ఒక్కో వర్సిటీలో ఒక్కో ఫీజు

వృత్తి విద్యా కోర్సుల కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు జేఎన్‌టీయూలు వసూలు చేస్తున్న ఫీజుల్లో భారీ వ్యత్యాసం ఉంటోంది. బీటెక్‌లో విద్యార్థుల సంఖ్య ప్రకారం ఫీజు

Published : 10 Aug 2022 05:42 IST

కళాశాలల అనుబంధ గుర్తింపు ఫీజుల్లో వ్యత్యాసం

బీటెక్‌లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా వసూలు

ఈనాడు, అమరావతి: వృత్తి విద్యా కోర్సుల కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు జేఎన్‌టీయూలు వసూలు చేస్తున్న ఫీజుల్లో భారీ వ్యత్యాసం ఉంటోంది. బీటెక్‌లో విద్యార్థుల సంఖ్య ప్రకారం ఫీజు తీసుకుంటుండగా.. పోస్టుగ్రాడ్యుయేషన్‌(పీజీ)లో ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏలకు మాత్రం కోర్సుల వారీగా వసూలు చేస్తున్నాయి. బీటెక్‌లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఒక విధానం.. పీజీల్లో ప్రవేశాలు తక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో ఇక్కడ కోర్సుల వారీ విధానం అమలు చేస్తున్నాయి. మరోపక్క జేఎన్‌టీయూ కాకినాడ, విజయనగరం ఫీజుల నిర్ణయంలో ఒక విధానం పాటిస్తుండగా.. జేఎన్‌టీయూ అనంతపురం మరో పద్ధతి అమల్లో చేస్తోంది. ఒకే రాష్ట్రంలో ఒకే విధానంలో ఏర్పాటైన మూడు వర్సిటీలు కళాశాలల అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ఒక్కో విధానాన్ని పాటిస్తున్నాయి. దీంతో కొన్ని కళాశాలలకు ఆర్థిక భారం పెరుగుతుండగా.. మరికొన్నింటికి భారం తక్కువగా ఉంటోంది. జేఎన్‌టీయూ కాకినాడ, విజయనగరం పరిధిలోని కళాశాలలు అనుబంధ గుర్తింపు తనిఖీలు, అనుమతులకు ఎక్కువ మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఈ వర్సిటీల పరిధిలో ప్రైవేటు కళాశాలల అనుబంధ గుర్తింపు ఫీజుల బకాయిలు రూ.150కోట్లకు పైగా ఉన్నాయి.

బీటెక్‌లోనూ వ్యత్యాసమే
ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ కోర్సులకు తాత్కాలిక అనుమతులు ఇచ్చేందుకు నిర్వహించే తనిఖీలకు జేఎన్‌టీయూ కాకినాడ, విజయనగరం నాలుగు కోర్సులకు రూ.20వేలు, ఆ తర్వాత ఒక్కో అదనపు కోర్సుకు రూ.3వేల చొప్పున వసూలు చేస్తున్నాయి. జేఎన్‌టీయూ అనంతపురం మాత్రం అన్నింటికీ కలిపి రూ.20వేలు తీసుకుంటోంది. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌ల్లో కోర్సుకు రూ.10వేలు తీసుకుంటుండగా.. జేఎన్‌టీయూ అనంతపురం మాత్రం మొత్తానికి రూ.15వేలు వసూలు చేస్తోంది. అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ఒక్కో విద్యార్థికి జేఎన్‌టీయూ కాకినాడ, అనంతపురం రూ.175 చొప్పున వసూలు చేస్తుండగా.. అనంతపురం పరిధిలో రూ.150 చొప్పున తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు ఒకే నిబంధనలు పాటిస్తుండగా.. వర్సిటీల మధ్య ఫీజుల వసూళ్లల్లో వ్యత్యాసం నెలకొంది. డిగ్రీ కోర్సుల్లోనూ ఈ వ్యత్యాసం ఉంది. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు అనుబంధ గుర్తింపు తనిఖీలు, అనుమతులు ఇచ్చేందుకు ఒకే విధానం పాటించాలని యాజమాన్యాలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. దీనిపై పలుమార్లు మంత్రులకు వినతిపత్రాలు సమర్పించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని