క్లాప్‌.. అవుతోంది ఫ్లాప్‌!

సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. సంస్కరణల అమలుకు మొదట అంగీకరించిన

Updated : 06 Aug 2022 05:54 IST

అధికార పార్టీలో సంస్కరణల వణుకు

ఈనాడు, అమరావతి: సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. సంస్కరణల అమలుకు మొదట అంగీకరించిన ప్రజాప్రతినిధులే.. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత చూసి.. ఇప్పుడు ససేమిరా అంటున్నారు. నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలుకు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) పేరుతో సంస్కరణలు ప్రారంభించారు. దీన్ని సీఎం సొంత జిల్లాలోనూ ఎమ్మెల్యేల, కార్పొరేటర్లు వ్యతిరేకించారు. పలు ఇతర జిల్లాల్లోనూ ప్రజలు చెత్త పన్ను చెల్లించడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్వచ్ఛభారత్‌ మిషన్‌ (ఎస్‌బీఎం), 15వ ఆర్థిక సంఘం, అమృత్‌, స్మార్ట్‌ సిటీ పథకాలకు కేంద్రం నుంచి నిధులు విడుదల చేయాలంటే.. చెత్త సేకరణపై వినియోగ రుసుములు వసూలు చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలనూ ఆదేశించింది. మిగతా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ఒకటి, రెండు నగరాలు, పట్టణాలకే పరిమితం చేశారు. రాష్ట్రంలో మాత్రం 42 నగరాలు, పట్టణాల్లో క్లాప్‌ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. దీనిపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలోని పలు పుర, నగరపాలక సంస్థల్లో 3-4 నెలల క్రితం క్లాప్‌ ప్రారంభమైంది. అన్నిచోట్లా ఇలాగే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

తప్పని పరిస్థితి 

చెత్తపన్ను వసూళ్లను అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, చాలామంది మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వ్యతిరేకిస్తున్నారు. కానీ పన్ను వసూళ్లు నిలిపివేయాలని బయటకొచ్చి చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. అధికారపార్టీలో ఉండి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడటం ఎలాగని భయపడుతున్నారు. క్లాప్‌ అమలు కోసం పాలకవర్గ సర్వసభ్య సమావేశాల్లో తీర్మానం చేసేటపుడూ ఇష్టం లేకపోయినా తీర్మానం పుస్తకాల్లో సంతకాలు చేశామని విజయవాడ వైకాపా కార్పొరేటర్‌ ఒకరు తెలిపారు. ఇప్పటికే ఆస్తి పన్ను పెరిగిందని, మళ్లీ ఇదేం అదనపు భారమని ప్రజలు గట్టిగా ప్రశ్నిస్తున్నారని విశాఖ కార్పొరేటర్‌ అన్నారు. చెత్తపన్ను వసూళ్లు నిలిపివేయకపోతే ప్రజల్లోకి వెళ్లడం కష్టమేనని కడప నగరపాలక సంస్థకు చెందిన వైకాపా కార్పొరేటర్‌ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల సొమ్ము ఆటోల పాలు 

పుర, నగరపాలక సంస్థల్లో దశలవారీగా ప్రతి ఇంటినుంచి తడి, పొడి చెత్తసేకరణకు 2021 అక్టోబరు 2న క్లాప్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకోసం 2,164 ఆటోల్లో 4,328 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కో వాహనానికి పన్నులతో కలిపి నెలకు రూ.62 వేలు చెల్లిస్తున్నారు. చెత్త సేకరణపై ప్రజల నుంచి వసూలుచేసే మొత్తంతో వాహనాలకు అద్దె చెల్లించాలన్నది ఒప్పందం. కానీ, చెత్తపన్ను సేకరణ లక్ష్యంలో నెలకు 50% మించి ప్రస్తుతం వసూలు కావడం లేదు. విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ, కర్నూలు, ఒంగోలులోనూ రుసుముల వసూళ్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. దీంతో అద్దె చెల్లించడం ఎలాగని తలపట్టుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు