Updated : 04 Jul 2022 05:51 IST

తెలంగాణకు డబుల్‌ ఇంజిన్‌ వస్తోంది

రాష్ట్ర అభివృద్ధే మా ప్రథమ కర్తవ్యం

మెగా జౌళిపార్కు ఏర్పాటు చేస్తాం

సైన్స్‌ సిటీని తీసుకొస్తాం

విజయ సంకల్పసభలో ప్రధాని నరేంద్రమోదీ


హైదరాబాద్‌ నగరం దేశ ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసానికి చిహ్నం. ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రం. తెలంగాణలోని ఇతర నగరాలు, పట్టణాల్లోనూ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దేశానికి, ప్రపంచానికి ఇచ్చేందుకు ఇక్కడ ఎంతో మేధోసంపత్తి ఉంది. హైదరాబాద్‌ ప్రతిభకు పట్టం కడుతుంది. భాజపా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది’’

- ప్రధాని మోదీ


ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌కు ప్రజలు బాటలు వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో అభివృద్ధి ఎన్నోరెట్లు పెరిగిందని, మున్ముందు తెలంగాణ అదే మార్గంలో నడుస్తుందన్నారు. రాష్ట్రం నలుదిక్కులా అభివృద్ధి చెందాలన్నదే భారతీయ జనతాపార్టీ లక్ష్యమని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభ్యున్నతి కోసం తాము నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. ఎనిమిదేళ్లుగా ప్రజల జీవనప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించామని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కేంద్ర పథకాలు అందించేలా కృషి చేస్తున్నామన్నారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రజలకు ఎంతో చేశామన్నారు. ఉచిత టీకాలు, రేషన్‌ అందించామని మోదీ గుర్తు చేశారు. రాష్ట్రంలో మెగా జౌళి పార్కును ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రారంభించనున్న ఏడుపార్కులలో ఒకటి ఇక్కడికే వస్తుందని, దీని ద్వారా రైతులకు మేలు జరుగుతుందని, యువతకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. హైదరాబాద్‌లో సైన్స్‌సిటీ ఏర్పాటుకు ఎంతో ప్రయత్నిస్తున్నామన్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఆదివారం సాయంత్రం ‘విజయ సంకల్ప’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. ముందుగా తెలుగులో మాట్లాడారు. ‘భాజపాను ఆశీర్వదించేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులకు.. ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. తెలంగాణ మొత్తం ప్రజలందరూ ఈ సభకు వచ్చారనిపిస్తోంది. మీరు నాపట్ల చూపిన ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు’ అని అన్నారు. తర్వాత ప్రసంగం ఇలా సాగింది. ‘‘తెలంగాణ పరాక్రమాల గడ్డ. భద్రాచలంలో శ్రీరాముడు, యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి, జోగులాంబ అమ్మవారు, వరంగల్‌ భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి. కాకతీయుల వీరత్వం, శిల్పకళా సౌందర్యం ఎంతో గొప్పవి. ఇక్కడి సాహిత్యకారుల కృషి దేశానికే గర్వకారణం. కళలు, నైపుణ్యం ఇక్కడ మెండుగా ఉన్నాయి..ప్రాచీన సంస్కృతి, పరాక్రమాలకు తెలంగాణ పుణ్యస్థలం. ఈ గడ్డ ఎంతో స్ఫూర్తిని ఇస్తోంది. తెలంగాణ అభివృద్ధికి భాజపా తొలి ప్రాధాన్యమిస్తోంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం పనిచేస్తోంది. బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేస్తోంది. అందరితో కలిసి అందరి అభివృద్ధి (సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌) కోసం పనిచేస్తున్నాం. కరోనా కాలంలో ప్రజలకు ఉచితంగా టీకాలు అందించాం. ఉచిత రేషన్‌ ఇచ్చాం. గత ఎనిమిదేళ్లలో ప్రతి భారతీయుడికి మంచి చేసేందుకు యత్నించాం. దశాబ్దాల నుంచి వంచనకు గురైన  దళిత, గిరిజన, ఆదివాసీల అభివృద్ధి కోసం పనిచేశాం. కేంద్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో భాజపాపై తెలంగాణ ప్రజల విశ్వాసం పెరుగుతోంది. ఇక్కడికి వచ్చిన ప్రజలను చూస్తుంటే పార్టీపట్ల ఉన్న ప్రేమ, ఉత్సాహం దేశంలోని అందరికీ తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మూతబడిన కర్మాగారాలను పునరుద్ధరించాం. ఇందులో భాగంగా 2015లో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.650 కోట్లతో పునరుద్ధరించాం. దీంతో ఇక్కడ ఎరువుల ఉత్పాదన పెరిగింది. రైతులకు మేలు జరుగుతోంది. విదేశాలపై ఆధారపడటం తగ్గుతోంది. త్వరలోనే ఈ కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తాం. 

మౌలిక వసతులు కల్పిస్తున్నాం 

అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ఆధునిక మౌలిక సదుపాయాలు అవసరం. ఇందుకోసం హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా రూ.1500 కోట్లతో 4, 6 లేన్ల రోడ్లు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మిస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసేలా 350 కి.మీ.రీజినల్‌ రింగురోడ్డు నిర్మిస్తున్నాం. ఎనిమిదేళ్ల కాలంలో జాతీయ రహదారుల పొడవు రెండు రెట్లు పెరిగి.. 2500 కి.మీ.నుంచి 5 వేల కి.మీకు చేరింది. గ్రామాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసేలా 2700 కి.మీ పొడవైన రోడ్లను నిర్మించాం. గ్రామీణ సడక్‌ యోజన మూడో దశ కింద రూ.1700 కోట్లతో 2500 కి.మీ పొడవైన రోడ్లు మంజూరు చేశాం. ఎనిమిదేళ్లలో తెలంగాణలో రూ.31 వేల కోట్ల ఖర్చుతో కొత్త రైల్వే లైన్లు నిర్మించాం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.


వ్యూహాత్మకంగా ప్రధాని ప్రసంగం

విజయ సంకల్ప సభలో దాదాపు అరగంట పాటు ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఎక్కడా ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస ఊసెత్తలేదు. ఎలాంటి రాజకీయ విమర్శలు చేయలేదు. కేసీఆర్‌ శనివారం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా ప్రచారసభలో సంధించిన ప్రశ్నల ప్రస్తావన లేకుండానే ప్రధాని ప్రసంగం ముగించారు. పార్టీ, అభివృద్ధి అంశాలతో ప్రసంగం సాగింది. మరోవైపు ఇతర నాయకులు మాత్రం తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యంగా ప్రసంగాలు చేశారు. విజయ సంకల్ప సభకు భారీగా జనసమీకరణ చేయడం చూసి ప్రధాని మోదీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను భుజం తట్టి అభినందించారు.

నేడు ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు

హైదరాబాద్‌లో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేశారు. హెచ్‌ఐసీసీ నొవాటెల్‌లో కార్యవర్గ సమావేశాలు ముగిశాక హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానానికి వెళ్లారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో రోడ్డు మార్గాన రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ప్రధాని బస దృష్ట్యా రాజ్‌భవన్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత కల్పించారు. సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మోదీ ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వెళ్లనున్నారు.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని