చేయూత ఇస్తామన్నా.. ఇష్టం లేదా!

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక చేయూతను అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది. ఆహారం, తాగునీటిలో కలుషితాలు, బ్యాక్టీరియా గుర్తించేందుకు అవసరమైన అత్యాధునిక స్టేట్‌ ఫుడ్‌

Published : 07 Aug 2022 05:12 IST

స్టేట్‌ ఫుడ్‌, మైక్రోబయాలజీ ల్యాబ్స్‌, మొబైల్‌ టెస్టింగ్‌ వాహనాలు లేవు

నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం

చొరవ చూపని ఐపీఎం అధికారులు

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక చేయూతను అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది. ఆహారం, తాగునీటిలో కలుషితాలు, బ్యాక్టీరియా గుర్తించేందుకు అవసరమైన అత్యాధునిక స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌, మైక్రోబయాలజీ ల్యాబ్‌ ఏర్పాటుకు నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా...ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌(ఐపీఎం) అధికారుల నుంచి చొరవ కొరవడింది. ఎక్కడికక్కడ ఆహార నమూనాలు పరీక్షించేందుకు ఉపయోగపడే ఆధునిక మొబైల్‌ టెస్టింగ్‌ వాహనాలు ఇచ్చేందుకు ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా సుముఖంగా ఉన్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఐదు వాహనాలను దక్కించుకుంది.

రాష్ట్రంలో కర్నూలు, విశాఖ, గుంటూరు నగరాల్లో ఉన్న ప్రాంతీయ ల్యాబులతో పాటు స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌ ఉండాలి. ప్రాంతీయ ల్యాబుల్లో జరిగే పరీక్షల్లో కల్తీ ఉన్నట్లు తేలినా...స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌ రిపోర్టులే కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపకరిస్తాయి. ప్రాంతీయ ల్యాబుల్లో కందిపప్పు, బెల్లం, పాలు, ఇతర నిత్యావసర వస్తువుల నమూనాలను పరీక్షిస్తున్నారు. వీటిలో కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు, అత్యాధునిక యంత్రాలు, పరికరాలు లేవు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌కు నమూనాలు పంపిస్తూ వస్తున్నారు. ఇటీవల ‘ఐపీఎం’లో విభజన జరిగింది. అక్కడ పరీక్షల కొనసాగింపు ఎంతకాలం జరుగుతుందన్న దానిపై సందిగ్ధత నెలకొంది.

విశాఖ ల్యాబ్‌ పనితీరుపై విస్మయం!
విశాఖలోని ప్రాంతీయ ల్యాబ్‌ను రాష్ట్రస్థాయి ల్యాబ్‌గా మార్చేందుకు 2017 ఏప్రిల్‌ 24న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. తొలివిడతగా రూ.50 లక్షలను కేంద్రం మంజూరు చేయగా.. వీటిని భవన మరమ్మతులకు వినియోగించారు. మరో రూ.2.17 కోట్ల వ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 16న పరిపాలనాపరమైన ఆమోదం తెలిపింది. కానీ పనులు నత్తనడక సాగుతున్నాయి. ఇక్కడి పరిస్థితులను ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా బృందం పరిశీలించి విస్మయం వ్యక్తంచేసింది. ఎటువంటి సౌకర్యాలు లేకుండానే విశాఖ పోర్టు నుంచి సేకరించిన నమూనాలు సురక్షితంగా ఉన్నాయని ఫలితాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పరువుపోయింది. మరోవైపు మైక్రోబయాలజీ ల్యాబ్‌ ఏర్పాటుకు రూ.4 కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పగా...ఇంతవరకు అధికారికంగా ఒప్పందాలు జరగలేదు. దీంతో కేంద్రం ప్రకటించిన రూ.4 కోట్లను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుంది. రాష్ట్రస్థాయి ల్యాబ్‌గా విశాఖ ల్యాబ్‌ను గుర్తించడంపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గెజిట్‌ కూడా వెలువడలేదు. రాష్ట్రస్థాయిలో ల్యాబ్‌ ఏర్పడాలంటే విశాఖ ల్యాబ్‌కు ఆధునిక భవనాలు, పరికరాలు సమకూరాలి. మానవ వనరుల నియామకాలు జరగాలి.

అదనపు వ్యయం!
రాష్ట్రస్థాయిలో ఫుడ్‌ ల్యాబ్‌ లేకపోవడంవల్ల ప్రభుత్వంపై భారం పెరగడంతో పాటు సకాలంలో పరీక్షలు జరగని పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒక్కో నమూనాను ప్రైవేట్‌ ల్యాబ్‌లో పరీక్షించాలంటే కనీసం రూ.5-8వేల వరకు వ్యయమవుతోంది. ఇలా ఏడాదికి రూ.ఐదారు కోట్లు అవసరం అవుతాయి.

మొబైల్‌ వాహనాల అవసరం ఉన్నా!
ఆహారం, తాగునీటిలో కలుషితాలను ఎక్కడికక్కడ పరీక్షించి, ఫలితాల ఆధారంగా తయారీ, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకొనేందుకు ఉపయోగపడే మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ (ఎం.ఎఫ్‌.టి.ఎల్‌) వాహనాలను ఐదింటిని ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలోనూ రాష్ట్ర అధికారులు వైఫల్యం చెందుతున్నారు. తెలంగాణలో ఉన్న ఐదింటితో కలిపి ఇతర రాష్ట్రాల్లో 200 మొబైల్‌ వాహనాలు ఉండగా ఏపీలో ఒకటీ లేదు. రాష్ట్ర ఐపీఎం డైరెక్టర్‌ కె.జగదీశ్వరీ మాట్లాడుతూ.. త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు