మొహర్రం నిర్వహణకు ఇరువర్గాలను వేర్వేరుగా అనుమతించండి

విజయవాడలోని పంజా సెంటర్‌ సమీపంలో మొహర్రం (పీర్ల పండుగ)ను వేర్వేరుగా నిర్వహించుకునేందుకు షేక్‌ జిలానీసైదా, ఎస్కే సులేమాన్‌ వర్గాలకు అనుమతి ఇవ్వాలని విజయవాడ

Published : 07 Aug 2022 05:12 IST

విజయవాడ అధికారులకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: విజయవాడలోని పంజా సెంటర్‌ సమీపంలో మొహర్రం (పీర్ల పండుగ)ను వేర్వేరుగా నిర్వహించుకునేందుకు షేక్‌ జిలానీసైదా, ఎస్కే సులేమాన్‌ వర్గాలకు అనుమతి ఇవ్వాలని విజయవాడ పశ్చిమ డివిజన్‌ అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఏ వర్గం నుంచి ఎంతమందిని అనుమతించాలో ఖరారు చేయాలని సూచించింది. జిలానీసైదా తరఫు వారికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సులేమాన్‌ వర్గానికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతించాలని పేర్కొంది. ఒక వర్గం వారు మొహర్రం జరుపుకొనేటప్పుడు మరో వర్గం వారు ఆ ప్రాంతంలోకి రాకుండా చూడాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించింది. పిటిషనర్లు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని స్పష్టంచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. పంజా సెంటర్‌ సమీపంలో మొహర్రం నిర్వహించుకునే వ్యవహారంపై అనుమతి ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ సులేమాన్‌ మరో ఇద్దరు, జిలానీసైదా హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలుచేశారు. వీటిని విచారించిన న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.

ఆరోగ్య కేంద్రం ఎక్కడ నెలకొల్పాలన్నది ప్రభుత్వ ఇష్టం: హైకోర్టు
సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ విచక్షణాధికారమని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టంచేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు ఇటీవల ఈ మేరకు తీర్పు ఇస్తూ, వ్యాజ్యాన్ని కొట్టేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామంలో ఉన్న సీహెచ్‌సీ స్థానంలో గండేపల్లి మండలం జడ్‌.రాగంపేట గ్రామంలో నిర్మించతలపెట్టిన సీహెచ్‌సీని అడ్డుకోవాలని కోరుతూ గుర్రంపాలెం మాజీ సర్పంచ్‌ పి.ధర్మరాజు హైకోర్టును ఆశ్రయించారు. ‘జగ్గంపేటలోని ప్రస్తుత  సీహెచ్‌సీ ప్రజలకు అందుబాటులో ఉంది. దానిని జడ్‌.రాగంపేటలోని కొత్త ప్రాంగణంలో మారిస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది’ అని వాదించారు. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదిస్తూ.. కొత్తగా నిర్మించతలపెట్టిన ప్రాంతం జాతీయ రహదారికి దగ్గరగా ఉందని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వ్యాజ్యాన్ని కొట్టివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని