వైద్య కారణాలతో వరవరరావుకు బెయిలు

భీమా కోరెగావ్‌ కేసులో రెండో నిందితుడు రచయిత, పౌరహక్కుల నేత వరవరరావుకు వైద్య కారణాలపై సుప్రీంకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఆయన గ్రేటర్‌ ముంబయి పరిధిలోనే ఉండాలని షరతు విధించింది. భీమా కోరెగావ్‌

Updated : 11 Aug 2022 06:05 IST

గ్రేటర్‌ ముంబయి పరిధిలోనే ఉండాలని సుప్రీంకోర్టు షరతు

ఈనాడు, దిల్లీ: భీమా కోరెగావ్‌ కేసులో రెండో నిందితుడు రచయిత, పౌరహక్కుల నేత వరవరరావుకు వైద్య కారణాలపై సుప్రీంకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఆయన గ్రేటర్‌ ముంబయి పరిధిలోనే ఉండాలని షరతు విధించింది. భీమా కోరెగావ్‌ కేసులో నిందితునిగా ఉన్న వరవరరావుకు శాశ్వత బెయిల్‌ను నిరాకరిస్తూ మూడు నెలల్లోపు లొంగిపోవాలంటూ బాంబే హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో వాటిని ఆయన సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. పిటిషన్‌ను జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ సుధాంశు ధూలియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. వరవరరావు తరఫున సీనియర్‌ న్యాయవాది ఆనంద్‌ గ్రోవర్‌, ఎన్‌ఐఏ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎస్‌.వి.రాజు వాదనలు వినిపించారు. ఇరుపక్షాలు వాదనలు సుదీర్ఘంగా విన్న అనంతరం ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. ‘‘వరవరరావుకు బెయిల్‌ మంజూరు చేస్తున్నాం. మూడు నెలల్లోపు లొంగిపోవాలనే హైకోర్టు షరతును తొలగిస్తున్నాం. ముంబయిలోని ఎన్‌ఐఏ కోర్టు అనుమతి లేకుండా ఆయన గ్రేటర్‌ ముంబయి వదిలివెళ్లరాదు. ఆయనకు ఇచ్చిన స్వేచ్ఛను ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయకూడదు. సాక్షులతో మాట్లాడుతూ దర్యాప్తును ప్రభావితం చేయకూడదు. పిటిషనర్‌ వైద్య చికిత్సలు పొందవచ్చు. అదే సమయంలో ఎన్‌ఐఏ అధికారులకు అందుబాటులో ఉండాలి. కేసులోని మెరిట్స్‌ ఆధారంగా కాకుండా వైద్యపరమైన కారణాలతోనే బెయిల్‌ ఇస్తున్నాం. ఈ బెయిల్‌ ఇదే కేసులోని ఇతర నిందితులకు ఉదాహరణగా నిలవదు’’ అని పేర్కొంది. ఇందుకు సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. 2017లో డిసెంబరు 31న పుణెలో నిర్వహించిన ఎల్గార్‌ పరిషద్‌ సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్నది వరవరరావుపై అభియోగం. ఈ నేపథ్యంలో 2018, ఆగస్టు 28న హైదరాబాద్‌లోని నివాసంలో ఆయన్ను అరెస్టు చేసి పుణెకు తరలించారు. అనంతరం ఈ కేసు దర్యాప్తు ఎన్‌ఐఏ పరిధిలోకి వెళ్లింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని