దారం తెగి దయనీయం

దూది నుంచి దారం తయారుచేసే నూలు మిల్లులు మునుపెన్నడూ చవిచూడని కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు ముడిసరకు పత్తి ధరలు అసాధారణంగా పెరగడం, మరోవైపు దారం

Published : 08 Aug 2022 05:39 IST

సంక్షోభం దిశగా నూలు పరిశ్రమ

బాగా తగ్గిన ఉత్పత్తి

ఈనాడు-అమరావతి: దూది నుంచి దారం తయారుచేసే నూలు మిల్లులు మునుపెన్నడూ చవిచూడని కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు ముడిసరకు పత్తి ధరలు అసాధారణంగా పెరగడం, మరోవైపు దారం ఎగుమతులు ఆగి నిల్వలు పేరుకుపోయి పరిశ్రమ కుదేలవుతోంది. దైనందిన నిర్వహణ ఖర్చులు రాకపోగా.. రోజువారీగా రూ.లక్షల్లో నష్టాలు వస్తుండటంతో మిల్లుల మనుగడ ప్రశ్నార్థకమైంది. ఏప్రిల్‌ నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జనవరి నెలలో క్యాండీ (356 కిలోల దూది) రూ.75 వేలు కాగా, ప్రస్తుతం రూ.95 వేలు పెట్టి మిల్లులు కొనుక్కోవాల్సి వస్తోంది. దూది ధర పెరిగిన దామాషాలో దారం ధర పెరగడం లేదు. 32 కౌంట్‌ దారం కిలో రూ.300కు ఇస్తామన్నా మార్కెట్‌లో కొనేవారు కరవయ్యారు. కొత్త పత్తి రావడానికి నవంబరు వరకు వేచి చూసే పరిస్థితి ఉందని, అప్పటివరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నవంబరు వరకు మిల్లులెలా నడపాలన్న ఆలోచన వారికి కునుకు లేకుండా చేస్తోంది.

ఎగుమతులు లేక కుదేలు
స్పిన్నింగ్‌ మిల్లులు ఉత్పత్తి చేసే దారాన్ని దేశీయంగా వినియోగించడంతో పాటు చైనాకే ఎక్కువగా ఎగుమతి చేస్తారు. చైనాలో మార్చి నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో అక్కడికి ఎగుమతులు పూర్తిగా నిలిచాయి. ఆ దేశ ప్రభుత్వం తమ వద్దనున్న 6వేల టన్నుల దూదిని వేలానికి పెట్టగా, 1930 టన్నులు మాత్రమే అక్కడి మిల్లులు కొన్నాయని సమాచారం. అది కూడా క్యాండీ రూ.65,939కు కొనడం మార్కెట్‌ కుంగుబాటుకు అద్దం పడుతోంది. అంతర్జాతీయంగా క్యాండీ రూ.95 వేలు ఉండగా చైనాలో లాక్‌డౌన్‌ వల్ల పరిశ్రమ కుదేలైందని మిల్లు యజమాని ఒకరు విశ్లేషించారు. దేశీయ మార్కెట్‌లో వస్త్రం ధర పెరిగినందున వినియోగదారులు ఆచితూచి కొంటున్నారు. వస్త్రానికి డిమాండ్‌ తగ్గడంతో దేశీయంగా దారం కొనుగోళ్లు మందగించాయి. దూది నుంచి రెడీమేడ్‌ వస్త్రాల తయారీ వరకు అన్ని దశల్లో విక్రయాలు మందగించడంతో నిల్వలున్నాయి. దీంతో ఉత్పత్తయిన దారాన్ని కొనేవారు లేక రోజురోజుకు ధరలు పతనం కావడంతోపాటు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఒక్కొక్క మిల్లు వద్ద సగటున 500 టన్నుల వరకు దారం ఉంది. అదే సమయంలో ముడిసరకు పత్తి ధరలు మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగినా అధిక వర్షాల వల్ల పత్తి దిగుబడులు ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. అధిక వర్షాలు కొనసాగితే దిగుబడులపై ప్రభావం పడుతుంది. ప్రస్తుత ధర వద్ద దూది కొనుక్కుని దారం తయారు చేస్తే కిలోకు రూ.50 వరకు నష్టం వస్తుంది. 25వేల స్పిండిల్స్‌ సామర్థ్యమున్న మిల్లు రోజుకు రూ.5లక్షల నష్టాన్ని మూటగట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో పూర్తి సామర్థ్యం మేరకు మిల్లులు నడపకుండా నష్టాలను కాస్త తగ్గించుకుంటున్నారు. రాష్ట్రంలో 90 స్పిన్నింగ్‌ మిల్లులు ఉండగా.. 3 షిఫ్టులకు మెజారిటీ యజమానులు ఒక షిఫ్టుకే పరిమితమయ్యారు. మరోవైపు మిల్లులకు విద్యుత్తు సుంకం పెంపు మరింత భారమైంది. గతంలో యూనిట్‌కు విద్యుత్తు సుంకం 6పైసలు ఉండగా, ఏప్రిల్‌ నుంచి ఒక్కసారిగా రూపాయికి పెంచారు. అదే విధంగా స్థిరఛార్జీలనూ పెంచారు. రోజుకు లక్ష యూనిట్లు వినియోగించే మిల్లులకు రోజువారీగా రూ.లక్ష అదనపు భారం పడుతోంది. మరోవైపు జులై నుంచి అమల్లోకి వచ్చిన ట్రూఅప్‌ ఛార్జీల రూపంలో యూనిట్‌కు సగటున 27 పైసలు చెల్లించాల్సి వస్తోంది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని