Published : 05 Jul 2022 05:15 IST

గోదావరికి పెరుగుతున్న వరద

దేవీపట్నం, న్యూస్‌టుడే: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి వద్ద సోమవారం ఉదయానికి పర్యాటక బోట్లు మరమ్మతు చేసే స్థలానికి వరద నీరు చేరింది. పూడిపల్లి వద్ద సీతపల్లి వాగుకు పోటెత్తిన వరద నీరు చినరమణయ్యపేట-దండంగి గ్రామాలకు మధ్య సీతపల్లి వాగుపై ఉన్న చప్టా వద్దకు చేరింది. గోదావరిలో మరింత వరద పెరిగితే సీతపల్లి వాగుపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. వరదల కారణంగా పాపికొండల విహారయాత్రను అధికారులు ముందుగానే నిలిపేశారు. సీతారం నుంచి మంటూరు వరకూ గతేడాది వరదలకు ముందుగానే నిర్వాసితులు గ్రామాలను ఖాళీ చేసి పునరావాస కాలనీలకు చేరుకున్నారు. గోదావరికి ఎగువ ప్రాంతాలైన కొండమొదలు పంచాయతీ పరిధిలోని ఎనిమిది గ్రామాల ప్రజలు ఈ ఏడాది మే నెలలో పునరావాస కాలనీలకు చేరుకోగా.. కత్తనాపల్లి, కొత్తగూడెం, తాళ్లూరు గ్రామాలవారు అక్కడే ఉన్నారు. వరద పెరిగితే వారంతా కొండలపైకి వెళ్లాల్సి వస్తుంది. వీటిలో కొన్ని గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ సమస్యలతోపాటు ఇళ్లకు నష్టపరిహారం సైతం అందలేదని చెబుతున్నారు. వరద మరింత పెరిగితే ఎగువ కాఫర్‌డ్యాం సమీపంలోని పోశమ్మ గండికి ప్రవాహం మరింత పెరిగే అవకాశముంది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని