CJI: ప్రపంచీకరణతో స్థానిక సంస్కృతులకు ముప్పు

‘‘2021 యునెస్కో ప్రపంచ భాషల నివేదిక ప్రకారం ఈ శతాబ్దం చివరినాటికి ప్రస్తుతం మనం మాట్లాడుతున్న దాదాపు 7 వేల భాషలు అంతరించిపోనున్నాయి. మనం కోల్పోయే ప్రతి భాషతో కేవలం సాహిత్యం, జానపదాలనే కాదు..

Updated : 06 Aug 2022 06:21 IST

చేతివృత్తులు, కళాకారుల  మనుగడపై ప్రభావం
భాషలను కోల్పోవడమంటే తరాల విజ్ఞానాన్ని  పోగొట్టుకోవడమే
ఓయూ స్నాతకోత్సవంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ
వర్సిటీ గౌరవ డాక్టరేట్‌  ప్రదానం


విద్యార్థులకు ప్రాథమిక న్యాయ సూత్రాలపై అవగాహన  అవసరం. ప్రతి పౌరుడు రాజ్యాంగంతో అనుసంధానమై  ఉండాలి. బ్రాంచీలతో సంబంధం లేకుండా విద్యార్థులు  అందరికీ ప్రాథమిక రాజ్యాంగ సూత్రాలు, పరిపాలనపై   ఒక సబ్జెక్టును అన్ని విద్యాసంస్థలూ ప్రవేశపెట్టాలి. రాజ్యాంగంలోని ఆలోచనలను ప్రతి ఒక్కరికీ తెలిసేలా చూడాలి. పౌరుల భాగస్వామ్యంతోనే రాజ్యాంగస్ఫూర్తి పరిఢవిల్లుతుంది.


ఆహారం, భాష, వస్త్రధారణ, ఆటలు, పండుగలు మన మూలాలతో ముడిపడినవి. సమాజంలో అందర్నీ ఏకతాటిపై నిలిపేవి. మూలాలను, కన్న ఊరును, సమాజాన్ని మరిచిపోకూడదు. సాహిత్యం, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి.

- జస్టిస్‌ ఎన్‌.వి. రమణ


ఈనాడు, హైదరాబాద్‌: ‘‘2021 యునెస్కో ప్రపంచ భాషల నివేదిక ప్రకారం ఈ శతాబ్దం చివరినాటికి ప్రస్తుతం మనం మాట్లాడుతున్న దాదాపు 7 వేల భాషలు అంతరించిపోనున్నాయి. మనం కోల్పోయే ప్రతి భాషతో కేవలం సాహిత్యం, జానపదాలనే కాదు.. తరతరాలుగా వచ్చిన విజ్ఞానాన్ని కోల్పోతాం’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అన్నారు. శుక్రవారం జరిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయ 82వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. న్యాయ వ్యవస్థలో విశేష కృషి చేసినందుకుగాను ఓయూ నుంచి ఆయనకు గౌరవ డాక్టరేట్‌ (డాక్టర్‌ ఆఫ్‌ లాస్‌) అందించారు. వర్సిటీ కులపతి, గవర్నర్‌ తమిళిసై ప్రదానం చేశారు. సుప్రీంకోర్టుకు ఆయన 48వ ప్రధాన న్యాయమూర్తి కాగా.. ఓయూ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకుంటున్న 48వ వ్యక్తి అని ఓయూ ఉపకులపతి ప్రొ. డి.రవీందర్‌ వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి. రమణ మాట్లాడుతూ ప్రపంచీకరణ, శాస్త్రసాంకేతిక రంగాల అభివృద్ధితో ప్రపంచ సంస్కృతి వైపు వేగంగా అడుగులు వేస్తున్నామని, ఇది స్థానిక సంస్కృతులకు ముప్పుగా మారిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్కృతుల స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

దెబ్బతింటున్న పర్యావరణ సమతుల్యత

ప్రపంచీకరణతో వివిధ రకాల పంటలు, వన్యప్రాణులు, కొన్నిరకాల జీవులు వేగంగా అంతరించిపోతున్నాయని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం సైతం వన్య ప్రాణులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటన్నింటి కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని అందరం గుర్తుంచుకోవాలి. ప్రపంచీకరణ కారణంగా స్థానిక చేతివృత్తులు, కళాకారులపై ప్రభావం పడుతోంది. వివిధ రకాల డిజైన్లు, ఉత్పత్తులతో కూడిన గ్లోబల్‌ బ్రాండ్లు మన మార్కెట్లను వరదలా ముంచెత్తుతుండటంతో స్థానిక కళాకారులు తమ జీవనోపాధి కోల్పోతున్నారు. తీవ్రమైన పోటీని ఎదుర్కొంటూ మనుగడ కోసం పోరాడుతున్నారు. ప్రపంచీకరణను నేనేమీ విమర్శించడం లేదు. ప్రపంచీకరణతో మనం ఎన్నో చెప్పుకోదగ్గ విజయాలు సాధించినా.. వనరులు, ఆర్థిక అంశాలలో మన సమాజాలు విభజనకు గురయ్యాయి. వివిధ వర్గాల మధ్య పెరుగుతున్న అసమానతలను రూపుమాపేందుకు దృష్టి పెట్టాలి. అన్ని వర్గాలకు మేలు చేకూరేలా సమాన, సుస్థిరమైన ప్రపంచీకరణ విధానం అవసరం.  

పీవీ, కేసీఆర్‌ వంటి ప్రముఖులెందరో ఓయూ నుంచి వచ్చినవారే

నిజాం హయాంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపనతో ఉన్నత విద్యలో కొత్త శకం ప్రారంభమైంది. ఉన్నత విద్యలో స్థానిక భాషలకు ప్రాధాన్యం పెరిగింది. వర్సిటీలో చదివిన పీవీ నరసింహారావు వంటి ప్రముఖులెందరో ప్రజా ప్రతినిధులుగా పనిచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం ఇక్కడే చదివారు. ఆధునిక భారతావని నిర్మాణంలో ఓయూ కీలకపాత్ర పోషించింది.  

ఓయూలో చేరాలనుకున్నా..

నేను చదువుకునే రోజుల్లో ఉస్మానియా వర్సిటీలో చేరాలని ఆశయంగా పెట్టుకున్నా. విద్యార్థిగా చేరలేకపోయినా.. చాలా సందర్భాల్లో నా స్నేహితులలో కలిసి ‘ఇ’ హాస్టల్‌లో ఉన్నా. న్యాయశాస్త్రం, లింగ్విస్టిక్స్‌లో పలుమార్లు తరగతులకు హాజరయ్యా. ఇక్కడి క్యాంటీన్‌, గ్రంథాలయంలో గడిపిన క్షణాలు ఎన్నో గుర్తుకొస్తున్నాయి. గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం సమాజంపై నా బాధ్యతను మరింత పెంచింది. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సి.రాజగోపాలాచారి, జవహర్‌లాల్‌ నెహ్రూ, రాజేంద్రప్రసాద్‌, ఎస్‌.రాధాకృష్ణన్‌, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సహా మరో 42 మంది ప్రముఖుల సరసన చేరడానికి నేను తగనేమో అనే భావన కలుగుతోంది. ఇది ఒక్కింత ఆందోళనకరంగానూ అనిపిస్తోంది’’ అని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అన్నారు. విద్యార్థులు పట్టభద్రులు అయ్యారంటే తమ చదువులు ముగిసినట్లుగా భావించరాదని, ఇప్పుడే నేర్చుకోవడం మొదలైందనుకోవాలని సూచించారు. జీవితంలో ఎదురయ్యే అనుభవాల నుంచి ఎన్నో నేర్చుకుంటామని చెప్పారు. గవర్నర్‌ తమిళిసై స్వతహాగా డాక్టర్‌ కావడంతో విద్యాసంస్థల్లో ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించగలరనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య, జస్టిస్‌ ఎన్‌.వి. రమణ కుటుంబ సభ్యులు, ఓయూ ఉపకులపతి ప్రొ.డి.రవీందర్‌, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. 31 మంది విద్యార్థులు బంగారు పతకాలు, 260 మంది పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు.


పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోండి
గవర్నరు తమిళి సై

‘‘అసాధ్యమైనా సరే లక్ష్యాలు పెద్దగా నిర్దేశించుకోండి... వాటిని సాధించడానికి పట్టువదలకుండా కష్టపడండి...విజయాలకు కృషి తప్ప అడ్డదారుల్లేవని గుర్తించండి’’ అని గవర్నరు తమిళి సై విద్యార్థులకు సూచించారు. ప్రతి చిన్న విషయానికీ కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలన్నారు. ఉస్మానియా స్నాతకోత్సవం సందర్భంగా ఛాన్సలర్‌ హోదాలో గవర్నరు తమిళిసై విద్యార్థులనుద్దేశించి ఆద్యంతం ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. సవాళ్లు ఎదురైనపుడు కుంగిపోకుండా ఎదుర్కోవాలని ఎదిగిన నేతలను చూసి వారి నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఉద్బోధించారు. కార్యక్రమాన్ని సాయంత్రానికి వాయిదా వేయాలని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కోరడంతో తాను వరలక్ష్మి వ్రతం చేసుకోగలిగానని చెప్పారు. ‘‘అత్యున్నత స్థాయికి వెళ్లిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.. కార్యక్రమం వాయిదా గురించి అడిగిన తీరు ఆయన గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి సాయంత్రం వస్తానని చెప్పవచ్చు. అలాకాకుండా సాయంత్రానికి మీకు వీలవుతుందా అని అడిగారు’’ అని ఆమె తెలిపారు. నేను తమిళిసైనే కాని ఇప్పుడు తెలుగుసైని అన్నారు. దేశమంటే మట్టికాదోయ్‌...దేశమంటే మనుషులోయ్‌  అంటూ ప్రసంగాన్ని ముగించారు.

జస్టిస్‌ రమణ వల్లే హైకోర్టులో మహిళా న్యాయమూర్తులకు ప్రాధాన్యం: జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కారణంగా హైకోర్టులో ఎక్కువ మంది మహిళా న్యాయమూర్తుల నియామకం జరిగిందంటూ హైకోర్టు మహిళా న్యాయమూర్తులు గవర్నరు తమిళిసై కి తెలిపారు. స్నాతకోత్సవం తరువాత గవర్నరు.. జస్టిస్‌ రమణ దంపతులు, కుటుంబ సభ్యులతోపాటు హైకోర్టు న్యాయమూర్తులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు ఈ వాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని