బీసీ వసతి గృహాలను వదిలేశారా?

బీసీ సంక్షేమ వసతి గృహాలపై రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడింది. రాష్ట్రవ్యాప్తంగా 1,109 ప్రీమెట్రిక్‌, పోస్టుమెట్రిక్‌ వసతి గృహాలు ఉండగా 430 వార్డెన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Published : 07 Aug 2022 05:12 IST

430 వార్డెన్‌ పోస్టుల ఖాళీ

ఇన్‌ఛార్జ్‌లతోనే నిర్వహణ

ఒక్కొక్కరికి రెండు, మూడు హాస్టళ్ల బాధ్యతలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: బీసీ సంక్షేమ వసతి గృహాలపై రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడింది. రాష్ట్రవ్యాప్తంగా 1,109 ప్రీమెట్రిక్‌, పోస్టుమెట్రిక్‌ వసతి గృహాలు ఉండగా 430 వార్డెన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్‌ఛార్జీలతోనే కాలాన్ని నెట్టుకొస్తున్నారు. ఒక్కో అధికారికి కొన్నిచోట్ల రెండు, మూడు హాస్టళ్ల బాధ్యతలను అప్పగించారు. వార్డెన్లు ఉదయం ఒకచోట, సాయంత్రం మరోచోట లేదా రోజు విడిచిరోజు ఆయా వసతి గృహాలకు వెళుతున్నారు. బాలికలుండే వసతి గృహాల్లో కూడా కొన్నిచోట్ల వార్డెన్లు లేరు. బీసీ సంక్షేమశాఖ పరిధిలో మహిళా అధికారులు అందుబాటులో లేక ఎస్సీ సంక్షేమశాఖలోని వారికి ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించారు. దాదాపు 20-30 కిలోమీటర్ల దూరంలోని హాస్టళ్లను పర్యవేక్షించాల్సిన పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది.

బయోమెట్రిక్‌ అరకొరే..
రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని ప్రీమెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌ వసతి గృహాల్లో 52 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరి హాజరు పర్యవేక్షణకు బయోమెట్రిక్‌ యంత్రాలను అందుబాటులోకి తెచ్చినా అవి చాలాచోట్ల పనిచేయడం లేదు. దీంతో హాజరు నమోదు సక్రమంగా లేదు. ఇటీవల విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు నిర్వహించిన తనిఖీల్లోనూ రికార్డుల నమోదు లోపాలున్నట్లు బయటపడింది. విద్యార్థుల నమోదుకు, హాజరుకు పలుచోట్ల పొంతనే ఉండటం లేదు. బయోమెట్రిక్‌ యంత్రాలు పనిచేయడం లేదని తెలిసినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. నాలుగో తరగతి ఉద్యోగులైన వంటమనిషి, కామాటి, వాచ్‌మెన్‌ పోస్టులు 1,600 వరకు ఖాళీగా ఉన్నాయి.

వాహన భత్యం ఏదీ?
వసతి గృహాల పనితీరు పర్యవేక్షణకుగాను జిల్లా బీసీ సంక్షేమ అధికారి తరచూ తనిఖీలు నిర్వహించాలి. ఇందుకుగాను వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వాహన సౌకర్యాన్ని కల్పించి నెలకు రూ.35 వేల వరకు భత్యంగా కేటాయించింది. కానీ నాలుగేళ్లు ఈ భత్యాన్ని చెల్లించడం లేదు. దాదాపుగా రూ.2 కోట్ల వరకు బకాయిలున్నాయి. దీని గురించి జిల్లా అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతున్నా ఫలితం లేదు. దీంతో తనిఖీల నిర్వహణ తగ్గింది. కొంతమంది వెళుతున్నా తనిఖీలు మొక్కుబడిగానే జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు