జమ ఆలస్యమైతే రోజుకు రూ.100 అపరాధ రుసుం

వైఎస్సార్‌ పింఛను కానుక కింద అందజేసే సామాజిక భద్రత పింఛన్లకు సంబంధించి మిగులు నిధుల్ని ప్రభుత్వ ఖాతాకు తిరిగి జమచేయడంలో జాప్యం జరుగుతోందని రాష్ట్ర

Published : 07 Aug 2022 02:09 IST

పింఛను మిగులు మొత్తంపై సెర్ప్‌ ఆదేశాలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైఎస్సార్‌ పింఛను కానుక కింద అందజేసే సామాజిక భద్రత పింఛన్లకు సంబంధించి మిగులు నిధుల్ని ప్రభుత్వ ఖాతాకు తిరిగి జమచేయడంలో జాప్యం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఆలస్యం కాకూడదని ఇదివరకే ఆదేశాలిచ్చినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో పక్కాగా అమలుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో/పురపాలక కమిషనర్లను గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌) ఆదేశించింది. ప్రతి నెలా మొదటి 5 రోజులు వాలంటీర్ల ద్వారా పింఛను మొత్తాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నారు. పంపిణీ పూర్తయిన తర్వాత మిగిలిన మొత్తాన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లోని సంక్షేమ విద్యా కార్యదర్శి/వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులు ప్రభుత్వ ఖాతాకు జమ చేయాల్సి ఉంది. కానీ కొన్ని ప్రాంతాల్లో సకాలంలో జమ చేయడంలేదని ప్రభుత్వం గుర్తించింది. దీంతో పంపిణీ పూర్తయిన తర్వాత 2 రోజుల్లో(బ్యాంకు పనిదినాలు) మిగులు మొత్తాన్ని జమ చేయకపోతే రోజుకు రూ.100 చొప్పున అపరాధ రుసుము వసూలుకు సెర్ప్‌ ఆదేశాలిచ్చింది. 10 రోజులకు మించి ఆలస్యమైతే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జులై నెలలో 60.52 లక్షల మందికి పింఛను మంజూరు చేయగా...60 లక్షల మందికి పంపిణీ చేశారు. ఆగస్టులో 62.80 లక్షల మందికి మంజూరు కాగా శనివారం సాయంత్రానికి 62.22 లక్షల మందికి అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని