Updated : 06 Aug 2022 08:45 IST

Ap HighCourt: ఏకవాక్యంలో మూడుసార్లు తలాక్‌ చెల్లదు

తలాక్‌నామా రాసుకున్నా చెల్లుబాటు కాదు

భర్త నుంచి భరణం పొందేందుకు పిటిషనర్‌ అర్హురాలే

హైకోర్టు కీలక తీర్పు

ఈనాడు, అమరావతి: ఇస్లాం చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఏకవాక్యంలో మూడుసార్లు నోటిమాటగా తలాక్‌ చెప్పడానికి వీల్లేనప్పుడు.. దాన్ని తలాక్‌నామా రూపంలో రాసుకున్నా కూడా చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. అలాంటి తలాక్‌నామాతో వివాహం రద్దయినట్లు కాదని స్పష్టం చేసింది. ఇస్లాం చట్ట నిబంధనల ప్రకారం భార్యాభర్తలు ఇద్దరి తరఫున మధ్యవర్తులు సయోధ్య కుదిర్చేందుకు యత్నించాలంది. అది సాధ్యపడనప్పుడు సహేతుకమైన కారణాలతో వేర్వేరు సమయాల్లో మూడు తలాక్‌లు చెప్పాల్సి ఉంటుందని, ఆ మూడు సందర్భాల్లో అవసరమైన సమయం (టైమ్‌ గ్యాప్‌) ఉండాలని స్పష్టం చేసింది. తలాక్‌ చెప్పిన విషయాన్ని భర్త... భార్యకు తెలియపరచాలంది. ఒకేసారి మూడు తలాక్‌లు చెప్పి వివాహం రద్దయిందనడం రాజ్యాంగ విరుద్ధమని ‘షయారా బానో’ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని గుర్తు చేసింది. ప్రస్తుత కేసులో తలాక్‌నామాను రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపగా భార్య తిరస్కరించారని భర్త చెప్పడం తప్ప.. మరే ఇతర సాక్ష్యాలను చూపలేదని పేర్కొంది. ఏకవాక్యంలో మూడుసార్లు తలాక్‌ చెప్పి.. రాతపూర్వకంగా పంపడం చెల్లదని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె భార్యగానే కొనసాగుతున్నట్లని, భర్త నుంచి వేరుగా ఉంటున్నందున భరణం పొందేందుకు అర్హురాలేనని స్పష్టం చేసింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ సైతం సీఆర్‌పీసీ సెక్షన్‌ 125 ప్రకారం.. ఆమె జీవితాంతం (మళ్లీ వివాహం చేసుకోనంత వరకు) భర్త నుంచి జీవన భృతి/భరణం పొందేందుకు అర్హురాలేనని పేర్కొంది. సముచిత జీవన భృతిని మంజూరు చేస్తే ఆమె హుందాగా జీవించగలుగుతారని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ ఇటీవల ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు.

ఇదీ నేపథ్యం
భర్త నుంచి జీవనభృతిగా రూ.2 వేలు ఇప్పించాలంటూ పి.గౌస్‌బీ 2004లో పొన్నూరులో కోర్టును ఆశ్రయించారు. 2002 జులై 30న రిజిస్టర్‌ పోస్టు ద్వారా తలాక్‌నామా పంపించానని, గౌస్‌బీ దాన్ని తిరస్కరించినందున జీవనభృతికి అనర్హురాలంటూ ఆమె భర్త జాన్‌ సైదా కోర్టుకు విన్నవించారు. ఆ వాదనలను తోసిపుచ్చిన పొన్నూరు జ్యుడిషియల్‌ మొదటి తరగతి మెజిస్ట్రేట్‌ కోర్టు.. పిటిషనర్‌కు, ఆమె కుమారుడికి నెలకు రూ.800 చొప్పున భరణం చెల్లించాలని ఆదేశించింది. దానిపై జాన్‌ సైదా గుంటూరులోని మొదటి అదనపు సెషన్స్‌ కోర్టులో అప్పీలు చేశారు. గుంటూరు కోర్టు కుమారుడికి జీవనభృతి ఖర్చులను సమర్థించింది. భార్యకు భృతి ఇవ్వాలన్న ఆదేశాలను రద్దు చేసింది. దీనిపై 2006 అక్టోబర్‌లో గౌస్‌బీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి.. ఇస్లాం చట్టప్రకారం ఒకే సందర్భంలో ఒకేవాక్యంగా మూడుసార్లు తలాక్‌ చెప్పి వివాహం రద్దు చేసుకోవడం చెల్లదన్నారు. తలాక్‌ చెప్పడానికి సహేతుకమైన కారణం ఉండాలన్నారు. వేర్వేరు సందర్భాల్లో మూడుసార్లు తలాక్‌ చెప్పారనడానికి రాతపూర్వక సాక్ష్యాధారాలుండాలన్నారు. పోస్టు ద్వారా పంపిన తలాక్‌నామా తనకు అందనేలేదని, దాన్ని తిరస్కరించలేదని భార్య చెబుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో తలాక్‌ చెల్లదన్నారు. గుంటూరు కోర్టు తీర్పును రద్దు చేస్తూ.. పొన్నూరు కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. ఆ తీర్పిచ్చి 16 ఏళ్లవుతున్న నేపథ్యంలో న్యాయస్థానాన్ని తాజాగా ఆశ్రయించి జీవనభృతిని పెంచాలని కోరే స్వేచ్ఛను భార్యకే వదిలేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని