Electricity Amendment act: రాష్ట్రాల అధికారాలకు షాక్‌!

ఒక ప్రాంతంలో ప్రస్తుతం ఒక డిస్కం కరెంటు కనెక్షన్లు ఇచ్చి పంపిణీ చేస్తుండగా అదే ప్రాంతంలో మరో సంస్థ ముందుకొస్తే లైసెన్సు ఇచ్చి అనుమతించాలి. సరఫరా కోసం అప్పటికే అక్కడ ఉన్న పాత డిస్కంకు చెందిన విద్యుత్‌ లైన్ల వ్యవస్థలను కొత్త

Updated : 06 Aug 2022 05:07 IST

త్వరలో విద్యుత్‌ పంపిణీ రంగంలోకి ప్రైవేటు డిస్కంలు
ఒకే ప్రాంతంలో అనేక సంస్థలకు లైసెన్సు ఇచ్చే అవకాశం
కరెంటు ఛార్జీల గరిష్ఠ, కనిష్ఠ ధర నిర్ణయ అధికారం ఆ రాష్ట్ర ఈఆర్‌సీకి
విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు సిద్ధం చేసిన కేంద్రం
ఈనాడు - హైదరాబాద్‌

క ప్రాంతంలో ప్రస్తుతం ఒక డిస్కం కరెంటు కనెక్షన్లు ఇచ్చి పంపిణీ చేస్తుండగా అదే ప్రాంతంలో మరో సంస్థ ముందుకొస్తే లైసెన్సు ఇచ్చి అనుమతించాలి. సరఫరా కోసం అప్పటికే అక్కడ ఉన్న పాత డిస్కంకు చెందిన విద్యుత్‌ లైన్ల వ్యవస్థలను కొత్త కంపెనీలు విద్యుత్‌ పంపిణీ ఛార్జీలు చెల్లించి వాడుకోవచ్చు. ఈ ఛార్జీ ఎంత అనేది ఈఆర్‌సీ నిర్ణయించాలి.

విద్యుత్‌ పంపిణీ రంగంలో పోటీ వాతావరణం సృష్టించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఇంత కాలం ఈ రంగంపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలకు కత్తెర వేస్తూ విద్యుత్‌ చట్టాన్ని సవరిస్తోంది. దేశంలో ఎక్కడైనా విద్యుత్‌ పంపిణీ రంగంలోకి ప్రైవేటు సంస్థలు రావొచ్చు. అలా వస్తే... ప్రస్తుతం మొబైల్‌ వినియోగదారులు ఏ మాదిరైతే బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో, ఎయిర్‌టెల్‌.. ఇలా తమకు ఇష్టం వచ్చిన నెట్‌వర్క్‌ను ఎంచుకుంటున్నారో విద్యుత్‌ కనెక్షన్ల విషయంలోనూ నచ్చిన సంస్థ నుంచి కరెంటు పొందవచ్చు అన్నది తాజా విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు సారాంశం. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలో పెనుమార్పులు తెచ్చేందుకు దీనిని కేంద్రం సిద్ధం చేసింది. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విద్యుత్‌ శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే విద్యుత్‌ సంరక్షణ బిల్లును పార్లమెంటులో పెట్టింది.

ఈ రెండు బిల్లుల్లో ముఖ్యాంశాలు...

ఒకే ప్రాంతంలో పలు కంపెనీలు కరెంటు సరఫరా చేసేటప్పుడు వ్యాపారపరంగా పోటీ ఏర్పడి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం లేదా తగ్గించడం వంటి చర్యలకు పాల్పడకుండా ‘ఛార్జీ గరిష్ఠంగా ఎంత ఉండాలి, కనిష్ఠంగా ఎంత ఉండాలనే’ సీలింగ్‌ నిబంధనలను ఈఆర్‌సీ రూపొందించాలి.

ఒక వినియోగదారు ఒక మెగావాట్‌కన్నా ఎక్కువ కరెంటు వినియోగిస్తుంటే ఆ వ్యక్తి దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్‌ కొని తీసుకోవచ్చు. ఇలా బహిరంగ మార్కెట్‌లో కొనడాన్ని ‘ఓపెన్‌ యాక్సిస్‌’ అని పిలుస్తారు. సరఫరా చేయడానికి స్థానిక డిస్కంలు కచ్చితంగా సహకరించాలి.

ఒకే ప్రాంతంలో పలు కంపెనీలకు విద్యుత్‌ పంపిణీ లైసెన్సులిస్తే వాటి కోసం ‘క్రాస్‌ సబ్సిడీ నిధి’ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేయాలి.

ఇప్పటికే పాత డిస్కంలు విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)లతో దీర్ఘకాలిక ‘విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) చేసుకుని కరెంటు కొని ప్రజలకు సరఫరా చేస్తున్నాయి. అవి పంపిణీ చేసే ప్రాంతంలోనే కొత్త కంపెనీలకు విద్యుత్‌ పంపిణీ వ్యాపారానికి లైసెన్సులిస్తే...పాత డిస్కంకు పీపీఏలో నిర్దేశించిన ఖర్చులను కొత్త కంపెనీలు కూడా పంచుకోవాలి. ఈ పంపకాలు ఎలా ఉండాలనేది ఈఆర్‌సీ నిర్ణయించాలి.

ముందస్తుగా డిపాజిట్‌ సొమ్ము చెల్లించకుండా డిస్కంలు కోరినంత విద్యుత్‌ను ‘జాతీయ లోడ్‌ డిస్పాచ్‌ కేంద్రం’(ఎన్‌ఎల్‌డీసీ) సరఫరా చేయకూడదు.

దేశమంతా పక్కాగా విద్యుత్‌ సరఫరా జరిగేలా చూసే పూర్తి అధికారం ఎన్‌ఎల్‌డీసీకే ఉంటుంది. దేశంలో ప్రతి సబ్‌స్టేషన్‌, విద్యుదుత్పత్తి కేంద్రం, పంపిణీ సంస్థ వంటివన్నీ ఈ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందే.

కొత్త ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఛార్జీలు తగ్గించాలన్నా, పెంచాలన్నా  సంబంధిత టారీఫ్‌ సవరణ ప్రతిపాదనలను నిర్ణీత గడువులోగా డిస్కంలు ఈఆర్‌సీకి అందజేయాలి. వాటిపై 90 రోజుల్లోగా విచారణ జరిపి తుది ఆదేశాలివ్వాలి. ఇంతకాలం ఈ విచారణ గడువు 120 రోజులుండగా 90కి తగ్గించాలని బిల్లులో ప్రతిపాదించారు.

కాలుష్యం తగ్గించాలనే లక్ష్యంతో సౌర, పవన, జలవిద్యుత్‌ వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ ఇంధనాన్ని తప్పనిసరిగా డిస్కంలు నిర్ణీత శాతం కొనాలి. అలా కొనని డిస్కంలకు ఈఆర్‌సీ యూనిట్‌కు 35 నుంచి 50 పైసల చొప్పున జరిమానా వేసి వసూలుచేయాలి.

కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హోదాలో పనిచేసినవారిని లేదా దేశంలో ఏదైనా ఒక విద్యుత్‌ సంస్థ ఛైర్మన్‌గా పనిచేసినవారినే నియమించాలి. సభ్యులలో ఒకరు విద్యుత్‌ ఇంజినీరింగ్‌ రంగం నుంచి,  మరొకరు ఆర్థిక రంగం నుంచి ఉండాలి. మూడో సభ్యుడు ప్రభుత్వ విధానాలపై అనుభవం ఉన్నవారై ఉండాలి.

రాష్ట్ర ఈఆర్‌సీలో ఛైర్మన్‌ కాక మరో ముగ్గురు సభ్యులుండాలి. ఇందులో ఖాళీలున్నా రాష్ట్ర ప్రభుత్వం భర్తీచేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి.. రాష్ట్ర మండలి విధులను మరో రాష్ట్ర కమిషన్‌కు కేటాయించాలి లేదా సంయుక్త కమిషన్‌ను ఏర్పాటుచేసి పనిచేసేలా చూడాలి.

రాష్ట్ర ఈఆర్‌సీ ఛైర్మన్‌గా ఏదైనా విద్యుత్‌ సంస్థ ఛైర్మన్‌గా పనిచేసినవారిని గానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి హోదాలో పనిచేసిన వారిని గానీ నియమించాలి. ఆ వ్యక్తికి కనీసం రెండేళ్ల పాటు విద్యుత్‌ రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని