పంటకాలం మారాక పసుపు కొనుగోలు?

రైతుల చేతికి పంట వచ్చీ రాకముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామంటూ ప్రకటనలు ఇచ్చే సర్కారు.. రైతులవద్ద పసుపు ఉన్నన్నాళ్లూ మౌనరాగమే ఆలపించింది. మద్దతు ధర రావడం

Published : 06 Jul 2022 05:44 IST

60% మందికి పైగా రైతులు అమ్ముకున్నాక ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: రైతుల చేతికి పంట వచ్చీ రాకముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామంటూ ప్రకటనలు ఇచ్చే సర్కారు.. రైతులవద్ద పసుపు ఉన్నన్నాళ్లూ మౌనరాగమే ఆలపించింది. మద్దతు ధర రావడం లేదు కొనుగోలు చేయండని రైతులు మొత్తుకున్నా పట్టించుకోలేదు. గతేడాది ఖరీఫ్‌ పంటగా సాగైన పసుపు కొనుగోలుకు ఈ ఏడాది ఖరీఫ్‌ మొదలయ్యాక ఉత్తర్వులు ఇచ్చింది. అదీ మూడేళ్ల నాటి మద్దతు ధరపైనే.. కొత్తగా పెంచిందీ లేదు. సాగుదారుల్లో 60% మంది తక్కువ ధరకు అమ్ముకున్న తరువాత సేకరణకు పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయంతో వ్యాపారులకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో గతేడాది 60వేల ఎకరాల్లో పసుపు సాగు చేశారు. వర్షాలు, వరదలతో పలు చోట్ల పంట దెబ్బతింది. దిగుబడులు తగ్గాయి. ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఫిబ్రవరి, మార్చి నుంచి పసుపు దున్నించి.. ఉడికించే ప్రక్రియ మొదలైంది. అప్పటి వరకు క్వింటాల్‌ రూ.7,400 వరకు ఉన్న పసుపు ధరలు క్రమంగా పడిపోతూ రూ.5వేలకి తగ్గాయి. కడప, దుగ్గిరాల మార్కెట్లలోనూ తక్కువ ధరలకే విక్రయించారు. సగటున క్వింటాల్‌కు రూ.5వేల నుంచి రూ.5,200 మాత్రమే ధర లభించిందని కొందరు వివరించారు. పసుపు పంటకు ప్రభుత్వం 2019-20లో క్వింటాల్‌కు రూ.6,850 చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి అదే ధరను కొనసాగిస్తోంది. పంట కాలానికి ముందే మద్దతు ధరలు ప్రకటిస్తామంటూ ఘనంగా ప్రకటనలు తప్పితే.. ఆచరణలో అమలు కావడం లేదని రైతులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల నాటి మద్దతు ధరతోనే.. ఈ ఏడాదీ కొనుగోలు చేస్తామంటూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ-కర్షక్‌, ఈ-పంట నమోదు ఆధారంగానే..
ఒక్కో రైతు నుంచి గరిష్ఠంగా 30 క్వింటాళ్ల లెక్కన పసుపు సేకరించాలని ఆదేశించింది. జులై ఆఖరుకు ముగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా.. పూర్తిస్థాయిలో ఇంకా కొనుగోలు ప్రక్రియే మొదలు కాలేదు. ఈ-కర్షక్‌, ఈ-పంట నమోదును ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఈ-పంటలో పసుపు నష్టపోయిన రైతుల పేర్లను నమోదు చేశారు. పంటల బీమా అందించారు. వీరి నుంచి పంట కొనుగోలుకు నిబంధనలు అడ్డొస్తున్నాయి. దీంతో వారి నుంచి ఎంతమేరకు కొనుగోలు చేయొచ్చనే జాబితాలను తయారు చేస్తున్నారు. ప్రభుత్వం ఆలస్యంగా కొనుగోలు చేయడంతో ఎకరాకు రూ.30వేల వరకు నష్టపోయామని పలువురు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని