‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌’కు కానరాని స్పందన!

మధ్య ఆదాయ వర్గాల(ఎంఐజీ) వారి కోసం విశాఖలో ఏర్పాటు చేయనున్న ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌’ లేఅవుట్లకు ప్రజల నుంచి స్పందన కనిపించడం లేదు. రెండు సార్లు గడువు

Updated : 18 Jul 2022 08:49 IST

‘విశాఖ’లో ముందుకురాని ప్రజలు

అధిక ధర, గతానుభవాలే కారణమా?

ఈనాడు, విశాఖపట్నం: మధ్య ఆదాయ వర్గాల(ఎంఐజీ) వారి కోసం విశాఖలో ఏర్పాటు చేయనున్న ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌’ లేఅవుట్లకు ప్రజల నుంచి స్పందన కనిపించడం లేదు. రెండు సార్లు గడువు పెంచినా దరఖాస్తులు ఆశించినంతగా రాలేదు. చివరకు...గడువు లేకుండానే ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయినా.. ఎవరూ ముందుకు రావడం లేదు. లేఅవుట్ల ప్రతిపాదన సమయంలో ప్రభుత్వం డిమాండు సర్వే చేస్తే.. నగర పరిధిలోనే సుమారు 50 వేల మంది కొనుగోలుకు ఆసక్తి చూపారు. అదే అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లోని విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పరిధిలో అదనంగా మరో 20 వేల మంది సర్వేలో పాల్గొన్నారు. తీరా.. ప్రాజెక్టును పట్టాలెక్కిస్తుంటే మాత్రం చాలా మంది దరఖాస్తే చేసుకోవడం లేదు. ప్రజలు ముందుకు రాకపోవటానికి గత ప్రాజెక్టులేనని కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. దాదాపు పదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మధ్య ఆదాయ వర్గాలకు రెండు, మూడు గదుల ఫ్లాట్ల నిర్మాణానికి విశాఖలోని ఎండాడలో ‘ఆద్రజ’ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. దరఖాస్తులు ఆహ్వానించి, ముందస్తుగా సొమ్ములూ వసూలు చేసింది. చాలా మంది డబ్బులు చెల్లించినా ప్రాజెక్టు ముందుకు సాగలేదు. దీంతో ఆ డబ్బులు వెనక్కిచ్చేస్తున్నారు. ఇప్పుడు అదే స్థలాన్ని ప్లాట్లుగా విభజించి విక్రయానికి పెట్టారు. అయిదేళ్ల కిందట వీఎంఆర్‌డీఏ ఓ ప్రైవేటు భాగస్వామితో వేసిన లేఅవుట్‌లో అల్పాదాయ వర్గాలకు ప్లాట్లు కేటాయించగా చాలా మంది దరఖాస్తు చేశారు. అక్కడ ప్రభుత్వ మార్కెట్‌ విలువ కన్నా తక్కువ ధర నిర్ణయించడంతో సాంకేతిక సమస్య వల్ల నేటికీ ఎవరికీ ప్లాట్లు ఇవ్వలేదు. ఇప్పటికీ సమస్య అలాగే ఉండిపోయింది. ఈ కారణాలతోపాటు ప్రస్తుత ప్లాట్ల ధర అధికంగా నిర్ణయించారు.

ధర చూసి బెంబేలు
విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో 370 ఎకరాల్లో 150, 200, 240 గజాల్లో 2,310 ప్లాట్లతో 4 లేఅవుట్లు ప్రతిపాదించారు. భూమిని సమీకరించారు. అభివృద్ధికి టెండర్లు పిలవాల్సినప్పటికీ ఆలస్యం అవుతోంది. సాధారణ, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసేందుకు వీలుగా ధర ఉంటుందని తొలి సర్వేలో ఎక్కువ మంది ఆసక్తి చూపారు. లేఅవుట్లను ప్రతిపాదించిన తరువాత పాలవలసలో గజం ధర రూ.18 వేలు, మిగిలిన చోట రూ.14 వేలుగా నిర్ణయించారు. ప్రైవేటు లేఅవుట్లలోనూ సుమారు ఇంతే ధర ఉండడం గమనార్హం. అయినప్పటికీ జాతీయ రహదారికి పక్కనే ఉందని పాలవలస లేఅవుట్‌కు 170 దరఖాస్తులు వచ్చాయి. వీఎంఆర్‌డీఏ నాలుగు లేఅవుట్లకు 310 దరఖాస్తులు వస్తే... నిబంధనల ప్రకారం మొత్తం ధరలో 10 శాతం చెల్లించింది కేవలం 70 మందే. ఉద్యోగులకు కేటాయించిన 10 శాతం ప్లాట్ల కొనుగోలుకూ పెద్దగా స్పందన లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని