Updated : 10 Aug 2022 06:06 IST

Godavari Floods: గోదావరికి మళ్లీ వరద

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

కుక్కునూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఎటపాక, చింతూరు, దేవీపట్నం, న్యూస్‌టుడే: గోదావరికి మళ్లీ వరద పోటెత్తింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద 44 అడుగులకు చేరటంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. బుధవారం మధ్యాహ్నంకల్లా 55 అడుగులకు చేరే అవకాశాలు ఉన్నట్లు అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గోదావరి ఎగువ ప్రాంతం తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఇంద్రావతి, ప్రాణహిత, కిన్నెరసాని, తాలిపేరు, శబరి వంటి ఉప నదులు పొంగిపొర్లుతుండటంతో నదిలో ప్రమాదకర స్థాయిని మించి ప్రవాహం కొనసాగుతోంది.

మళ్లీ జల దిగ్బంధంలోకి గ్రామాలు...
వరద ప్రభావంతో విలీన మండలాల్లోని గ్రామాలు మళ్లీ జల దిగ్బంధనంలోకి చేరుకున్నాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని రహదారులు నీట మునగడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉద్ధృతి నుంచి ఇప్పుడిప్పుడే గ్రామాలు కోలుకుంటుండగా, మళ్లీ మరోసారి వరద పోటెత్తటం, బాధితులకు ఆందోళన కలిగిస్తోంది. రుద్రంకోట వరద బాధితులు 25 రోజులుగా గుట్టపై తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఈ సమయంలో తిరిగి వరద పెరుగుతుందన్న సమాచారం వారికి నిద్ర లేకుండా చేస్తోంది.

విలీన మండలాల వాసులను భయపెడుతున్న వరదలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలవాసులను గోదావరి, శబరి వరదలు మళ్లీ వణికిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. వారం రోజుల క్రితమే ఇళ్లకు చేరుకున్న బాధితులు మరోసారి సామగ్రి సర్దుకుని పునరావాస కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుందనే సమాచారంతో కొందరు ఇక్కడి నుంచి తెలంగాణలోని పట్టణ ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అధికారుల నుంచి ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదని ముంపువాసులు వాపోతున్నారు. కూనవరంలో మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు గోదావరి వరద నీటి మట్టం 42 అడుగులు దాటింది. వరరామచంద్రాపురంలోని కన్నాయిగూడెం వద్ద, చింతూరు-వరరామచంద్రాపురం ప్రధాన రహదారిపై వరద నీరు చేరింది. ఎటపాక మండలం గుండాల, కొల్లుగూడెం, రాయనపేట, తదితర మురుమూరు గ్రామాల సమీపంలోకి వరదనీరు చేరింది. ఎటపాక మండలం నెల్లిపాక, వీరాయిగూడెం గ్రామాల మధ్య  రాకపోకలు నిలిచాయి.

* దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు అడుగుల మేర నీటిమట్టం పెరగడంతో పోశమ్మగండి వద్ద గండిపోశమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగింది. రాకపోకలు నిలిచిపోయాయి. కొండమొదలు పంచాయతీలో కత్తనాపల్లి, కొత్తగూడెం, తాళ్లూరు గ్రామాల గిరిజనులు కొండలపై బిక్కుబిక్కుమంటున్నారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా
వరదల కారణంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేసినట్లు చింతూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రఘురామ్‌ మంగళవారం తెలిపారు. చింతూరు, వరరామచంద్రపురం జూనియర్‌ కళాశాలల్లో నిర్వహిస్తున్న పరీక్షలను బోర్డు రెండు వారాలపాటు వాయిదా వేసినట్లు చెప్పారు. రసాయనశాస్త్రం, వాణిజ్యశాస్త్రం పరీక్షలు జరగాల్సి ఉందన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts