నగరపాలక సంస్థలు రసీదు పుస్తకాలు ముద్రించి సచివాలయాలకు అందజేశాయి. 694 పీఓఎస్‌ డివైజ్‌లను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ సమకూర్చింది. వసూలైన మొత్తాలు అదే రోజు సంబంధిత పుర, నగరపాలక సంస్థల బ్యాంకు ఖాతాలో జమయ్యేలా ఏర్పాట్లు చేశారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నగరాలతో పాటు కొన్ని పట్టణాల్లో వసూలు చేస్తున్న వినియోగ రుసుములపై సిబ్బంది రసీదులివ్వడం లేదు. చాలాచోట్ల వాలంటీర్లే ఈ మొత్తాలు వసూలు చేస్తున్నారు. రసీదు ఇవ్వాలని గట్టిగా నిలదీస్తే అలాంటి ఇళ్లకు రెండోసారి మళ్లీ వెళ్లడం లేదు. విజయవాడలో ఇటీవల విశ్రాంత ఉద్యోగి ఒకరి ఇంటికి వెళ్లిన వాలంటీరు వినియోగ రుసుములు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. రసీదు ఇస్తే చెల్లిస్తానంటే వాలంటీరు మళ్లీ కనిపించలేదని ఆయన తెలిపారు. విశాఖలో కొందరి మొబైళ్లకే రుసుములు చెల్లించినట్లు సమాచారం వస్తోంది. గుంటూరులో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న కొన్ని ప్రాంతాల్లో కొందరికే రసీదులిస్తున్నారు. అత్యధిక నగరాలు, పట్టణాల్లో సాంకేతిక సమస్యలంటూ పీఓఎస్‌ డివైజ్‌లను వాడడం లేదు.

వసూళ్లపై అధికారుల ఆరా
వినియోగ రుసుములను వాలంటీర్లు, సచివాలయాల బాధ్యులు సొంతానికి వాడుకుంటున్నారా? అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల పుర, నగరపాలక సంస్థల కమిషనర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఉన్నతాధికారులు రుసుముల అంశాన్ని ప్రస్తావించారు. వసూలు చేస్తున్న మొత్తాలు సరిగా జమవుతున్నాయో, లేదో ఎప్పటికప్పుడు పరిశీలించాలని కమిషనర్లను ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నంలోని కొన్ని డివిజన్లలో నిధులు దుర్వినియోగమవుతున్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

వాహనానికో పీవోస్‌ డివైజ్‌
ఇళ్ల నుంచి చెత్త సేకరణకు ప్రస్తుతానికి ఉపయోగిస్తున్న 2,500 వాహనాలకో డివైజ్‌ చొప్పున సరఫరా చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే సమకూర్చిన 694 డివైజ్‌లు పూర్తిగా వాడకంలోకి తెచ్చి మరో 1,806 సరఫరా చేయనున్నారు. వినియోగ రుసుముల వసూళ్లకు విధిగా డివైజ్‌ ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.  ప్రతి పైసా పక్కాగా పుర, నగరపాలక సంస్థల బ్యాంకు ఖాతాలకు జమవుతుందని అంటున్నారు.


* ఇళ్ల నుంచి చెత్త సేకరణకు రుసుములు వసూలు చేస్తున్న పట్టణ స్థానిక సంస్థలు: 42
* నెలకు వసూళ్ల లక్ష్యం: రూ.15 కోట్లు
* వసూలవుతుంది: 7.50 కోట్లు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని