ప్లాస్టిక్‌ ఉత్పత్తుల నిషేధంపై ఏపీ హైకోర్టును ఆశ్రయించిన యాజమాన్యాలు

ఒకసారి వినియోగించి పడేసే(సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ, వినియోగాన్ని నిషేధిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తయారీ సంస్థల యాజమాన్యాలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి.

Updated : 09 Aug 2022 06:34 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ

ఈనాడు, అమరావతి: ఒకసారి వినియోగించి పడేసే(సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ, వినియోగాన్ని నిషేధిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తయారీ సంస్థల యాజమాన్యాలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఊటుకూరు శ్రీనివాస్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ కార్యదర్శి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఛైర్మన్‌, ఏపీ పర్యావరణ, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీపీసీబీ సభ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది. వంద మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ, విక్రయం, వినియోగాన్ని నిలువరిస్తూ గతేడాది ఆగస్టు 12న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ తీసుకొచ్చిన ప్లాస్టిక్‌ వృథా నిర్వహణ(సవరణ) నిబంధనలు-2021, తదనుగుణంగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) జారీచేసిన ప్రజా నోటీసును సవాలు చేస్తూ గుంటూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలకు చెందిన ప్లాస్టిక్‌ ఉత్పత్తుల పరిశ్రమల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. ఈ నిర్ణయం వల్ల పిటిషనర్లు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. రూ.కోట్లలో ఖర్చు చేసి ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేశారన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. ఇదే వ్యవహారంపై గతంలో దాఖలైన వ్యాజ్యంతో ప్రస్తుత పిటిషన్‌ను జతచేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని