‘షో’లవరం!

పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుత అస్తవ్యస్త పరిస్థితులకు ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా ప్రాజెక్టు అథారిటీ తేల్చింది. దిగువ కాఫర్‌డ్యాంను 2022 జులైలోగా నిర్మించాల్సి

Published : 11 Aug 2022 03:32 IST

మూడేళ్లుగా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ ఏదీ?

ప్రస్తుత ప్రభుత్వాన్ని దోషిగా తేల్చిన పోలవరం అథారిటీ

సాక్ష్యాధారాలతో సహా నిలదీత

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుత అస్తవ్యస్త పరిస్థితులకు ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా ప్రాజెక్టు అథారిటీ తేల్చింది. దిగువ కాఫర్‌డ్యాంను 2022 జులైలోగా నిర్మించాల్సి ఉన్నా.. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని తప్పుపట్టింది. అందుకే ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రదేశాన్ని వరద ముంచెత్తిందని వెల్లడించింది. ఇకముందు తలెత్తబోయే ఇతర విపరిణామాలకు దిగువ కాఫర్‌డ్యాం సకాలంలో నిర్మించకపోవడమే ప్రధాన కారణమవుతుందని అప్రమత్తం చేసింది. ప్రాజెక్టు అథారిటీ సూచనలను ప్రభుత్వం మూడేళ్లనుంచి విస్మరిస్తోందంటూ నిలదీసింది.

అథారిటీ అభ్యంతరాలివీ..
* 2019 నవంబరులో కొత్త కాంట్రాక్టు సంస్థకు పోలవరం పని అప్పగించేనాటికి దిగువ కాఫర్‌డ్యాంలో 22.09 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని మాత్రమే మిగిలి ఉంది. 2022 ఏప్రిల్‌లో ప్రాజెక్టుకు కొత్త షెడ్యూలు సిద్ధం చేశారు. ఆ ప్రకారం 2022 జులైనాటికి దిగువ కాఫర్‌డ్యాం పూర్తి చేయాల్సి ఉంది. జులైలోపు పని పూర్తి చేసేస్తామని పదేపదే ఏపీ జలవనరులశాఖ చెబుతూ వచ్చినా సాధ్యం కాలేదు. దీనిపై ఏప్రిల్‌నుంచి జులైలోపు అనేక సార్లు రాష్ట్ర జలవనరుల శాఖను హెచ్చరిస్తూనే ఉన్నాం. ప్రధాన డ్యాం పనులకు దిగువ కాఫర్‌డ్యాం నిర్మాణం అడ్డంకిగా మారుతుంది. వరద ముంచెత్తుతుందని, త్వరగా చేసుకోవాలని కేంద్ర జలసంఘం డైరెక్టర్‌ వివరంగా చెప్పినా నిష్ఫలమైంది.

* జలవనరుల శాఖ తీరు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేలా లేదు. ప్రాజెక్టు పర్యవేక్షణకు మేనేజ్‌మెంట్‌ టూల్‌ను సేకరించి ప్రాజెక్టులో, అథారిటీలో, ఏపీ జలవనరుల శాఖలో ఏర్పాటుచేయాలని మూడేళ్లకుపైగా చెబుతూనే ఉన్నాం. మా సూచనలను రాష్ట్ర జలవనరులశాఖ పట్టించుకోవడం లేదు. గౌరవించడం లేదు.

తాజా సమస్యలేమిటి?
* పోలవరం అథారిటీ ఈ స్థాయిలో ఆక్రోశం వెళ్లగక్కడానికి కారణాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టులో దిగువ, ఎగువ కాఫర్‌ డ్యాంలు కీలకం. దిగువ కాఫర్‌ డ్యాం పూర్తిచేసి ఉంటే వరద సమయంలోనూ పనులు చేసుకునేందుకు వీలుండేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు.దిగువ కాఫర్‌ డ్యాం పూర్తిచేయకపోవడం వల్ల పనులు చేయాల్సిన కీలక ప్రాంతాన్నంతా వరద ముంచెత్తింది. గోదావరిలో సెప్టెంబరు వరకు వరదలు ఉంటూనే ఉంటాయి. మళ్లీ అక్టోబరు వరకు పనులు ప్రారంభించడం సాధ్యమయ్యే పరిస్థితులు ఉండవు.

* వరదలు తగ్గాక ఆ నీటిని అక్కడినుంచి తోడివేయడమూ పెద్ద సమస్యే. గతంలో ఉన్న నీటిని ఎత్తిపోయాలంటేనే రూ.2,100 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఆ తర్వాత ప్రత్యామ్నాయ ఆలోచనలు చేశారు. ప్రస్తుతం వరదలు తగ్గాక నీరు మరింత ఎక్కువే ఉంటుంది. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో, పరిష్కారాలకు ఎంత ఖర్చవుతుందో అప్పటి అధ్యయనాలనుబట్టి తెలుస్తుంది. నిపుణుల బృందాలు మళ్లీ అక్కడ అన్నీ పరిశీలించాల్సి ఉంటుంది.

* డయాఫ్రంవాల్‌ సామర్థ్యం తేల్చేందుకు నేషనల్‌ హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ నిపుణులు ఒక మార్గం కనుగొన్నారు. దీనికి ఏర్పాట్లు చేస్తుండగా వరద వచ్చేసింది. దీంతో అధ్యయనానికి అవకాశం లేదు. దిగువ కాఫర్‌ డ్యాం పూర్తి చేసి ఉంటే ఆ పని నిరాటంకంగా సాగేది.

* ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట భారీ గుంతలు పడ్డాయి. కొంత ఇసుకతో నింపుతున్నారు. ఆ సమస్య పరిష్కారాలపైనా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇంతలో వరద ముంచెత్తి పనులకు అవాంతరమేర్పడింది.

* 2020 వరదలకన్నా ముందే ఎగువ, దిగువ కాఫర్‌డ్యాంలు పూర్తి చేసుకుని ఉంటే సమస్యలు వచ్చేవి కావు.

జులైలో గోదావరికి అనూహ్యంగా వరదలు వచ్చాయని జలవనరుల మంత్రి చెప్పడం విమర్శలకు తావిస్తోంది. గోదావరి వరద రికార్డులనుబట్టి జులైలో ఈ నదికి వరదలొస్తాయని ఎవరైనా చెబుతారు. ముఖ్యమంత్రి జగన్‌ సైతం 2019లో శాసనసభలోమాట్లాడుతూ గోదావరికి జులైలో 10లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని కూడా చెప్పారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts