భగ్గుమన్న వంటగ్యాస్‌

రెండు నెలలకే వంట గ్యాస్‌ మళ్లీ భగ్గుమంది. గృహ వినియోగ (14.2 కిలోలు) సిలిండర్‌ ధర రూ.50 పెరిగింది. దీంతో విజయవాడలో సిలిండర్‌ ధర రూ.1,075 అయింది. అనంతపురం

Published : 07 Jul 2022 03:11 IST

గృహ వినియోగ సిలిండర్‌పై రూ.50 బాదుడు

విజయవాడలో ధర రూ.1,075.. ఉరవకొండలో రూ.1,122

రెండేళ్లలో 75% పెరుగుదల

ఈనాడు, అమరావతి: రెండు నెలలకే వంట గ్యాస్‌ మళ్లీ భగ్గుమంది. గృహ వినియోగ (14.2 కిలోలు) సిలిండర్‌ ధర రూ.50 పెరిగింది. దీంతో విజయవాడలో సిలిండర్‌ ధర రూ.1,075 అయింది. అనంతపురం జిల్లా ఉరవకొండలో రూ.1,122 ఉంది. 5 కిలోల సిలిండర్‌ ధరను రూ.18 చొప్పున.. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ను రూ.8.50 పెంచారు. పెరిగిన ధరలతో పేద, మధ్య తరగతి వర్గాలు వంటగ్యాస్‌ అంటేనే కలవరపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలను ఇంధన సంస్థలు ఈ ఏడాది మార్చి 22న రూ.50, మే 7న రూ.50 చొప్పున పెంచాయి. ఇప్పుడు మళ్లీ రూ.50 పెంచాయి. మొత్తంగా చూస్తే మార్చి నుంచి రూ.153 వరకు పెరిగింది. రాష్ట్రంలో మొత్తం 1.43 కోట్ల గృహ వినియోగ వంట గ్యాస్‌ కనెక్షన్లుండగా అందులో నెలకు 1.15 కోట్ల సిలిండర్లు తీసుకుంటారని అంచనా.

ఏడాదికి వంటగ్యాస్‌కే రూ.8,600
గృహ వినియోగ సిలిండర్‌ ధరలు 2020 నుంచి గణనీయంగా పెంచుతున్న కేంద్రం.. వాటిపై రాయితీని క్రమంగా తొలగించింది. రెండేళ్లలో పరిశీలిస్తే.. ఒక్కో సిలిండర్‌పై రూ.561 పెరిగింది. అంటే 75% పెరుగుదల నమోదైంది. ఏడాదిలో 25% వరకు ఎగసింది. ఒక్కో కుటుంబం సగటున ఏడాదికి 8 సిలిండర్లను వినియోగిస్తారని అంచనా. దీని ప్రకారం వంటగ్యాస్‌పైనే పేద కుటుంబం రూ.8,600 ఖర్చు చేయాలి. అంటే ఒక్కో    సిలిండర్‌పై రూ.561 చొప్పున ఏడాదిలో రూ.4,488 అదనపు భారం మోయాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని