గోదావరికి మరింత వరద

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ధవళేశ్వరం బ్యారేజికి 11.79 లక్షల

Published : 11 Aug 2022 03:30 IST

ధవళేశ్వరం వద్ద నేడు రెండో ప్రమాద హెచ్చరిక జారీకి అవకాశం

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే బృందం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ధవళేశ్వరం బ్యారేజికి 11.79 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. ఎగువ రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉపనదులు పొంగుతున్నాయి. రాజమహేంద్రవరంలోని గోదావరి ఘాట్లను మూసేశారు.

* భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి బుధవారం సాయంత్రానికి కాస్త తగ్గింది. అర్ధరాత్రికి నిలకడగా మారి, గురువారం నుంచి తగ్గుముఖం పట్టే సూచనలున్నట్లు అధికారులు తెలిపారు.

* పోలవరం స్పిల్‌వే వద్ద బుధవారం సాయంత్రానికి నీటిమట్టం 33.40 మీటర్లకు చేరింది. 48 గేట్ల నుంచి 10.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వెళ్తోంది.

బలహీనపడనున్న తీవ్ర అల్పపీడనం
ఛత్తీస్‌గఢ్‌ దాని పరిసరాల్లోని తూర్పు మధ్యప్రదేశ్‌ ప్రాంతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం.. బుధవారం రాత్రికి అల్పపీడనంగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా పేర్కొన్నారు.

కొనసాగుతున్న వరద భయం
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలను మళ్లీ వరద చుట్టేసింది. రెండు రోజుల క్రితం మెల్లగా ప్రారంభమైన వరద తీవ్రరూపం దాల్చింది. చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఎటపాక మండలాల్లో పలు గ్రామాలను వరద ముంచెత్తింది. చింతూరు మండలంలోని జాతీయ రహదారులు 30, 216లపై మూడు చోట్ల వరద కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. చింతూరు మండలంలోని ఏజీ కోడేరు, ముకునూరు, పెద సీతనపల్లి, చదలవాడ, కల్లేరు గ్రామపంచాయతీల పరిధిలోని సుమారు 40 గ్రామాలకు రాకపోకలు లేవు. నెల రోజుల వ్యవధిలో మళ్లీ వరద రావడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం పది గేట్ల ఎత్తివేత
ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతి పెరగడంతో శ్రీశైలం జలాశయం పది క్రస్ట్‌గేట్లను పది అడుగుల మేర పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. గేట్ల ద్వారా 2,77,540 క్యూసెక్కులు, శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 61,875 క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

* ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టాని(590 అడుగులు)కి చేరువలో ఉంది. బుధవారం సాయంత్రానికి 583.5 అడుగులకు చేరింది. గురువారం ఉదయం 6.30 గంటలకు సాగర్‌ క్రస్ట్‌గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.

* నాగార్జునసాగర్‌ నుంచి లక్ష క్యూసెక్కుల నుంచి 3లక్షల క్యూసెక్కులను దశలవారీగా విడుదల చేసే అవకాశముందని, ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బుధవారం రాత్రి పదింటికి పులిచింతల ఐదు గేట్లు 1.5 మీటర్లు పైకి ఎత్తి 79వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని