సీనియర్‌ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

సీనియర్‌ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరి (88) సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ బల్కంపేటలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అయిదున్నర దశాబ్దాల

Published : 06 Jul 2022 05:44 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సీనియర్‌ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరి (88) సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ బల్కంపేటలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అయిదున్నర దశాబ్దాల పాటు సినీ పాత్రికేయుడిగా, విశ్లేషకుడిగా, సాహితీవేత్తగా ఆయన సేవలు అందించారు. గత ఏడాది సతీమణి లక్ష్మి మృతి చెందాక ఆయన మానసికంగా బలహీనపడ్డారు. కుమారుడు శ్రీరామ్‌ విదేశాల్లో ఉండగా, కుమార్తె తండ్రితో పాటు ఉంటున్నారు. ఇటీవల ఇంట్లో పడిపోవడంతో శ్రీహరికి తుంటి ఎముక విరిగింది. నిమ్స్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. వృద్ధాప్యం, వివిధ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో కన్నుమూశారు. గుడిపూడి శ్రీహరి 1934 సెప్టెంబరు 8న కృష్ణాజిల్లా కేసరపల్లిలో జన్మించారు. తండ్రి శ్రీరామలక్ష్మణరావు, తల్లి కన్నమ్మలకు ఆయన ఆరో సంతానం. గన్నవరంలో పాఠశాల విద్య, విజయవాడలో బీఎస్సీ, రాజమహేంద్రవరంలో బీఎడ్‌ చదివారు. దిల్లీ విశ్వవిద్యాలయంలో ఎంఏ (గణితం) చేశారు. అనంతరం పత్రికారంగంలోకి అడుగుపెట్టి.. ‘ది హిందూ’ దినపత్రికలో విలేకరిగా పనిచేశారు. ‘ఈనాడు’లో 25 ఏళ్లపాటు హరివిల్లు పేరిట ప్రత్యేక శీర్ష్షిక నిర్వహించారు. ‘సితార’ సినిమా పత్రికలో వ్యాసాలు, చిత్ర సమీక్షలు రాసేవారు. శ్రీహరి ఆలిండియా రేడియోలో క్యాజువల్‌ న్యూస్‌రీడర్‌గా కూడా సేవలు అందించారు. నాట్యగురువు నటరాజ రామకృష్ణ రూపొందించిన పేరిణి, ఆంధ్రనాట్యానికి ప్రాచుర్యం తీసుకొచ్చారు. ఎఫ్‌డీసీ స్క్రిఫ్ట్‌, నంది అవార్డుల కమిటీ, సినిమా సెన్సార్‌ బోర్డు సభ్యుడిగా, ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు 2013లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘పత్రికా రచన’లో ‘కీర్తి’ పురస్కారం అందజేసింది. శ్రీహరి కుమారుడు అమెరికా నుంచి వచ్చాక అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని