Published : 06 Jul 2022 02:57 IST

మిర్చిని నల్లిపేస్తోంది

మొదలైన పురుగు ప్రభావం

తోటలను దున్నేస్తున్న రైతులు

ప్రకాశం, కర్నూలు, కడప, పల్నాడు జిల్లాల్లో బెడద తీవ్రం

ఈనాడు - అమరావతి

గతేడాది మిర్చి పంట రైతులను నిలువునా ముంచిన నల్లతామర పురుగు ఈ ఏడాదీ విజృంభిస్తోంది. రాయలసీమలోని పలు ప్రాంతాలతోపాటు ప్రకాశం జిల్లా, కర్ణాటకలలో నల్లతామర ప్రభావం ఎక్కువగా ఉంది. పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేక పలుచోట్ల తోటలను దున్నేస్తున్నారు. మరోవైపు పచ్చి మిర్చి దిగుబడి తగ్గి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. 4 రోజుల్లోనే కిలోకు రూ.10 వరకు ధర పెరిగింది. ఎకరాకు రూ.50 వేలకుపైగా పెట్టుబడి పెట్టి మిర్చి సాగును ఏప్రిల్‌, మే నెలల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చేపట్టారు. ప్రస్తుతం కడప, కర్నూలు, ప్రకాశం తదితర జిల్లాల్లో కోతలు సాగుతున్నాయి. కోస్తాలో నారు దశలో ఉంది. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో రక్షిత సేద్య విధానంలో కొన్నిచోట్ల, ఆరుబయట మరికొన్నిచోట్ల హైబ్రిడ్‌ విత్తనాలు నాటారు. నారు పెరుగుతోంది. నల్లితామర ఆశించిన చేను చూడటానికి పచ్చగా ఉన్నా పూత నిలవదు. పార్విస్పైనస్‌ అని పిలిచే ఇది ఇండోనేసియా నుంచి వచ్చింది. మిర్చి తోటలనే కాకుండా కూరగాయలు, పండ్ల తోటలనూ ఆశిస్తోంది. నల్లి కారణంగానే గతేడాది రైతులు ఎకరాకు రూ.లక్షకుపైగా నష్టపోయారు. కొందరు తోటలను తొలగించగా.. ఎక్కువ మంది రైతులకు ఎకరాకు 2, 3 క్వింటాళ్ల దిగుబడులే వచ్చాయి. జాతీయ స్థాయి పరిశోధన సంస్థల శాస్త్రవేత్తల బృందాలు దక్షిణాది రాష్ట్రాల్లో పరిశీలించి భారీ నష్టాన్ని గుర్తించాయి. అయినా రైతులకు పరిహారం అందలేదు.

* పచ్చి మిర్చిలో 8 కోతల వరకు దిగుబడి ఉంటుంది. గతేడాది నాలుగైదు కోతలు పూర్తయ్యాక నల్లి ఆశించింది. ఈ ఏడాది 1, 2 కోతలు కాకముందే నల్లి ప్రభావం మొదలైంది. వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల, పెండ్లిమర్రి తదితర మండలాల్లో వారం నుంచి నల్లి ప్రభావం కనిపిస్తోంది. ఐదు కోతలు పూర్తయిన తోటల్లోనూ నల్లి తీవ్రత ఉంది. గుంటూరు జిల్లాలో పలుచోట్ల నారు దశలో ఉన్న తోటలో నల్లి ప్రభావం కనిపిస్తోంది. కర్నూలు జిల్లాలోనూ ప్రభావం ఉంది. నల్లి నివారణకు రైతులు పురుగు మందులను విపరీతంగా పిచికారీ చేస్తున్నారు. గతంలో 8 రోజులకోసారి చేసే పిచికారీ.. ఇప్పుడు 4, 5 రోజులకోసారి తప్పడం లేదని, అయినా నిష్ఫలమవుతోందని వాపోతున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని