Corona Virus: ఏపీలో కొవిడ్‌ మృతులు 47,228

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కారణంగా 47,228 మంది చనిపోయినట్లు తేలింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర విపత్తు సహాయనిధి ద్వారా చెల్లించిన పరిహారం లెక్కల ద్వారా ఇది

Updated : 30 Jul 2022 03:33 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినదానికంటే 220% అధికం

దేశవ్యాప్తంగా 7,91,353 మంది కన్నుమూత

లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కారణంగా 47,228 మంది చనిపోయినట్లు తేలింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర విపత్తు సహాయనిధి ద్వారా చెల్లించిన పరిహారం లెక్కల ద్వారా ఇది వెల్లడైంది. రాష్ట్రంలో అధికారికంగా ప్రకటించిన 14,733 మరణాలతో పోలిస్తే ఈ సంఖ్య 220% అధికం. తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు శుక్రవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడించింది. కొవిడ్‌ కారణంగా మరణించిన వారి కుటుంబాల నుంచి నష్టపరిహారం కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంత మందికి చెల్లించారు? ఎన్ని తిరస్కరించారు? అని ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ‘‘వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ ఏడాది మే 27 నాటికి 7,91,353 దరఖాస్తులను పరిష్కరించి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జులై 26న రాసిన లేఖ ప్రకారం పరిహారం కోసం 50,399 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 47,228 క్లెయిమ్స్‌ను ఆమోదించి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున చెల్లించారు. 3,171 దరఖాస్తులను తిరస్కరించారు’’ అని మంత్రి వెల్లడించారు.

దేశవ్యాప్తంగానూ 50% అధిక మరణాలు: దేశవ్యాప్తంగా కొవిడ్‌తో మరణించిన కుటుంబాలకు చెల్లించిన పరిహారాన్ని బట్టి చూస్తే ప్రభుత్వాలు ప్రకటించిన దానికంటే 50% మంది అధికంగానే చనిపోయినట్లు తెలుస్తోంది. శుక్రవారం నాటి కేంద్ర లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనాతో 5,26,258 మంది చనిపోయారు.  కేంద్ర మంత్రి చెప్పిన సమాధానం ప్రకారం మరణించిన 7,91,353 మంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించారు. ఇది అధికారిక లెక్కల కంటే 2,65,095 అధికం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని