కదలివచ్చిన కమల దండు!

భాజపా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయ సంకల్ప సభకు రాష్ట్రం నలుమూలల నుంచి జనం భారీగా తరలివచ్చారు. బస్సులు, లారీలు, వివిధ రకాల వాహనాలలో అధిక సంఖ్యలో

Published : 04 Jul 2022 04:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయ సంకల్ప సభకు రాష్ట్రం నలుమూలల నుంచి జనం భారీగా తరలివచ్చారు. బస్సులు, లారీలు, వివిధ రకాల వాహనాలలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభ ప్రారంభానికి ముందు నుంచే జనం రాక మొదలు కాగా.. ప్రధాని ప్రసంగిస్తుండగానూ కొనసాగుతూనే ఉంది. మారుమూల ప్రాంతాల నుంచీ శ్రేణులను తరలించేందుకు పార్టీ ఏర్పాట్లు చేయడంతో బృందాలుగా బయలుదేరి నగరానికి చేరుకున్నారు. మణుగూరు, భద్రాచలం నుంచి రైళ్లలో వెయ్యి మంది వచ్చారు. ములుగు, ఏటూరునాగారం నుంచి ప్రైవేటు బస్సుల్లో పలువురు వచ్చారు. ఇటు నారాయణపేట, మక్తల్‌ నియోజకవర్గాల నుంచి మొదలుకొని అటు ఆదిలాబాద్‌, భైంసా, కాగజ్‌నగర్‌ నియోజకవర్గాల వరకు వేల మంది కార్యకర్తలు తరలివచ్చారు. ఆర్టీసీ బస్సులను కూడా శ్రేణుల తరలింపునకు ఏర్పాటు చేయడంతో వివిధ జిల్లాల నుంచి బృందాలుగా వచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు పాదయాత్రగా చేరుకున్నారు. నలువైపులా ఏర్పాటుచేసిన పార్కింగ్‌ పాయింట్ల నుంచి జనం వరుస కట్టి నడుచుకుంటూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వారంతా ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ దండులా రావడం కాషాయ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది. సభకు వచ్చిన వారిలో యువత శాతమే అధికంగా కనిపించింది. ఉత్తేజాన్ని రగిలించే పాటలు.. పాదం కదిలించే నృత్యాలతో విజయ సంకల్ప సభ వద్ద కళాకారుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నగరానికి చెందిన జనచైతన్య కళామండలి ప్రతినిధులు ఆటాపాటలతో అలరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని