నవరత్నాల పేరుతో నవఘోరాలు

వేధించేవారిని వదిలిపెట్టను. అక్రమ కేసులు పెడుతున్న పోలీసులకు కచ్చితంగా చెబుతున్నా. మీ బలహీనతలను అడ్డుపెట్టుకుని మిమ్మల్ని అక్రమాలకు వాడుకుంటున్నారు. మీ అందరినీ గుర్తు

Updated : 07 Jul 2022 12:47 IST

వేధించేవారిని వదిలిపెట్టను

మంత్రి పెద్దిరెడ్డికి అన్ని కాంట్రాక్టులా?

అమ్మఒడి బూటకం.. ఆంగ్ల మాధ్యమం నాటకం

మదనపల్లె మినీ మహానాడులో చంద్రబాబు

వేధించేవారిని వదిలిపెట్టను. అక్రమ కేసులు పెడుతున్న పోలీసులకు కచ్చితంగా చెబుతున్నా. మీ బలహీనతలను అడ్డుపెట్టుకుని మిమ్మల్ని అక్రమాలకు వాడుకుంటున్నారు. మీ అందరినీ గుర్తు పెట్టుకుంటాం. ఎక్కడున్నా తప్పించుకోలేరు. రేపు ట్రైబ్యునల్‌ వేసి వడ్డీతో చెల్లించేలా శిక్షిస్తాం. సీఐడీ చీఫ్‌ మిమ్మల్ని కాపాడలేరు. తమాషాలు చేయొద్దు. నేను చండశాసనుడిలా ఉంటా.. జాగ్రత్త.

- చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, కడప: ‘అధికారం ఇస్తే తమాషాలు చేస్తారా? సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని 600 కేసులు పెట్టారు. 128 మందిని అరెస్టుచేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగితే నేను చేశానంటూ నారాసుర రక్త చరిత్ర అని సాక్షి పత్రిక రాసింది. ఆ పత్రిక ఎండీ భారతిరెడ్డిని అరెస్టు చేయగలరా?’ అని తెదేపా అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం ‘ఎన్టీఆర్‌ స్ఫూర్తి- చంద్రన్న భరోసా’ పేరుతో నిర్వహించిన మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం నవరత్నాల పేరుతో నవఘోరాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ‘సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారంటూ ఇటీవల పలువురిని అరెస్టుచేసి కొట్టారు. అలా కొట్టిన సీఐని గుర్తుపెట్టుకున్నాం. సీఎం జగన్‌.. తన బాబాయ్‌ హత్య కేసును ఆయన కుమార్తె మీదే నెట్టేసే కుట్ర చేస్తున్నారు. వివేకా కేసులో ఇప్పటికే ముగ్గుర్ని చంపేశారు. సత్తెనపల్లి దగ్గర రైలు బోగీ దహనం చేసి ఎంపీ రఘురామకృష్ణరాజును చంపే కుట్ర చేశారు. ఆయన గ్రహించి తిరిగి మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయారు. ఆయనపైనే తిరిగి ఇప్పుడు అన్యాయంగా కేసు పెట్టారు’ అని మండిపడ్డారు. ‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట వేస్తాం. తండ్రి.. కొడుకు... తమ్ముళ్లు పదవులు పంచుకుంటూ ఇసుక, గనులు, మద్యం పేరుతో దోచుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉండేవారికి కాంట్రాక్టు పనులు ఇవ్వడమా? పులివెందుల నుంచి పుంగనూరుకు పైపులైను పనులు, పుంగనూరులో మరో జలాశయం పనుల కాంట్రాక్టును ఏకపక్షంగా కట్టబెట్టారు. వీటి కథంతా చూస్తాం’ అని హెచ్చరించారు.
‘మూడేళ్లుగా అరాచక పాలనపై పోరాడుతున్నాం. ఎక్కడ చూసినా సమస్యలే. ప్రశ్నించినవారిని బెదిరించి కేసులు పెడుతున్నారు. మేం కన్నెర్ర చేస్తే వైకాపా నేతలు బయటకు రాలేరు. నాడు మేం తలచుకుంటే జగన్‌ పాదయాత్ర చేసేవారా? ఆ రోజు ఊరూరూ తిరిగి ముద్దులు పెట్టి.. ఇప్పుడేమో పిడిగుద్దులు గుద్దుతున్నారు. మా హయాంలో ప్రతి గ్రామంలో పాఠశాలలు కట్టించాం. మండలానికో జూనియర్‌ కళాశాల, రెవెన్యూ డివిజన్‌కో ఇంజినీరింగ్‌, జిల్లాకో వైద్యకళాశాల ఏర్పాటు చేశాం. ఇప్పుడేమో 8వేల గ్రామాల్లో పాఠశాలలు మూసేశారు. వీటిని మూయకుండా అడ్డుకోండి’ అని పిలుపునిచ్చారు. ‘ఇటీవల ఇంటర్‌, పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. వాటిని చూసి 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సీఎం చదవలేదు. ఇతరులు చదవరాదని బడులు మూసేసి చెట్లు.. పుట్టలు.. వాగులు.. వంకలు దాటుకుని చదువుకునేలా కక్షలకు పాల్పడుతున్నారు. జగన్‌ కూతుళ్లు విదేశాల్లో చదవాలి. అమ్మఒడికి ఆంక్షలు పెట్టి తల్లులను మోసం చేశారు. అమ్మఒడి బూటకం.. ఇంగ్లీషు మీడియం ఓ నాటకం. నాడు- నేడు అవినీతిమయం’ అని ఘాటుగా విమర్శించారు.

పోరాడేందుకు ఇంటికొకరు రావాలి
‘ప్రభుత్వంపై పోరాడేందుకు ఇంటికొకరు రావాలి. ఒకరిని అరెస్టు చేస్తే వందమంది వెళ్లి నిలదీయాలి. మీకు అండగా ఉంటాం. 24 గంటలు పనిచేసేలా మీకు ఫోన్‌ నంబరు ఇస్తాం. అన్ని రకాలా ఆదుకుంటాం’ అని భరోసా ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక అన్నింటిపై బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదలపై భారం మోపారు. నిత్యావసరాల ధరలు పెరిగాయి. కొత్త బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యం తెస్తున్నారు. మూడేళ్లలో 5సార్లు విద్యుత్తుఛార్జీలు పెంచారు. ప్రభుత్వంపై పోరాడేందుకు ఇంటికొకరు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు. కుండపోతలా వాన కురిసినా సభ నుంచి జనం కదలకుండా చంద్రబాబు ప్రసంగం పూర్తయ్యేవరకూ వేచి ఉన్నారు. పార్టీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో మదనపల్లె జనసంద్రంగా మారింది. సభలో పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసులురెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి అమర్‌నాథరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే డి.రమేష్‌ తదితరులు ప్రసంగించారు.


తెదేపా అధికారంలోకి రావడం తథ్యం

రాజంపేట పార్లమెంటు యువనేత గంటా నరహరి

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: మినీ మహానాడుకు వచ్చిన జనసందోహాన్ని చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెదేపా విజయదుందుభి మోగించి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమని రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ యువనేత గంటా నరహరి అన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని, ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమన్నారు. ఎన్నికలు ఎప్పుడెప్పుడాని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. చంద్రబాబు నాయకత్వం కింద పనిచేయడానికి తాను కొత్తగా వచ్చానని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని