Updated : 07 Aug 2022 08:00 IST

Tirumala: బ్రహ్మోత్సవాలకు సర్వదర్శనమే.. తొలిసారి అమలు చేస్తున్న తితిదే

అన్ని ఆర్జిత సేవల రద్దు

ఈనాడు, తిరుపతి: శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో జరగనున్నాయి. దీంతో ఈసారి పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకూ శ్రీవారి దర్శనభాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని తొలిసారిగా బ్రహ్మోత్సవాల సమయంలో రద్దుచేశారు. అందరికీ సర్వదర్శనం మాత్రమే ఉంటుంది.

తిరుమలలో బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో పెరటాసి మాసం ప్రారంభం కానుంది. దీంతో తమిళనాడు నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. రెండేళ్లుగా కొవిడ్‌ కారణంగా బ్రహ్మోత్సవాలను ఆలయం లోపలే నిర్వహించారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ లక్ష మందిపైగా భక్తులు దర్శనానికి వస్తుంటారు. గరుడసేవ రోజున ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుంది. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దుచేస్తుంటారు. దీంతో పాటు వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, శ్రీవాణి ట్రస్టు సేవల భక్తులకు ప్రవేశ దర్శన సౌకర్యాలను నిలిపివేస్తుంటారు. ఈదఫా తితిదే మరింత ముందుకెళ్లింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లనూ నిలిపివేసింది. వీటిని బ్రహ్మోత్సవాల పది రోజులూ రద్దుచేయడంతో సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించినట్లు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. తాము నిర్దేశించుకున్న రోజు రెండు గంటల్లో దర్శనం పూర్తి చేసుకుంటామన్న భరోసాతో భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు తీసుకుంటారు. గంటకు 4వేల నుంచి 4,500 మంది భక్తులకే దర్శనం కల్పించేందుకు ఆస్కారం ఉంది. శ్రీవారికి కచ్చితంగా కొన్ని సేవలు నిర్వహించాలి. ఇందుకోసం రోజుకు ఐదారు గంటలు పడుతుంది. ఏకాంత సేవలను రాత్రి ఒంటిగంటకు ముగించినా, తిరిగి మూడు గంటలకు సుప్రభాతంతో ప్రారంభించాలి. అంటే దర్శన విరామంతోపాటు వివిధ సేవలకు 8 గంటల సమయం పడుతుంది. మిగిలిన 16 గంటల్లోనే ప్రత్యేక ప్రవేశం, సర్వదర్శనం భక్తులకు దర్శనం కల్పించాలంటే ఇబ్బందిగా ఉంటుందని అధికారులు గుర్తించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల జారీని నిలిపివేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా సర్వదర్శనానికి టైమ్‌స్లాట్‌ విధానాన్ని అమల్లోకి తెస్తే బాగుంటుందన్న అభిప్రాయం భక్తులనుంచి వ్యక్తమౌతోంది.


నేడు జరగాల్సిన తితిదే కల్యాణమస్తు వాయిదా!

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే ఆధ్వర్యంలో ఆదివారం జరగాల్సిన కల్యాణమస్తు వాయిదా పడినట్లు సమాచారం. 2011లో ఆగిపోయిన కల్యాణమస్తును తిరిగి 2022లో తితిదే ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద హిందూ కుటుంబాల్లోని యువతీ యువకులకు సంప్రదాయబద్ధంగా వివాహం చేయించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివాహ వేడుకలను నిర్వహించాల్సి ఉంది. అందులో భాగంగా చాంద్రమాన శుభకృత్‌ నామ సంవత్సరం శ్రావణ శుక్లపక్ష దశమి ఆదివారం ఉదయం 8.07 నుంచి 8.17 గంటల మధ్య అనురాధ నక్షత్రం, సింహలగ్నంలో వివాహాలు చేయించాలని పండితులు శుభ ముహూర్తం నిర్ణయించారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో ఇది వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది సామూహిక వివాహాలకు జిల్లా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం. తితిదే ఇప్పటివరకూ అధికారికంగా వాయిదాపై ఎలాంటి ప్రకటనా జారీచేయలేదు. త్వరలోనే మరో ముహూర్తం నిర్ణయించి కల్యాణమస్తును నిర్వహించేందుకు తితిదే సిద్ధమైనట్లు తెలుస్తోంది.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts