వాడిన నూనే ఇం‘ధనమ’వునులే!

వాడిన వంటనూనెతో జీవ ఇంధన (బయో డీజిల్‌) ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి వాడిన వంటనూనెలను కొనుగోలు చేసి, వాటినుంచి బయోడీజిల్‌ తయారుచేసే

Updated : 04 Jul 2022 05:55 IST

ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తున్న కేంద్రం

పెట్రోలుతో కలిపితే కాలుష్యం పరిమితం

సేకరణకు పలు సంస్థల ఆసక్తి

రాష్ట్రంలో ప్రాథమిక దశలో ఈ విధానం

ఈనాడు, అమరావతి, విశాఖపట్నం

వాడిన వంటనూనెతో జీవ ఇంధన (బయో డీజిల్‌) ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి వాడిన వంటనూనెలను కొనుగోలు చేసి, వాటినుంచి బయోడీజిల్‌ తయారుచేసే సంస్థలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఈ సంస్థలు నూనెను జీవ ఇంధనంగా మార్చి, కేంద్రప్రభుత్వ సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం, హిందూస్థాన్‌ పెట్రోలియం తదితర సంస్థలకు విక్రయిస్తున్నాయి.

జాతీయ ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) వద్ద ‘రుకో’ (రీయూజ్డ్‌ కుకింగ్‌ ఆయిల్‌) కేటగిరీలో దేశవ్యాప్తంగా వంటనూనెల నుంచి జీవ ఇంధనం తయారుచేసే 43 పరిశ్రమలు పేర్లు నమోదు చేసుకున్నాయి. రాష్ట్రంలో విశాఖ, కాకినాడల్లో మూడు సంస్థలు అనుమతులు పొందాయి. గుంటూరు జిల్లాలో మరో సంస్థ ఇందుకు దరఖాస్తు చేసింది.

రోజుకు 50 లీటర్ల మించి వాడితే... 

సాధారణంగా 100 లీటర్ల నూనెతో వంట చేస్తే సుమారు 25 లీటర్ల నూనె మిగులుతుంది. దీన్ని మళ్లీ వాడటం అనారోగ్యకరం. ఈ ముప్పును గుర్తించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ... వాడిన నూనెను జీవ ఇంధన తయారీ సంస్థలకు విక్రయించాలని ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది. రోజుకు 50 లీటర్లకు మించి నూనెను వినియోగించే హోటళ్లు, రెస్టారెంట్లు, మిఠాయి, చిప్స్‌ దుకాణాలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసింది. వారంతా రోజుకు ఎంత నూనె కొన్నారో, ఎంత వినియోగించారో రికార్డులు నిర్వహించాలని మార్గదర్శకాల్లో ఉంది.

సేకరణ ఇలా... 

జీవ ఇంధన తయారీ సంస్థలు నగరాల్లో ఇప్పటికే వాడిన వంట నూనెల సేకరణకు కొన్ని స్టాకు పాయింట్లు పెట్టుకున్నాయి. స్టార్‌ హోటళ్లు, రెస్టారెంట్లు, ఓ మాదిరి హోటళ్లు, మిఠాయి దుకాణాలు, గేటెడ్‌ కమ్యూనిటీల నుంచి సేకరిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్ల దగ్గర డబ్బాలు ఏర్పాటు చేసి, అవి నిండాక సమాచారమిస్తే వచ్చి తీసుకెళ్తున్నారు. ఇలా లీటరు రూ.30కి కొని, కేంద్ర ఇంధన సంస్థలకు టెండర్ల ద్వారా లీటరు సుమారు రూ.90కి విక్రయిస్తున్నాయి. పలు ప్రధాన నగరాల్లో ఇలా వాడిన నూనె సేకరిస్తున్నారు. ఈ నూనె డబ్బాలను జీవ ఇంధన పరిశ్రమలకు తరలించి ముందుగా ప్రాసెసింగ్‌ చేస్తారు. ఆ తర్వాత గ్లిజరిన్‌ తీస్తారు. చివరిగా జీవ ఇంధనం తయారవుతుంది. ఈ శుద్ధి చేసే క్రమంలో వచ్చే వ్యర్థాలను సబ్బుల తయారీ పరిశ్రమలకు తరలిస్తారు. జీవ ఇంధనాన్ని ఎక్కువగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు కొంటాయి. దీన్ని పెట్రోలులో కలిపితే కాలుష్యం చాలావరకు తగ్గుతుంది.


సౌకర్యాల కల్పనకు చర్యలు

- జె.నివాస్‌, కమిషనర్‌, ఫుడ్‌ సేఫ్టీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ 

ఉపయోగించిన వంటనూనెను మళ్లీ మళ్లీ వాడుతూ తయారుచేసే ఆహార పదార్థాలను తింటే క్యాన్సర్‌ వంటి వ్యాధులు వస్తున్నాయి. వాడిన వంటనూనెను జీవ ఇంధనంగా మార్చేందుకు ముందుకొచ్చే సంస్థలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు శాఖాపరంగా చర్యలు తీసుకుంటున్నాం.


ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అంచనా ప్రకారం దేశంలో ఏడాదికి నూనెల వినియోగం ఇలా...

మొత్తం వినియోగిస్తున్న నూనె 2,466.67 కోట్లు
గృహ అవసరాలకు 1,480 కోట్లు
వాణిజ్య అవసరాలకు 986.67 కోట్లు
రాష్ట్రంలో ఒకరోజు వినియోగించే నూనె 22 లక్షల లీటర్లు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని