తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే డివిజన్లలో 14,699 పోస్టుల ఖాళీ

దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్ల పరిధిలోకి వచ్చే తెలుగు రాష్ట్రాల్లోని ఆరు రైల్వే డివిజన్లలో 14,699 గ్రూప్‌-సి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

Published : 06 Aug 2022 08:04 IST

ఈనాడు, దిల్లీ: దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్ల పరిధిలోకి వచ్చే తెలుగు రాష్ట్రాల్లోని ఆరు రైల్వే డివిజన్లలో 14,699 గ్రూప్‌-సి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో 1,916 గెజిటెడ్‌ పోస్టులు, 2,95,684 నాన్‌గెజిటెడ్‌ గ్రూప్‌-సి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇందులో దక్షిణ మధ్య రైల్వేలో గెజిటెడ్‌ 33, నాన్‌గెజిటెడ్‌ 16,651 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. డివిజన్ల వారీగా చూస్తే వాల్తేర్‌లో 3,242, సికింద్రాబాద్‌లో 3,048, హైదరాబాద్‌లో 1,323, గుంతకల్లులో 2,746, విజయవాడలో 3,524, గుంటూరులో 816 గ్రూప్‌-సి పోస్టులు ఖాళీ ఉన్నట్లు వివరించారు.

ఫ్రైట్ కారిడార్లను మంజూరు చేయలేదు.. సర్వే ప్రారంభం 

రైల్వేశాఖ విజయవాడ మీదుగా సాగే రెండు ఫ్రైట్‌ కారిడార్లపై సర్వే, డీపీఆర్‌ తయారీ పనులు మొదలుపెట్టినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఖరగ్‌పుర్‌-విజయవాడ(1,115 కేఎం) మధ్య ఈస్ట్‌కోస్ట్‌ కారిడార్‌, విజయవాడ-ఇటార్సీ(975 కిమీ) మధ్య ఉత్తర-దక్షిణ ఉపకారిడార్‌లపై ప్రస్తుతం సర్వే, డీపీఆర్‌ తయారీ పనులు సాగుతున్నట్లు చెప్పారు. అయితే ఈ రెండు ఫ్రైట్‌ కారిడార్లనూ ప్రభుత్వం మంజూరు చేయలేదన్నారు. కొత్త కారిడార్ల మంజూరు నిర్ణయం డీపీఆర్‌లో వెల్లడయ్యే వివరాలు, సాంకేతిక-ఆర్థిక సాధ్యాసాధ్యాలు, ఆర్థిక సుస్థిరత, నిధుల ఏర్పాట్లపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో మూడు నిమ్జ్స్‌కి ఆమోదం 

నేషనల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ పాలసీ కింద తెలుగు రాష్ట్రాల్లో మూడు నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్స్‌ (నిమ్జ్‌)కి ఆమోదం తెలిపినట్లు వాణిజ్యశాఖ సహాయమంత్రి సోంప్రకాశ్‌ తెలిపారు. ఇందులో 2015లో ప్రకాశం జిల్లా, 2016లో సంగారెడ్డి, 2019లో హైదరాబాద్‌ ఫార్మాసిటీ నిమ్జ్‌కి ఆమోదం తెలిపామన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కోసం సంబంధిత మంత్రిత్వశాఖలు, డిపార్ట్‌మెంట్లను సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్లు చెప్పారు.


రెండు దశాబ్దాల్లో త్రివిధ దళాల్లో ఏపీ నుంచి 71 వేల మంది నియామకం

ఈనాడు, దిల్లీ: గత రెండు దశాబ్దాల్లో త్రివిధ దళాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 71,400 మంది నియమితులైనట్లు రక్షణశాఖ సహాయమంత్రి అజయ్‌భట్‌ తెలిపారు. ఆయన శుక్రవారం లోక్‌సభలో తెదేపా సభ్యుడు కె.రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఆర్మీలో నియామకాల కోసం 2014-15 నుంచి 2019-20 మధ్య 6 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 14 ర్యాలీలు నిర్వహించామని, 4,04,901 మంది అభ్యర్థులు పాల్గొన్నారని చెప్పారు. వైమానికదళం కోసం 2018, 2019ల్లో నిర్వహించిన పరీక్షకు 33,999 మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. నౌకాదళంలో సెయిలర్లుగా చేరడానికి 2017, 2018, 2019ల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 1,58,174 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. 1990 నుంచి జరిగిన భారత వాయుసేన విమాన ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. అలాగే నేవీలో ఆరుగురు కన్ను మూసినట్లు వెల్లడించారు. 2022 జూన్‌ 30 నాటికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ సైనికోద్యోగుల సంఖ్య 6,641కి చేరిందని తెలిపారు.  


మంగళగిరి ఎయిమ్స్‌లో నర్సింగ్‌ కాలేజీ

మంగళగిరి ఎయిమ్స్‌లో 2022-23 విద్యా సంవత్సరం నుంచి నర్సింగ్‌ కాలేజీ ప్రారంభానికి చర్యలు తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. ఆమె శుక్రవారం లోక్‌సభలో వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.


ఆయుష్‌ కింద ఏపీకి రూ. 22.85 కోట్లు

నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌ కింద ఆంధ్రప్రదేశ్‌కు గత మూడేళ్లలో కేంద్ర వాటా కింద రూ. 22.85 కోట్లు మంజూరు/విడుదల చేయగా, వాళ్లు రూ. 31.47 లక్షల ఖర్చులు నివేదించారని కేంద్ర ఆయుష్‌ మంత్రి శర్బానంద్‌ సోనోవాల్‌ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో వైకాపా ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని