Paderu: గిరిజన సంక్షేమానికి సీఎం పెద్దపీట వేస్తున్నారు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా

Updated : 10 Aug 2022 03:47 IST

ఆదివాసీ దినోత్సవంలో మంత్రులు

పాడేరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ పాడేరులో రూ.500 కోట్లతో వైద్య కళాశాల, పార్వతీపురంలో ఇంజినీరింగ్‌ కళాశాలను నిర్మిస్తున్నామని చెప్పారు. గిరిజనులకు రెండున్నర లక్షల ఎకరాల అటవీ భూములపై హక్కులు కల్పించినట్లు తెలిపారు. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గిరిజనేతరులకు భూములివ్వలేమని, ఇక్కడ సర్వహక్కులూ ఆదివాసీలకే ఉంటాయని సీఎం ఇటీవల చింతూరులో స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. గిరిజనేతరులకు ఏజెన్సీలో ఇళ్ల స్థలాలిస్తారని స్థానికంగా కొన్ని సంఘాలకు అపోహలున్నాయని చెప్పారు. వాటిని విడనాడాలన్నారు. దీనిపై ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులనూ విడుదల చేయలేదన్నారు. కేవలం ఓ నోట్‌ మాత్రం జారీ అయిందన్నారు. నోట్‌కు, ఉత్తర్వులకు చాలా తేడా ఉందని చెప్పారు. పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ రూ.14 వేల కోట్ల సబ్‌ ప్లాన్‌ నిధులు గిరిజన సంక్షేమానికి ఖర్చు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంభా రవిబాబు మాట్లాడుతూ అటవీ భూములపై గిరిజనులకు హక్కు కల్పించడంలో అటవీశాఖ అధికారులు అక్కడక్కడ అవరోధాలు సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అనంతరం రాష్ట్రంలో ఉన్న ఎనిమిది ఐటీడీఏల పరిధిలో రూ.134 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 251 డ్వాక్రా సంఘాలకు సంబంధించి రూ.6.44 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును లబ్ధిదారులకు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని