డైట్‌ ఛార్జీల పెంపు!

సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించేలా డైట్‌ ఛార్జీలను పెంచాలని అధికారుల్ని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ప్రతిపాదనలను సిద్ధం చేయాలని

Updated : 11 Aug 2022 09:34 IST

ప్రతిపాదనలు సిద్ధం చేయండి

సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించాలి

ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశం

సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించేలా డైట్‌ ఛార్జీలను పెంచాలని అధికారుల్ని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు.

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించేలా డైట్‌ ఛార్జీలను పెంచాలని అధికారుల్ని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ప్రస్తుతం అమలవుతున్న డైట్‌ ఛార్జీలను పరిశీలించి ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు డైట్‌ ఛార్జీలను పెంచిందని, అప్పటివరకూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన విమర్శించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వసతి గృహాల నిర్వహణ కోసం ఇప్పుడున్న మొత్తాన్ని పెంచాలి. పాఠశాల నిర్వహణ నిధి మాదిరిగానే వసతి గృహాల నిర్వహణ నిధిని ఏర్పాటు చేయాలి. ప్రతి వసతి గృహంలోనూ తప్పనిసరిగా వార్డెన్లను నియమించాలి. కామాటి, వంటమనిషి, వాచ్‌మెన్‌ వంటి ఇతర సిబ్బంది కచ్చితంగా ఉండేట్టు చర్యలు తీసుకోవాలి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో వైద్యుడు వసతి గృహాల విద్యార్థుల బాగోగులపై దృష్టిపెట్టాలి. మన పిల్లలు ఇవే వసతి గృహాల్లో ఉంటే ఎలాంటి వసతులు ఉండాలని కోరుకుంటామో అలాంటివే ఉండాలి. ఆ మేరకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, వసతి గృహాలకు కొత్త రూపునివ్వాలి’ అని సూచించారు.

చేయాల్సింది చాలా ఉంది...
‘రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వసతి గృహాలు, గురుకులాలు ఎలా ఉన్నాయన్న దానిపై పరిశీలన చేయించా. అక్కడ మనం చేయాల్సింది చాలా ఉంది. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో నాడు-నేడు కింద యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలి. ఏడాదిలోగా వీటిని పూర్తి చేయాలి. పాఠశాలల తరహాలోనే వీటిని అభివృద్ధి చేయాలి. దశాబ్దాలుగా సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలను పట్టించుకున్న నాథుడే లేరు. వీటి అభివృద్ధి పనుల్లో అధికారుల ముద్ర కనిపించాలి. వచ్చే ఏడాది అద్దె వసతి గృహాల స్థానంలో నాడు-నేడు కింద శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలి. మరోవైపు ప్రస్తుతం ఉన్న వసతి గృహాలను ఉత్తమస్థాయిలో తీర్చిదిద్దాలి. వీటికి అదనంగా కేజీబీవీలు, ఆదర్శపాఠశాలలను కూడా చేర్చాలి. ప్రతి పనిలోనూ నాణ్యత తప్పనిసరిగా ఉండాలి. వసతి గృహాల్లోని పిల్లలు అక్కడ ఉన్నందుకు గర్వంగా భావించాలి. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలి. పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి’ అని సీఎం ఆదేశించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts