Published : 06 Jul 2022 02:57 IST

భావితరాల భవిష్యత్తుపై దృష్టి

ప్రపంచంతో పోటీపడి మన పిల్లలు నెగ్గాలి 

ఆ ఆలోచనతోనే విద్యా వ్యవస్థలో మార్పులు

సెప్టెంబరులో ట్యాబులు అందజేస్తాం

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడి

ఆదోనిలో విద్యా కానుక కిట్ల పంపిణీ

ఈనాడు - కర్నూలు

భావితరాల భవిష్యత్తుపై దృష్టి సారించి.. 10-15 ఏళ్ల వయసులోనే ప్రపంచంతో పోటీపడి మన పిల్లలు నెగ్గుకురావాలన్న ఆలోచనతో విద్యా వ్యవస్థలో మార్పులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నాణ్యమైన విద్యనందించి పిల్లల తలరాతలు మారేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న విద్యా కానుక పథకాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 47 లక్షల మంది విద్యార్థులకు రూ.931 కోట్లతో జగనన్న విద్యా కానుక అందిస్తున్నాం. పేదరికం నుంచి బయటపడేలా మెరుగైన ఆంగ్ల చదువులుండాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో ఎక్కడైనా బతికే శక్తి వస్తుంది. ఇందులో
భాగంగానే క్రమం తప్పకుండా మూడేళ్లుగా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నాం. ఉద్యమంలా సర్కారు బడుల్లో ‘నాడు-నేడు’ కింద మార్పులు చేపడుతున్నాం. గతంలో ఏ పాలకులూ ఆలోచించని విధంగా జగనన్న గోరుముద్ద పథకంతో పౌష్టికాహారాన్ని
విద్యార్థులకు అందిస్తున్నాం.

ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చి ద్విభాషా పుస్తకాలతోపాటు, మెరుగైన చదువులకు శ్రీమంతుల పిల్లలు రూ.24వేలు చెల్లించి చేరే బైజూస్‌ కంపెనీతో ఒప్పందం చేసుకుని యాప్‌ అందుబాటులోకి తెస్తున్నాం. విద్యా కానుక ఖర్చు ఏటా పెరుగుతూ పోతున్నా.. ఎక్కడా వెనకడుగు వేయకుండా మేనమామగా పిల్లలకు అందజేస్తున్నా’ అని పేర్కొన్నారు.

బైజూస్‌తో ఒప్పందం...
‘ఎనిమిదో తరగతిలోకి అడుగుపెడుతున్న దాదాపు 4.70 లక్షల మంది విద్యార్థులకు రూ.12వేల విలువైన ట్యాబ్‌లను సెప్టెంబరులో పంపిణీ చేస్తాం. బైజూస్‌ సంస్థతో ఒప్పందం చేసుకుని ట్యాబ్‌లకు అనుసంధానం చేసి 2025 మార్చిలో విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలు ఆంగ్ల మాధ్యమంలో రాసి మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళిక రచిస్తున్నాం. విద్యా కానుక కిట్లతోపాటు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు అందిస్తున్నాం. పాఠశాలలు తెరవగానే పిల్లలకు పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, బ్యాగు కొనాలనే ఆలోచనతో తల్లిదండ్రులు ఇబ్బందిపడకూదనే విద్యా కానుక కిట్లు అందజేస్తున్నాం. రాష్ట్రంలో బడిమానేసే పిల్లలు తగ్గడానికి, పెద్ద చదువులు చదివించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. ఈతరం, భావితరం పేదరికమనే సంకెళ్లను తెంచుకోవాలి. సామాజిక, ఆర్థిక అంతరాలు తగ్గాలి. ఉన్నత, ఆంగ్ల మాధ్యమ చదువులు పేదింటి పిల్లలకు అందాలి. విద్యా విప్లవంతో రాష్ట్రంలో ప్రతి ఇంటిలో ఆనందం, అభివృద్ధి చూడగలం. ఇదే నా సంకల్పం’ అని వివరించారు.

విద్యా రంగంలో 9 పథకాలు
‘గత ప్రభుత్వ హయాంలో 2018-19లో సర్కారు బడుల్లో 1-10వ తరగతి వరకు 37.10 లక్షల మంది చదవగా.. 2021-22లో 44.30 లక్షలకు పెరిగారు. 7.20 లక్షల మంది ప్రైవేటు బడులు మానేసి ప్రభుత్వ బడుల్లో చేరారు. విద్యా రంగంలో 9 ప్రధాన పథకాలను అమలు చేస్తున్నాం. నాడు-నేడు, విద్యా కానుక, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, అమ్మ ఒడి, ఆంగ్ల చదువులు, విద్యా దీవెన, వసతి దీవెనతోపాటు తొమ్మిదోది బైజూస్‌తో ఒప్పందం’ అని పేర్కొన్నారు.  

పాలనలో తేడా గమనించండి
‘మూడేళ్లలో విద్యా రంగానికి అమ్మ ఒడి పథకం ద్వారా 44 లక్షల మంది తల్లులకు, 80 లక్షల మంది విద్యార్థులకు రూ.19,617 కోట్లు ఖర్చు చేశాం. గతంలో 8, 9 నెలలపాటు సరకులకు, ఆయాలకు బకాయిలు పెట్టేవారు. నాణ్యత లేకుండా భోజనం పెట్టేవారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారానికి చంద్రబాబు రూ.500 కోట్లు ఖర్చు చేస్తే వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పేరుతో రూ.1980 కోట్లు ఖర్చు చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో చేసిన ఖర్చుకు, ఇప్పటి ఖర్చుకు తేడా గమనించాలి. శానిటరీ న్యాప్కిన్స్‌ ఇచ్చేలా స్వేచ్ఛ పేరుతో పథకం తెచ్చాం’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

విద్యా కానుక కార్యక్రమంలో భాగంగా తొలుత మున్సిపల్‌ హైస్కూల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బల్లపై కూర్చుని విద్యార్థులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. గ్యాలరీలో ఉంచిన విద్యా కానుక యూనిఫాం, బూట్లు, పుస్తకాల స్టాల్‌ను సందర్శించారు. కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుమ్మనూరు జయరాం, ఎంపీ సంజీవ్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, కంగాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


బయటే నిలిపేశారు

సభాస్థలి సామర్థ్యం 3వేలు. జన సందోహం ఎక్కువగా చూపించుకోవడానికి భారీగా కార్యకర్తలను, డ్వాక్రా మహిళలు, విద్యార్థులను తరలించారు. సభాస్థలి కిక్కిరిపోయింది. తొక్కిసలాట అవుతుందన్న అనుమానంతో చాలా మందిని బయటే నిలిపివేశారు.

* ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి కుమారుడు జయ మనోజ్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కుమారుడని కార్యకర్తలు చెప్పగా, నిన్ను వదిలితే 175 మంది ఎమ్మెల్యేల కుమారులను వదలాల్సి వస్తుందంటూ పోలీసులు బదులిచ్చారు. కొద్దిసేపటికి  కలెక్టర్‌ జోక్యంతో ఆయన్ని లోపలికి వదిలారు.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని