PM Modi: ‘అమృత’ కాలం

ప్రజల్లో దేశభక్తిని రగిలించే మహత్తర కార్యక్రమం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవమని ప్రధాని మోదీ తెలిపారు. స్వాతంత్య్ర సమర కాలంలో కనిపించిన దేశభక్తి అపూర్వం. ప్రస్తుత తరంలోనూ

Updated : 07 Aug 2022 06:20 IST

యువతలో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని నింపి దేశ నిర్మాణానికి కర్తవ్యోన్ముఖుల్ని చేయాలి

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జాతీయ కమిటీ భేటీలో ప్రధాని మోదీ

ఈనాడు, దిల్లీ: ప్రజల్లో దేశభక్తిని రగిలించే మహత్తర కార్యక్రమం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవమని ప్రధాని మోదీ తెలిపారు. స్వాతంత్య్ర సమర కాలంలో కనిపించిన దేశభక్తి అపూర్వం. ప్రస్తుత తరంలోనూ మనం అదే ఉత్సాహాన్ని నింపి దాన్ని దేశ నిర్మాణం కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. యువతను దేశ నిర్మాణంలో మమేకం చేయడానికి ఇదే అనువైన సమయమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం దిల్లీలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జాతీయ కమిటీ 3వ సమావేశం జరిగింది. ఇందులో సభ్యులుగా ఉన్న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల అధినేతలు, అధికారులు, మీడియా ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, కళాకారులు, సినీతారలు, క్రీడాప్రముఖులు, విభిన్నరంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. మరికొందరు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా భాగస్వాములయ్యారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకూ నిర్వహించిన కార్యక్రమాలపై సాంస్కృతికశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ కమిటీ తొలి సమావేశం 2021 మార్చి 8న, రెండో సమావేశం 2021 డిసెంబర్‌ 22న జరిగింది.

ఏక్‌ భారత్‌...శ్రేష్ఠ భారత్‌: దేశంలోని ప్రతి పౌరుడి సహకారం వల్లే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం విజయవంతం అయిందని ప్రధాని మోదీ తెలిపారు. యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలన్నారు. ఆజాదీ కా అమృతమహోత్సవం అన్నది ఒక విలువల ఉత్సవం.  దేశానికి ఏదైనా చేయాలన్న బలమైన ఉత్సాహాన్ని అది యువతలో నింపుతుంది. 100వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే నాటికి సాధించాల్సిన లక్ష్యాలను చేరుకోవడానికి వీలుగా వారిని తీర్చిదిద్దుకోవాలి. భవిష్యత్తు సాంకేతిక సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకొనేలా వారిని నైపుణ్యవంతుల్ని చేయాలని చెప్పారు. ‘‘స్థానికంగా గిరిజన సంగ్రహాలయాలు నిర్మించి స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడిన గిరిజన సమరయోధులకు నివాళులర్పించాలి. దేశ సరిహద్దు ప్రజల కష్టసుఖాలను తెలియజెప్పడానికి యువతను గ్రామాలకు తీసుకెళ్లి చూపించాలి. ప్రతి జిల్లాలో 75 జలాశయాలను నిర్మించే కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి నీటి సంరక్షణకు బాటలు వేయాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పేలా ‘ఏక్‌ భారత్‌...శ్రేష్ఠ భారత్‌’ విధానానికి విస్తృత ప్రచారం కల్పించాలి. వచ్చే 25 ఏళ్లలో దేశాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లాలి’’ అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కమిటీ సభ్యుల వద్ద సూచనలు, సలహాలు ఉంటే ఇక ముందు కూడా పంపించాలని కోరారు.  అమృతోత్సవాల్లో భాగంగా ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 60వేలకు పైగా కార్యక్రమాలు నిర్వహించినట్లు హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు.


అప్పుడప్పుడు దిల్లీకి రండి
చంద్రబాబుతో ప్రధాని మోదీ

రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక మందిరంలో జరిగిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం జాతీయ కమిటీ సమావేశం ముగిశాక చంద్రబాబు ప్రధానితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. హాజరైన ప్రముఖులంతా తేనీరు సేవిస్తుండగా, ప్రధాని అందరి వద్దకు వచ్చి పలకరించినట్లు తెలిసింది. చంద్రబాబు దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిసేపు పక్కకు జరిగి ఇద్దరూ 5 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. ‘మీరీ మధ్య దిల్లీకి రావడంలేదు. అప్పుడప్పుడూ వస్తూ ఉండండి’ అని బాబుతో ప్రధాని అన్నట్లు తెదేపా వర్గాలు తెలిపాయి. ఈసారి దిల్లీకొచ్చినప్పుడు ప్రత్యేకంగా కలుస్తానని చంద్రబాబు చెప్పగా, ‘తప్పకుండా రండి. ఇది మీ ఇల్లు అనుకోండి. రావాలనుకున్నప్పుడు ముందుగా మా ఆఫీసుకు చెప్పండి’ అన్నట్లు సమాచారం. చంద్రబాబు కుటుంబసభ్యుల యోగక్షేమాలను అడిగినట్లు తెలిసింది. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, గడ్కరీ తదితరులతోనూ బాబు ప్రత్యేకంగా మాట్లాడారని తెదేపా వర్గాలు చెప్పాయి.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని