మురుగు కాలువలోకి దిగి ఎమ్మెల్యే నిరసన

అధికారుల నిర్లక్ష్యం, శాఖల మధ్య సమన్వయ లోపంతో కొన్నేళ్లుగా డ్రైనేజీ సమస్య పరిష్కారం కావడం లేదంటూ నెల్లూరు గ్రామీణ (వైకాపా) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

Published : 06 Jul 2022 05:44 IST

అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఆందోళన

పనులు చేస్తామన్న లిఖితపూర్వక హామీతో విరమణ

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: అధికారుల నిర్లక్ష్యం, శాఖల మధ్య సమన్వయ లోపంతో కొన్నేళ్లుగా డ్రైనేజీ సమస్య పరిష్కారం కావడం లేదంటూ నెల్లూరు గ్రామీణ (వైకాపా) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మంగళవారం నెల్లూరు ఉమ్మారెడ్డిగుంటలో మురుగు కాలువలోకి దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే, కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యంతో కాలువ నిర్మించలేదని, దీంతో ఈ ప్రాంతంలో వందల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. మూడేళ్లుగా సమస్యను పరిష్కరించాలని అడుగుతుంటే ఒకరిపై ఒకరు వంకలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే కాలువలోకి దిగానని తెలిపారు. కష్టకాలంలోనూ సీఎం జగన్‌ రోడ్ల పనులకు రూ.62 కోట్లు మంజూరు చేస్తే.. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని.. అంతవరకూ కదలబోనని స్పష్టం చేశారు. ఇచ్చిన గడువులోగా సమస్య పరిష్కారం కాకుంటే మురుగు నీటిలోనే పడుకుంటానని చెప్పారు. దీంతో అధికారులు ఈ నెల 15వ తేదీలోగా కాలువ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, ఆగస్టు 15లోగా కార్పొరేషన్‌, 25వ తేదీలోగా రైల్వేశాఖకు సంబంధించిన పనులు పూర్తి చేస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని