Updated : 07 Jul 2022 07:08 IST

చదువు గందరగోళం

బడి దూరం.. చిన్నారులకు తప్పని కాలినడక

తల్లిదండ్రులకు వ్యయప్రయాస

విలీనంతో తగ్గిపోనున్న బడులు, ఉపాధ్యాయ పోస్టులు

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు

ఈనాడు - అమరావతి

ప్రభుత్వ పాఠశాలల విలీనంతో విద్యార్థులకు చదువు భారంగా మారనుంది. బడులు, ఉపాధ్యాయుల సంఖ్య భారీగా తగ్గిపోనుంది. ప్రస్తుతం తమ గ్రామాల్లోని బడుల్లో చదువుతున్న పిల్లలు 1, 2 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. 3, 4, 5 తరగతులు చదివే 8-9 ఏళ్ల వయసు చిన్నారులు పుస్తకాల సంచులు మోస్తూ కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయాల్సి వస్తోంది. కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో తరగతులను విలీనం చేస్తున్నామని అధికారులు చెబుతున్నా విద్యార్థుల ఇళ్ల నుంచి లెక్కిస్తే ఈ దూరం మరింత పెరుగుతోంది. మారుమూల గ్రామాల్లో రవాణా సదుపాయం లేనిచోట పిల్లలు నడిచి వెళ్లాలి. లేదంటే పెద్దలు పనులు మానుకుని, పిల్లల్ని ప్రతి రోజూ బడికి తీసుకువెళ్లి, తీసుకురావాలి. ఆటోల్లో పిల్లలను బడులకు పంపిస్తే రవాణా ఛార్జీలు భారమవుతాయి. ఇటీవల విద్యా హక్కు చట్టానికి సవరణ చేసినందున రవాణా ఛార్జీలను ప్రభుత్వం చెల్లించే పరిస్థితి లేదు. బాలికల చదువుపైనా ఇది ప్రభావం చూపుతుంది. ఏటా తరగతుల తరలింపు కారణంగా పాఠశాలల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఉపాధ్యాయ పోస్టులు మిగిలిపోతాయి. ప్రాథమిక బడుల్లో మిగిలే 1, 2 తరగతులవల్ల అవి ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారతాయి. పాఠశాలల విలీనాన్ని రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బుధవారమూ నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు చేశారు.

8 ఏళ్ల వయసువారు ఎలా వెళ్తారు?
ప్రస్తుతం ఉన్న నివాసానికి కిలోమీటరు దూరంలోని బడి నుంచి 3, 4, 5 తరగతులను మరో కిలోమీటరు దూరంలో ఉన్న ఉన్నత, ప్రాథమికోన్నత బడుల్లో విలీనం చేస్తే పిల్లలకు దూరం పెరగనుంది. మూడో తరగతి చదివే విద్యార్థుల వయసు 8-9 ఏళ్లు ఉంటుంది. ఈ వయసులో పుస్తకాల సంచులను మోసుకుంటూ 2 కిలోమీటర్లు ఎలా వెళ్లి రాగలుగుతారు? సైకిళ్లపై పిల్లల్ని పంపేందుకు తల్లిదండ్రులు భయపడతారు. కొన్నిచోట్ల ప్రధాన రహదారులను దాటాల్సి ఉంటుంది. అలాంటి చోట్ల పిల్లలు రోడ్లు దాటడం ప్రమాదకరమే. ఆటోలు, ఇతరత్రా రవాణా సాధనాలను వినియోగిస్తే ఆ ఛార్జీలు అదనపు భారంగా మారతాయి.

* అనంతపురం జిల్లా గలగల గ్రామంలోని పాఠశాలను గొల్లపల్లి ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. గలగల నుంచి వెళ్లాలంటే మధ్యలో వంక దాటాలి. వర్షాకాలంలో వంక పొంగితే విద్యార్థులు ప్రమాదాల బారినపడతారు. సత్యసాయి జిల్లా మడకశిర మండలం బెగార్లపల్లి పాఠశాలను మడకశిరలో విలీనం చేశారు. ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదు. దారి మధ్యలో వంక ఉంది. వర్షాకాలంలో విద్యార్థుల రాకపోకలు ఇబ్బందికరమే.

* నెల్లూరు గ్రామీణ మండలంలోని కొండ్లపూడి 6, 7, 8 తరగతులను పొట్టేపాలెం ఉన్నత పాఠశాలలో కలిపారు. కొండ్లపూడి నుంచి విద్యార్థులు వెళ్లేందుకు ప్రధాన రహదారిని దాటాలి. ఇక్కడి నుంచి బస్సు సౌకర్యం లేదు. ఆటోల్లో వెళ్లాల్సిందే.

* ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లి ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను ఎడవల్లి ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఉన్నత పాఠశాలకు వెళ్లే దారి మధ్యలో వాగు ఉంది. వర్షాకాలంలో ఇది పొంగితే ప్రమాదమే. 

చివరికి మిగిలేవి 11వేలే..
తరగతుల విలీనం కారణంగా రాష్ట్రంలో చివరకు... 3-10 తరగతులుండే హైస్కూళ్లు, 3-12 తరగతుల హైస్కూల్‌ ప్లస్‌ బడులు 10,826 మిగులుతాయి. గతేడాది 250 మీటర్లలోపు, ఈ ఏడాది కిలోమీటరులోపు ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో విలీనం చేస్తున్నారు. ఇవికాకుండా 100 మందిలోపు విద్యార్థులుంటే ప్రాథమికోన్నత బడుల నుంచి 6, 7, 8 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలిస్తున్నారు. వచ్చే ఏడాది రెండు, ఆ తర్వాత ఏడాది 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని విలీనం చేస్తే రాష్ట్రంలో దాదాపుగా ప్రాథమిక బడులు కనుమరుగవుతాయి. ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటి, రెండు తరగతులుండే ఫౌండేషన్‌ బడులు, హైస్కూల్‌, హైస్కూల్‌ ప్లస్‌ మాత్రమే మిగులుతాయి.

ఇప్పటికే 51వేల పోస్టులు ఖాళీ..
ప్రభుత్వ ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో 51వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమగ్ర శిక్ష అభియాన్‌ కేంద్ర ప్రాజెక్టు అనుమతుల బోర్డు (పీఏబీ) పేర్కొంది. వర్క్‌ప్లాన్‌, బడ్జెట్‌-2022-23లో ఈ వివరాలను వెల్లడించింది. పాఠశాలల విలీనం, పోస్టుల హేతుబద్దీకరణతో సుమారు 7-8 వేల మంది ఉపాధ్యాయులను మిగులుగా తేల్చారు. వీరిలో ఎస్జీటీలే అధికం. ఎస్జీటీ పోస్టులను ఉన్నతీకరించి, స్కూల్‌ అసిస్టెంట్లుగా నియమించనున్నారు. ఈ విధానాలతో భవిష్యత్తులో ఖాళీలను భర్తీచేయాల్సిన అవసరం ఏర్పడకపోవచ్చు.

* ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 39,008 ఉపాధ్యాయ పోస్టులు, సెకండరీ స్థాయిలో 11,888 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని పీఏబీ పేర్కొంది.

* ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య భారీగా పెరిగింది. 2019-20లో 7,803 ఏకోపాధ్యాయ బడులుండగా.. ఇప్పుడిది 10,065కు పెరిగింది. 

బడి మధ్యలో మానేసే ప్రమాదం
రాష్ట్రంలో ఇప్పటికే సెకండరీ స్థాయిలో బడి మానేస్తున్నవారు 2.80 లక్షల మంది ఉన్నట్లు కేంద్ర పీఏబీ ఇటీవలే హెచ్చరించింది. దీన్ని నిలువరించాలని హెచ్చరించింది. ఇప్పుడు పాఠశాలల దూరం పెరిగితే చదువు మానేసే వారి సంఖ్య మరింత పెరుగుతుంది. కొన్నిచోట్ల విలీనాన్ని ప్రతిఘటిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు టీసీలు ఇస్తే ప్రైవేటు పాఠశాలలకు పంపించుకుంటామని అంటున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వ బడులు ఖాళీ అవుతాయి.


విలీనం వద్దే వద్దు

ఈ చిత్రంలో నిరసన తెలుపుతున్న వీరంతా... నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామవాసులు. పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం ఆందోళన చేపట్టారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి పెద్దసంఖ్యలో స్థానిక ప్రాథమికోన్నత పాఠశాల దగ్గరకు చేరుకుని తాళం వేశారు. గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో 230 మంది విద్యార్థులున్నారు. వీరిలో 6, 7, 8 తరగతులు చదువుతున్న 75 మందిని 3 కి.మీ. దూరంలోని అన్నారెడ్డిపాళెం ఉన్నత
పాశాలలో విలీనం చేశారు. ఇదే గ్రామంలోని ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో 170 మంది ఉండగా... వీరిలో 6, 7, 8 తరగతుల విద్యార్థులు 63 మందిని అన్నారెడ్డిపాళెం ఉన్నత పాఠశాలలో అధికారులు విలీనం చేశారు.

- న్యూస్‌టుడే, సంగం


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని