Updated : 11 Aug 2022 06:14 IST

‘ప్రాథమిక’ వసతులేవీ?

24 గంటల పీహెచ్‌సీల్లో వైద్యం అంతంతే

రాత్రిపూట విధుల్లో స్టాఫ్‌నర్సు ఒక్కరే

ప్రసవాలపైనా ప్రభావం

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) పూర్తిస్థాయిలో 24 గంటల వైద్యసేవలు అందడం లేదు. అత్యవసర సమయాల్లో ప్రాథమిక వైద్యం అందించేందుకు, సహజ ప్రసవాలను పెంచేందుకు అన్ని పీహెచ్‌సీలను 24 గంటలపాటు అందుబాటులో ఉంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 1,142 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిల్లో 24 గంటలపాటు ఎన్ని పని చేస్తున్నాయన్న అంశంపై ప్రధాన కార్యాలయంలోనే కచ్చితమైన సమాచారం లేదు. ఒకరిద్దరు స్టాఫ్‌నర్సులున్న పీహెచ్‌సీలు ఉదయంనుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నాయి. ముగ్గురు స్టాఫ్‌నర్సులున్న పీహెచ్‌సీలు మాత్రమే 24 గంటలపాటు తెరిచి ఉంటున్నాయి. ముగ్గురిలో రాత్రిపూట ఒకరే విధుల్లో ఉండాల్సి వస్తోంది.

ఒకరే ఉంటే ఎలా?
పీహెచ్‌సీలు ఎక్కువగా మండల కేంద్రాల్లో జనసంచారానికి కాస్త దూరంగా ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో రాత్రి పూట ఒక్కరే భయంభయంగా విధులు నిర్వహించాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో ఆన్‌కాల్‌పై వైద్యులు విధులకు హాజరవుతారని చెబుతున్నా.. చాలామంది మండల కేంద్రాల్లోనే నివసించడం లేదు. రాత్రి సమయాల్లో తేళ్లు, పాముకాట్లకు గురైనవారు, విషం తాగినవారు, రోడ్డు, ఇతర ప్రమాదాల్లో గాయపడ్డవారు తొలుత పీహెచ్‌సీలకు వస్తారు. ప్రసవనొప్పులు వచ్చిన గర్భిణులను పల్లెలనుంచి ఇక్కడికే తీసుకొస్తారు. వారికి రాత్రిపూట విధుల్లో ఉండే ఒక్కరే వైద్య సేవలందించడం ఎలా సాధ్యమని స్టాఫ్‌నర్సులు ప్రశ్నిస్తున్నారు. ‘మెడికల్‌ ఆఫీసర్లు ఆన్‌కాల్‌పై ఆసుపత్రులకు వస్తున్న దాఖలాలు తక్కువ. కొందరు వైద్యులు ప్రసవాలు చేసేందుకు ముందుకు రావడం లేదు. వారికి వృత్తి నైపుణ్యం తక్కువగా ఉంటోంది. మరోవైపు ప్రసవ సమయంలో గర్భిణి కుటుంబీకుల నుంచి మాపై ఒత్తిడి వస్తోంది’ అని ఒక సీనియర్‌ స్టాఫ్‌నర్సు ఆవేదన వ్యక్తం చేశారు. కాన్పు సమయంలో అనుకోని విధంగా గర్భిణులు చనిపోవడం, విపత్కర పరిస్థితుల్లోకి చేరినప్పుడు కుటుంబీకులనుంచి వారికి బెదిరింపులు వస్తున్నాయి. పోలీసు కేసులూ నమోదవుతున్నాయి. ఇటీవల ఇలాంటి ఓ ఘటనలో సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మరో కేసులో చనిపోయిన గర్భిణి కుటుంబానికి ఆరోగ్యసిబ్బంది రూ.3లక్షల వరకు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది.

అల్లరిమూకలతోనూ బెడద
అల్లరిచిల్లరగా తిరిగే యువకులు రాత్రిపూట చిన్న అనారోగ్య సమస్యను చూపుతూ వచ్చి నర్సులను ఇబ్బంది పెడుతున్న సంఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. స్థానిక పెద్దల జోక్యంతో అవి వెలుగులోకి రావడం లేదు. మద్యంతాగి వచ్చి నర్సులను భయపెట్టే వారూ ఉన్నారని ఏపీ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఆస్కారరావు పేర్కొన్నారు. 24 గంటల పీహెచ్‌సీల్లో సిబ్బంది, వారి రక్షణ, మౌలిక వసతుల అందుబాటుపై ఉన్నతాధికారులు తక్షణం దృష్టి పెట్టాల్సి ఉంది. పీహెచ్‌సీల్లో రాత్రిపూట వాచ్‌మెన్‌-కం-నాలుగో తరగతి సిబ్బంది మరొకరిని కూడా నియమిస్తున్నామని ప్రజారోగ్యశాఖ సంచాలకురాలు డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని