అమరావతిలో ఎల్పీఎస్‌ పనులు ప్రారంభం

రాజధాని అమరావతిలో భూసమీకరణ ప్రాంతంలో అభివృద్ధి పనులకు(ఎల్పీఎస్‌ ప్రాజెక్టు) సోమవారం సీఆర్‌డీఏ అధికారులు శ్రీకారం చుట్టారు. రూ.192.52 కోట్లతో జోన్‌-4లోని తుళ్లూరు మండలం పిచ్చుకలపాలెం సమీపంలోని ప్లాట్లలో

Published : 05 Jul 2022 05:15 IST

రూ.193 కోట్లతో మొదలుపెట్టిన సీఆర్‌డీఏ కమిషనర్‌

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో భూసమీకరణ ప్రాంతంలో అభివృద్ధి పనులకు(ఎల్పీఎస్‌ ప్రాజెక్టు) సోమవారం సీఆర్‌డీఏ అధికారులు శ్రీకారం చుట్టారు. రూ.192.52 కోట్లతో జోన్‌-4లోని తుళ్లూరు మండలం పిచ్చుకలపాలెం సమీపంలోని ప్లాట్లలో పనులను సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ లాంఛనంగా ప్రారంభించారు. జోన్‌-4లోని పిచ్చుకలపాలెం, అనంతవరం, తుళ్లూరు గ్రామాల్లోని కొన్ని ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. ఇందులోని 1,358.42 ఎకరాల్లో విస్తరించిన మొత్తం 4,551 ప్లాట్లలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నారు. రూ.192.52 కోట్లతో తొలుత 63.45 కి.మీ. నిడివితో రెండు వరుసల రహదారులను నిర్మించనున్నారు. తర్వాత ఒక్కొక్కటి 115.14 కి.మీ.నిడివి చొప్పున వర్షపునీటి మళ్లింపు కాలువలు, నీటి సరఫరా లైన్లను ఏర్పాటుచేస్తారు. మురుగునీటి శుద్ధికి 19 ఎంఎల్‌డీ సామర్థ్యమున్న ఎస్టీపీలు రానున్నాయి. రహదారుల నిర్మాణంతోపాటు అన్ని పనులకు రూ.622.87 కోట్లు ఖర్చవుతుందని అంచనా. భూములు, ప్లాట్ల వేలం ద్వారా ఆర్థికంగా బలోపేతమవడానికి కృషి చేస్తున్నామని సీఆర్‌డీఏ కమిషనర్‌ తెలిపారు.  ఎసైన్డ్‌ రైతుల సమస్యలు, కౌలు విషయమై ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన ఎసైన్డ్‌ రైతు, దళిత ఐకాస నాయకుడు పులి చిన్నా కమిషనర్‌కు విన్నపమిచ్చారు. సత్వరం పరిష్కరించాలని అర్థిస్తూ కాళ్లు పట్టుకున్నారు. దీనిపై దృష్టి పెడతానని వివేక్‌ యాదవ్‌ హామీనిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని